సంపద సృష్టిద్దాం – 9
మనుషులు మూడు రకాలు. గతంలో జరిగిన మంచిని తలచుకుంటూ, ఆ ఊహల ఉయ్యాలలో తూలికలూగుతూ, సంతోషాన్ని అనుభవించే వారు ఒక రకమైతే, ఎప్పుడో జరిగిన దుర్ఘటనలను తలచుకుంటూ, దానివల్లే తన జీవితం తలకిందులైందని ఊబిలో కూరుకుపోతూ పలవరించి దుఃఖాన్ని పొందేవారు రెండో రకం. మూడో రకం వర్తమానంలో జీవించేవారు. నిరంతరం వర్తమానంలో కృషి చేస్తూ, భవిష్యత్తు కోసం అహరహం తపన పడేవారు. కోతులు ఆడించేవారు అడవిలో కోతులను ఎలా పడతారో మీకు తెలుసా?
Also read: విధాతలు మీరే!
కోతులు ఎక్కువగా ఉన్న చెట్టు దగ్గరకు సన్నటి మూతిగల కుండలను వేటగాడు తీసుకువెళతాడు. ఆ కుండలలో దోరగా వేయించిన వేరుశెనగ గింజలు వేస్తాడు. ఆ వాసనంటే కోతులకు భలే ఇష్టం. ఆ వాసన ఎక్కడనుంచి వస్తోందో తెలుసుకుని ఆ కుండల చుట్టూ కోతులు చేరుతాయి. కోతులన్నింటికీ ఆ వేరుశెనగలు అందుకోవాలని గొప్ప తాపత్రయపడుతాయి. వేరుశెనగ పలుకులను తీసుకుందామని కుండలో వాటి చేతిని దూరుస్తాయి. గుప్పిటతో అందినన్ని పలుకులను పట్టుకుంటాయి. అయితే ఆ కుండ మూతి సన్నది కావడం వల్ల, కోతి శెనగ పలుకులు పట్టుకుని తన పిడికిలిని బిగిస్తే ఆ కుండ నుంచి చేతిని బయటకు తీయలేదు. సన్నని మూతినుండి పిడికిలి బయటకు రాదు. మూసిన పిడికిలి విప్పితే ప్రతి కోతి తన చేతిని బయటకు సులువుగా, హాయిగా తీసుకోగలదు, కాని కోతులకు వేరుశనగలు వదులుకోవడం ఇష్టం ఉండదు. శెనగపలుకులు తీసుకోవాలన్న ఆశతో పిడికిలి వదలదు. తన దురాశ వల్లనే కోతులు వేటగాడికి దొరికిపోతాయి.
Also read: ఇస్తుంటే తీసుకుంటాం..
దురాశతో దొరికిపోతాం
మనలో చాలామంది కోతుల మాదిరిగా మన మనసులోని గతకాలపు ఆలోచనలను, ఉద్దేశాలను, అభిప్రాయాలను వదులుకునేందుకు ఇష్టపడం. మన దగ్గరున్న వాటిని వదిలించుకోవడం వల్ల మనకు ఎంతటి స్వేచ్ఛా స్వాతంత్య్రయాలు లభిస్తాయో తెలియజెప్పే గొప్ప ఉదాహరణ ఇది. ఈ ఆలోచనలనే అవరోధాల వల్ల వర్తమానపు నడక సాఫీగా సాగక, కుంటినడక నడిచేలా తయారుచేస్తాయి. ఇప్పుడు మన చేయాల్సింది ఏమిటి, భవిష్యతులో మనం నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఎలా నడవాలి అనే ఆలోచనలు చేయాలి. అంతేతప్ప గతంలోని మన కష్టాల కథలు, అందుకోలేకపోయిన అవకాశాలు, జారవిడుచుకున్న పదోన్నతులు, తప్పిపోయిన బదిలీలు, విడిపోయిన స్నేహాల గురించి పదేపదే తలపోస్తూ.. ఆ వలపోతల్లో విలువైన వర్తమానాన్ని వృధా చేస్తుంటారు. మీ కష్టాల కథలు వినడానికి ఇక్కడ ఎవరికీ అంత తీరుబడి లేదని గుర్తించండి. మీ కష్టం చెప్పుకోవడం మీ బలహీనతే తప్ప, వారి జీవితాల్లో అంతకు మించిన కష్టాలు ఉన్నాయని మర్చిపోకండి. వాటిని వినడానికి అసలు ప్రయత్నించకండి.
Also read: ఇస్తుంటే తీసుకుంటాం..
మీ మనసులో తిష్టవేసిన వ్యతిరేక, బలహీన భావాలను రూపుమాపి, ఆశావహ దృక్పథంతో సంపద సృష్టించే ప్రయత్నాలు ప్రారంభించండి. వాస్తవ వర్తమానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకుంటే, గతాన్ని పాతరేసి బంగారు భవిష్యత్తును తయారుచేసుకోవడమే శరణ్యం. జీవితమే కష్టతరంగా ఉన్నపుడు దానిని మరింత గందరగోళంలోకి నెట్టడమెందుకని ప్రశ్నించుకోండి. డబ్బుకు సంబంధించిన రహస్యాలు, విజయం సాధించడం గురించిన అంశాలను నిరంతరం ఆలోచించండి. ఎవరితో కబుర్లు చెప్పినా మన కబుర్లు అవే కావాలి. తప్పదు మరి.
అడుగు – నమ్ము – పొందు
“నేను చాలా కష్టపడుతున్నాను గాని, నాకు ఫలితం కనిపించడం లేదు’’ అని మీ నోటినుంచి రాకూడదు. ఎదుటివారి నుంచి జాలి ఎట్టి పరిస్థితులలోనూ ఆశించకండి. మనకు తెలియకుండానే జాలి అనేది నెగటివ్ ఆలోచనలకు ఒక పెద్ద ఊబి. కోటీశ్వరులు కావాలనుకుంటున్న సాహసవీరులు ఎవరి మీదా జాలి పడకూడదు. వారి గురించి ఎవరూ, ఎట్టి పరిస్థితుల్లోనూ జాలి చూపించ కూడదు. ఎవరన్నా మనల్ని ఎలా ఉన్నారని అడిగినప్పుడు మన కష్టాల జాబితా వారి ముందు పరచకండి. బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పండి. మనం ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా ఉన్నామని మన నోటినుంచి పలుమార్లు రావడం విశ్వానికి మన కృతజ్ఞతలు తెలుపు కోవడమే. వ్యాపారం లేదా ఉద్యోగం ఎలా ఉందని మన పరిచితులు, స్నేహితులు కుశల ప్రశ్నలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నెగటివ్ గా మాట్లాడకండి. ఎంత ఇబ్బంది ఉన్నా, మన నోటితో ఆ ఇబ్బందులను ప్రస్తావించకూడదు. ఇంత కష్టంలోనూ మనకు అందుతున్న ధనసంపదను గుర్తించి గౌరవించండి. వ్యాపారంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఎగుడుదిగుళ్లు, సహచరులతో లుకలుకల రాజకీయాలూ అన్ని దేశాల్లోనూ అందరూ అనుభవించేవే. ఈ భూమ్మీద మనకు ఒక్కరికే ఇలా జరుగుతోందని భ్రమను వీడండి.
Also read: మనీ పర్స్ చూశారా!
అయితే ఇప్పుడు ఒక కీలక ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి. మీ ఫీలింగ్స్ మిమ్నల్ని కంట్రోల్ చేస్తున్నాయా? లేదంటే మీరే మీ ఫీలింగ్స్ ను అదుపులో ఉంచగలుగుతున్నారా? మన భావోద్వేగాలు మన అదుపులోనే ఉండాలి. మన సుప్తచేతనను మన అధీనంలో ఉంచుకోవాలి. దానికి చాలా ప్రయత్నపూర్వక కృషి చేయాలి. ప్రతిరోజు నిరంతర సాధన చేయడం ద్వారా దీనిని మనం సాధించగలం. అందుకు తోడ్పడే సానుకూల వాక్యాలు లేదా పాజిటివ్ అఫర్మేషన్లను మనం సిద్ధం చేసుకోవాలి. అదే విశ్వ రహస్యం.
తప్పక చేయండి: మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ ప్రస్తుత పరిస్థితులు ఏవన్నా, ఎన్ని ఉన్నా వాటి జాబితాను తయారుచేయండి. ఆ జాబితా ఎంత పొడుగున్నా ఫరవాలేదు. కాని, అందులో రాసిన ప్రతి వాక్యానికి ప్రత్యామ్నాయంగా మీకున్నవాటికి కృతజ్ఞతలు రాస్తూ, ఆ జాబితాను పూర్వపక్షం చేయండి.
Also read: ఈజీమనీకి స్వాగతం!
–దుప్పల రవికుమార్