Monday, December 23, 2024

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూత

గువాహతి: మూడు దఫాలు అస్సాం ముఖ్యమంత్రిగా పని చేసిన తరుణ్ గొగోయ్ కోవిద్ మహమ్మారితో పోరాడుతూ సోమవారం  మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. అస్సాం ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు సేవ చేయడమే కాకుండా పార్లమెంటు సభ్యుడుగా ఆరు విడతలు ఎన్నికైనారు.

తరుణ్ గొగోయ్ గువాహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇందిరాగాంధీ ఉపన్యాసాలనూ, భూపేన్  హజారికా పాటలనూ వింటూ అంతిమ శ్వాస వదిలారు. ధ్వనివైద్యం (సౌండ్ థిరపీ)గా పని చేస్తుందనే ఉద్దేశంతో ఆస్పత్రి యాజమాన్యం రికార్డ్ ప్లేయర్ ను ఐసీయూలోకి అనుమతించిందనీ, ప్రజలు చేస్తున్న ప్రార్థనలు ఆలకించడానికి కూడా అది ఉపయోగపడిందనీ తరుణ్ గొగోయ్ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌరవ్ గోగోయ్ తెలియజేశారు.

ఆగస్టు 25న తరుణ్ గొగోయ్ కోవిద్ పాజిటీవ్ ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. మర్నాడు గువాహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరారు. రెండు మాసాల వైద్యం తరువాత కోవిడ్ నెగెటివ్ అని తేలిన అనంతరం ఆస్పత్రి నుంచి విడుదలై ఇంటికి వెళ్ళారు. కానీ కోవిద్ అనంతర సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేయడంతో నవంబర్ 2వ తేదీన తిరిగి అదే ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్ పైనే అప్పటి నుంచీ ఉన్నారు. శనివారం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తొమ్మిది మంది వైద్యుల బృందం తరుణ్ గొగోయ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది. ఈ బృందం దిల్లీలోని ఎయిమ్స్ ప్రవీణులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నది.

ఇటువంటి పరిస్థితులలో వైద్యులు చేయగలిగింది ఏమీ లేదనీ, ప్రజలు ప్రార్థించడం మినహా మరో మార్గం లేదనీ అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి, గోగోయ్ పాత మిత్రుడు హిమంత బిశ్వాస్ శర్మ విలేఖరులతో చెప్పారు. తరుణ్ గొగోయ్ వచ్చే సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతూ, బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు చేస్తూ నిర్విరామంగా పనిచేస్తున్న సందర్భంలో కోవిద్ బారిన పడ్డారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనేవాల్ దుబ్రీగఢ్ పర్యటన విరమించుకొని హెలికాప్టర్ లో గువాహతికి చేరుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles