• త్వరలో బీజేపీలో చేరనున్న విజయశాంతి
• పార్టీని వీడకుండా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలం
మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరనున్నట్లు కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది రోజుల క్రితం విజయశాంతితో సమావేశమవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. వీరి భేటీ అనంతరం పార్టీలో ఆమె చేరికకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరు 14 న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో విజయశాంతి సమావేశమవుతారని తెలుస్తోంది. అదే రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీలో చేరతారని సమాచారం.
నానాటికి దిగజారుతున్న కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకోవడంలో విఫలమవుతూనే ఉంది. సమస్యలపై గళమెత్తేందుకు సరైన నాయకత్వం లేకపోవడం, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో క్షేత్ర స్థాయిలో పట్టుకోల్పోవాల్సి వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి మూడో స్థానానికి చేరుకుంది. పార్టీకి జవసత్వాలు నింపాల్సిన అధిష్ఠానం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో పార్టీలో ఉన్న ప్రముఖులు బీజేపీ వైపు చూస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా విజయ శాంతి
గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చరుకుగా వ్యవహరించడంలేదని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నా… దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీ తరపున కన్నెత్తి కూడా చూడలేదు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంతో అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించినా ఆమె హాజరు కావడంలేదు. దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో …టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని విజయశాంతి విశ్వసిస్తున్నారు. అందువల్లే ఆ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీతోనే రాములమ్మ రాజకీయ అరంగేట్రం
వాస్తవానికి 1998లో బీజేపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన విజయశాంతి ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. కొన్నాళ్లకు పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. టీఆర్ఎస్ తరపున మెదక్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అటు తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ నేతల విఫలయత్నం
తెలంగాణలో విజయశాంతి పార్టీ వీడకుండా కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. పార్టీని వీడరాదని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ విజయశాంతితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరారు. అయినా ఆమె ససేమిరా అన్నట్లు సమాచారం.