ఒకప్పుడు…
నే చేసిన మంచంతా
ప్రపంచం మరచిపోయిందని మధన పడేవాడిని.
నే చేసిన చెడూ మరచిపోతోందని
తెలిసినప్పుడు ఇక చింత లేదు.
ఇప్పుడంతా మారిపోయింది…
కీర్తి కండూతి లేదు, నిందా భయము లేదు.
వేసవి కాలం లో ఎండిపోయిన
కొండ చెలమలా పొడిపొడిగా
భావశూన్యంగా మనసు నిర్లిప్తతను
సంతరించుకుంది.
ఇప్పుడు నా అడుగులు
తడబడడం లేదు.
అనుమానంతో అటూ ఇటూ
దిక్కులు చూసే చూపులు
ఒక నూతన నిశ్చలత తో చిక్కబడి
చక్క బడ్డాయి.
పరిచయస్థుల ను చూసినపుడు
కనుబొమ్మలు ఎగరడం లేదు.
శత్రువులు ఎదురు పడ్డప్పుడు
కళ్ళు ఎర్రబడడం లేదు.
కానీ నా మనసు మాత్రం
ముసిముసిగా నవ్వుకుంటుంది.
నాకు తెలుసు
వాళ్ళల్లో చాలామంది నన్ను గుర్తు పట్టటం లేదు!
నేను వాళ్లలో చాలామందిని గుర్తు పట్టటం లేదు.
నిజమే…
కాలగమనం లో మల్లె దండలు వడలి పోతాయి
గాయాల మచ్చలు మాసిపోతాయి
మరకలు మాయమౌతాయి.
అవును…మరపు మంచిదే!
Also read: ప్రకృతి
Also read: ఆమె
Also read: మహా ప్రస్థానం
Also read: దాచుకున్న దుఃఖం
Also read: నమ్మకం
Good