Monday, January 27, 2025

జగమెరిగిన దౌత్యవేత్త కె. ఆర్.నారాయణన్

పాత్రికేయునిగా, అధ్యాపకునిగా, ఉద్యోగిగా, విదేశాల్లో భారత విదేశాంగ శాఖ ప్రతినిధిగా,  భారత రాయబారిగా, అత్యుత్తమ దౌత్యవేత్తగా, విదేశాంగశాఖ కార్యదర్శిగా, వైస్ ఛాన్సలర్ గా, మూడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, కే. అర్. నారాయణ్ అందించిన బహుముఖ సేవలు చిరస్మరణీయాలు.

కొచెరిల్ రామన్ నారాయణన్  (కె.ఆర్.నారాయణన్) (1921 ఫిబ్రవరి 4 – 2005 నవంబరు 9) పెరుమథనం, ఉఝవూర్ గ్రామంలో పేద దళిత కుటుంబంలో కొచెరిల్ రామన్ వైద్యర్, పున్నత్తురవీట్టిల్ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన భారతదేశ 10వ రాష్ట్రపతి. నారాయణన్ సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో అనంతరం  సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో చదివి  మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయంలోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు.

హిందూలో, టైమ్స్ లో జర్నలిస్ట్

నారాయణన్ బి.ఎ (ఆనర్స్), ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వ విద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వ విద్యాలయం) నుండి పూర్తిచేసాడు. విశ్వ విద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో  ఢిల్లీ వెళ్ళి ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో పాత్రికేయుడిగా (1944–45) పని చేసాడు.  ఎం.మున్షీ ప్రచురిస్తున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు లండన్ విలేకరిగా వ్యవహరించాడు.

దౌత్యవేత్తగా రాణింపు

పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. నెహ్రూ ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగిగా నారాయణన్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. ఆయన జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌, థాయ్‌లాండ్, టర్కీ, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారత రాయబారిగా పనిచేసాడు. అమెరికాలో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. ఆయనను దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నాడు.

నెహ్రూ సూచన మేరకు దౌత్య సర్వీసులో చేరిక

1949లో భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) నెహ్రూ సూచన మేరకు చేరాడు. దౌత్యవేత్తగా రంగూన్, టోక్యో, కెనడా , హనోయ్ లలో పనిచేసాడు. థాయ్‌లాండ్ (1967–69), టర్కీ (1973–75), చైనా(1976–78) ల భారత అంబాసిడర్ గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీ విరమణ చేసిన తరువాత అతను న్యూఢిల్లీ లోని జవహర్‌లాల్  నెహ్రూ విశ్వ విద్యాలయానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు.  ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా ఆయన అభివర్ణించాడు.  తరువాత పదవీ విరమణ నుండి తిరిగి వచ్చి ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు.

ఇందిర ప్రోత్సాహంతో రాజకీయాలలోకి…

ఇందిరా గాంధీ అభ్యర్థన మేరకు  రాజకీయాలలోనికి ప్రవేశించాడు. 1984, 1989, 1991 లలో వరుసగా మూడు సార్లు పాలక్కాడ్ (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను రాజీవ్ గాంధీ కేబినెట్ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్ , 1985-86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986-89 మధ్య సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు.

1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనారు. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి వి.పి.సింగ్ ప్రతిపాదించాడు. జనతాదళ్ , పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. తరువాత పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇది ఆయన ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.

రాష్ట్రపతిగా  95 శాతం ఓట్లతో ఎన్నిక

కె.ఆర్. నారాయణన్ 1997 జూలై 17 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకయ్యాడు.  రాష్ట్రపతి ఎన్నికలలో అతనికి 95% ఎలక్టోరల్ కాలేజి ఓట్లు వచ్చాయి. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అద్యక్షుని ఎన్నిక ఇది. ఆయనకు టి. ఎన్. శేషన్ ఏకైక ప్రత్యర్థి అభ్యర్థి. శివసేన తప్ప మిగతా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ నారాయణన్‌కు ఈ అధ్యక్ష ఎన్నికలలో మద్దతు నిచ్చాయి.

former president of india kr narayanan death anniversary is on november 9

1998 సార్వత్రిక ఎన్నికలలో నారాయణన్ రాష్ట్రపతి భవన్ సముదాయం లోని ఒక పాఠశాలలో నిర్వహింప బడుతున్న పోలింగు బూత్‌లో సామాన్య ఓటర్లతో కలసి వరుసలో నిలబడి ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా గుర్తింప బడ్డాడు. రాష్ట్రపతిగా నారాయణన్ తన వివేచనా శక్తులను ఉపయోగించి అతను తీసుకున్న వివిధ నిర్ణయాలు, ఆలోచనను దేశానికి వివరించే ముఖ్యమైన ఆచరణను ప్రవేశపెట్టాడు. ఇది అధ్యక్షుడి పనితీరులో పారదర్శకతకు దారితీసింది.

లోతుగా ఆలోచించిన మీదటే ప్రభుత్వాల రద్దు

నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలలో ఎవరికీ సభలో విశ్వాసం పొందవలసిన స్థితి లేదని వారితో సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకున్న తరువాత లోక్ సభను రెండు సార్లు రద్దు చేయ బడింది. రాష్ట్రపతిగా నారాయణన్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలోని 356 అధికరణ క్రింద రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును పునఃపరిశీలించమని రెండు సార్లు కోరాడు. గుజ్రాల్ ప్రభుత్వం (1997 అక్టోబరు 22) ఉత్తర ప్రదేశ్ లోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు,  వాయ్‌పేయి ప్రభుత్వం (1998 సెప్టెంబరు 25) న బీహార్ లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు  ఈ విధంగా పునః పరిశీలను కోరాడు.

ప్రత్యామ్నాయ ప్రపంచీకరణకు మద్దతు

భారత రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తరువాత కె.ఆర్. నారాయణన్ తన భార్య ఉషతో పాటు తన మిగిలిన జీవితాన్ని సెంట్రల్ ఢిల్లీ బంగ్లా (34 ఫృధ్వీ రోడ్) లో గడిపాడు. ముంబై (21 జనవరి 2004) లో వరల్డ్ సోషల్ ఫోరమ్ (WSF) “ప్రత్యామ్నాయ ప్రపంచీకరణ ఉద్యమానికి” తన మద్దతును అందించాడు. ఆయన సిద్ధ, ఆయుర్వేదం కోసం నవజ్యోతిశ్రీ కరుణాకర గురు పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి ఉఝావూరు నుండి పోథెన్‌కోడ్ లోని సంతిగిరి ఆశ్రమానికి వెళ్ళాడు.

కె.ఆర్.నారాయణన్ 2005 నవంబరు 9 న తన 85వ యేట న్యూఢిల్లీ లో మరణించాడు. అతనికి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దహన కార్యక్రమాలను సైనిక లాంఛనాలతో చేసారు. ఇది రాజ్‌ఘాట్ కు సమీపంలోని “కర్మ భూమి” లో జరిగింది.

( నవంబర్ 9, దివంగత రాష్ట్రపతి వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles