Sunday, December 22, 2024

ప్రవక్త

                                 ——–

(FOREWORD FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్

—————–

  ఆల్ ముస్తఫా —

  ఆయన అందరికీ ప్రేమ పాత్రుడు.

  అందరికీ సన్నిహితుడు.

  తానే ఉదయ సంధ్య లాంటివాడు.

  జన్మస్థలికి తనని తీసుకుపోయే

  ఓడ కోసం, ఎదురు చూపులు చూస్తూ

  ఆర్ఫేలెస్ నగరంలో

  పండ్రెండు వత్సరాలు గడిపాడు.

  పన్నెండో ఏడు, ఫలసాయం కోసే

  లెలూల్ మాసంలో– ఏడవ రోజున

  నగర గోడలు అడ్డుకోకుండా

  కొండనెక్కి, సాగరం వైపు

  దృష్టిసారించాడు.

  పొగమంచులో

  ఓడ రాకను గమనించాడు!

  అప్పుడు,

            ఆయన హృదయ ద్వారాలు

   ఒక్క ఉదుటున తెరచుకున్నాయి.

   ఆయన ఆనందం — దూరంగా

   కడలి పై నాట్యం చేసింది.

  మనో మౌనంలో ( ఆత్మ నిశ్శబ్దంలో)

  కనులు మూసుకొని ప్రార్థించాడు.

  కానిఆయన కొండ దిగేసరికి

  ఒక నిస్పృహ కమ్ముకుంది.

  మనసులో ఇలా తలపోసాడు:

  నేను ప్రశాంతంగా, దుఃఖ రహితంగా

  ఎలా వెళ్ళగలను?

  లేదు! మనసు గాయపడకుండా

  ఈ నగరాన్ని విడువలేను!

  ఈ నగర గోడల మధ్యనే

  సుదీర్ఘ కాలం బాధతో గడిపాను

  దీర్ఘ రాత్రులు ఏకాకిగా ఉన్నాను

  బాధ నుంచీ, ఏకాకితనం నుంచీ

  విచారించకుండా

  ఎవరు మాత్రం  నిష్క్రమించ గలరు?

  ఈ వీధులలో 

  నా ఆత్మ శకలాలు

  చాలా వెదజల్లాను

  ఈ కొండల్లో

  నగ్నం గా నడిచే

  నా ఆశల పుత్రులు ఎంత మందో!

  భారం, నొప్పి లేకుండా

  వారి నుండి  నన్ను నేను

  ఉపసంహరించుకో లేను!

  ఈరోజు నేను విడనాడేది

  నా ఒంటిపై వస్త్రాన్ని కాదు!

  స్వహస్తాలతో ఒలిచిన — నా చర్మాన్ని!

  నా వెనుక నేను వదిలేది

  నా ఆలోచనా స్రవంతినే కాదు

   ఆకలితో, దాహంతో

  తీయనైన

  నా హృదయాన్ని!

  అయినా,

  ఇంకా తాత్సారం చేయలేను.

  అన్నిటినీ తనలో కలుపుకునే జలధి

  నన్ను పిలుస్తోంది.

  బయల్దేరాలి!

  ఇంకా, ఇక్కడే ఉండటమంటే —

  (రాత్రిళ్ళు కాలం కాలుతున్నా గాని)

  గడ్డకట్టడమూస్ఫటిక అవ్వటమే!

  మూసలో  నిర్బంధించబడటమే!

  ఇక్కడ ఉన్నదంతా నాతోపాటు

  తీసుకు వెళితే బాగుంటుంది

  కాని, ఎలా తీసుకు వెళ్ళగలను?

  తనకు రెక్కలిచ్చిన

  నాలుకను, పెదాలనూ

  ఏ గళం తీసుకొని పోగలదు?

  ఒంటరిగానే అది ఆకసాన్నందుకోవాలి!

  డేగ ఒంటరిగానే

  (తన గూడు లేకుండానే)

  సూర్యునికి అభిముఖంగా

  ఎగురుతుంది కదా!

   కొండమొదలుకు ఆయన

   జేరినప్పుడు, సాగరం వైపు

  తిరిగి దృష్టిసారించాడు.

  ఓడ —  రేవును

  సమీపించడం చూశాడు.

  దాని ముందు భాగంలో

  తన జన్మ భూమికి చెందిన

  నావికులు ఉండడం చూశాడు!

  ఆయన ఆత్మ వారి కోసం

  బిగ్గరగా అరిచింది.

  ఆయన ఇట్లా అన్నాడు :

  నా ప్రాచీన నేలతల్లి పుత్రులారా!

  అలలపై స్వారీ చేసే నావికులారా!

  నా కలల అలలపై ఎన్నోసార్లు

  మీరు ప్రయాణించారు.

  ఇప్పుడు నా మెలకువలో వచ్చారు.

  ఇది నా హృదయపు లోతుల్లో

  దాగున్న కల!

  సాగర పయనం చేయాలనే

  తహతహతో ఉన్నాను

  ఈ నిశ్చల పవనంలో

  ఒక్క శ్వాస తీసుకుంటాను!

  మరొక్కసారి  నా ప్రేమ దృక్కును

  వెనుకకు సారిస్తాను.

  తదుపరి, మీలో ఒకడిగా

  మీతో  పయనిస్తాను!

  నిదురించే తల్లీ! నా సాగరమాతా!

  నదికి, ప్రవాహానికి

  నీవే కదా స్వేచ్ఛా, స్వాతంత్ర్యమూ!

  ఒక్కసారి  ఈ ప్రవాహాన్ని (నన్ను)

  మలుపు తిరగనీండి!

  ఈ అడవి మధ్య ఖాళీలో

  గుసగుసలాడనీండి!

అప్పుడు హద్దులు లేని ఈ నీటి బిందువు

నీ అనంత జలాల్లో

 లీనమవడానికి వచ్చేస్తుంది!

 తమ తమ పొలాలను, మద్యపు కార్ఖానాలను

 విడిచి స్త్రీ పురుషులందరూ

 త్వర త్వరగా నగరద్వారాల వద్దకు

 వస్తూండడం — దూరం నుంచే

 ఆయన నడుస్తూ గమనించాడు!

 ఓడ రాకడను

 ఒకరికొకరు తెలుపుకుంటూ–

 ఒక పొలం నుండీ మరొక పొలంకు

 తన పేరును ఉచ్చరిస్తూ

 అరచుకోవడం —  ఆయన చెవిని బడింది!

 ఆయన ఇట్లా అనుకున్నాడు :

 విడిపోయే రోజు కూటమి దినం అవుతోందా?

 నిజానికి,

 నా సాయం సంధ్య

 ఉదయ సంధ్య అయిందనుకోవచ్చా?

 నాగలిని గీత మధ్యలో వదిలి వచ్చే వారికి

 మద్యపు యంత్రాన్ని నడిలో ఆపి వచ్చేవారికి

 — నేనేమి ఇవ్వగలను?

 నా హృదయం — ఫలాల భారంతో ఉన్న వృక్షమయితే —

 నేను ఆ ఫలాలు పోగు చేసి వారికి ఇస్తే ?!

 నా వాంఛలు ఊటలా పైకుబిగితే

 నేను వారి పాత్రలను నింపవచ్చా?!

 అనంత శక్తి తన చేతులతో నన్ను —

 స్పృశించే వీణ నైతే?!

 ఆశక్తి నాలోకి పయనించే

 శ్వాసకు వేణువునైతే?!

 మౌన అన్వేషి నైన నేను

 విశ్వాసంతో పంపిణీ చేసే

 ఏ నిధిని ఈ నిశ్శబ్దంలో కనుగొన్నాను?!

 ఇది నా పంట వచ్చే రోజు అయితే

 ఏ పొలాల్లో, ఏ ఙ్ఞప్తికి లేని రుతువుల్లో

 నేను విత్తనాలు నాటాను?!

 ఇది నిజానికి,

 నేను దీపం పెట్టే వేళ అయితే,

 దానిలో వెలిగే జ్వాల నాది కాదు!

 ఖాళీ , చీకటి దీపాన్ని నేను పైకెత్తితే

 రాత్రి సంరక్షకుడు

 దీపానికి నూనె పోసి వెలిగిస్తాడు!

 ఈ పైవన్నీ ఆయననుండి

 మాటల రూపంలో వెలువడినాయి!

 హృదాంతరాళాల్లో వ్యక్తం కాని

 భావాలు ఎన్నో  … ఎన్నెన్నో!

  ఎందుకంటే,

 తన అంతరంగ ఆంతర్యాన్ని

 తానే చెప్పలేకపోతున్నాడాయన!

 ఆయన నగర ప్రవేశం చేయగానే

 జనమంతా ఆయన వద్దకు చేరుకున్నారు

 ఒకే  గళంతో– ఆయన కోసం విలపించారు!

 నగర పెద్దలు నిలబడి ఆయనతో ఇలా అన్నారు :

 మా నుండి దూరం కాకండి

 మా  కనుచీకటిలో

 మధ్యాహ్న సూర్యుని లాంటి  వారు మీరు

 మీ యవ్వనం మాకు స్వప్నించే కలలనిచ్చింది!

 మాలో మీరు కొత్త మనుషులు కారు

 అతిధీ కారు!

 మీరు మా పుత్రులు

 మాకు అత్యంత ప్రేమాస్పదులు

 మీ ముఖం కోసం కరువ్వాచే పరిస్థితి

 మా కన్నులకు  కలిగించకండి !

 పూజారులు, పూజారిణులు

 ఆయనతో ఇంకా ఇలా అన్నారు :

 సాగరపు అలలు మనల్ని వేరు చేయొద్దు

 మా మధ్య మీరు గడిపిన ఏళ్లు

 ఒక జ్ఞాపకంలా  చెయ్యొద్దు!

 మీరు మా మధ్య ఒక అంతరాత్మలా నడిచారు

 మీ ఛాయ — మా ముఖాలపై

 ఒక వెలుగులా  ప్రకాశించింది!

 మేము మిమ్ములను ఎంతో ప్రేమించాము

 కానీ మా ప్రేమ మూగవోయింది!

 కానీ ఇప్పుడు మీకోసం పెద్దగా విలపిస్తోంది

 మీ ముందు బహిర్గతమవుతోంది!

 ప్రేమ —

 ఎడబాటు అయ్యే క్షణం వరకూ

 తన లోతు తెలుసుకోదు !

 మిగిలిన వారు కూడా వచ్చి

 ఆయనను వేడుకున్నారు

 ఆయన జవాబివ్వలేదు

 తల మాత్రం వంచుకున్నాడు

 ఆయనకు దగ్గరగా నిలబడ్డ వారు

 కన్నీరు ఆయన వక్షంపై పడటం

  గమనించారు !

  ఆయనా, ప్రజలూ గుడి ముందు

  ప్రదేశానికి చేరుకున్నారు.

  అప్పుడు, పవిత్ర స్థలం నుండి ఒక

  సన్యాసిని బయటకు వచ్చింది.

  ఆమె పేరు ఆల్ — మిత్రా!

  ఆయన ఆమెపై

  అతి సున్నితమైన

  దృక్కులను  సారించారు!

  ఆయన ఆ నగరానికి వచ్చిన ఒక్కరోజులోనే

  ఆమె ఆయనను కనుగొని, నమ్మింది !

  ఆల్ మిత్రా ఆయనను కొనియాడుతూ

  ఇలా చెప్పసాగింది :

  ఓ దేవుని ప్రవక్తా!

  బహుదూరంగా ఉన్నదాని అన్వేషణలో

  మీ ఓడ ఎంత దూరంలో ఉందో కనుగొన్నారుగా!

  ఇప్పుడు మీ ఓడ వచ్చేసింది

  వెళ్లక తప్పదు.

  మీ జ్ఞాపకాల భూమికి,

  మీ గొప్ప ఆకాంక్షల నివాస స్థలానికి

  వెళ్లటానికి మీ మనసు

  ఎంత తహతహలాడుతోందో కదా!

  మా ప్రేమ గాని, మా అవసరాలు గాని

  మిమ్మల్ని బంధించి ఉంచలేవు!

  అయినా, మీరు మమ్మల్ని వదిలే ముందు

  మాతో మాట్లాడండి

  మీ సత్యాన్ని మాకు ఎరుక చేయండి!

  మా బిడ్డలకు మేము అదే సత్యాన్ని అందజేస్తాం!

  వారు, వారి పిల్లలకు అందజేస్తారు!

  అలా, సత్యం మరణ రహితంగా

  తరాలు కొనసాగుతుంది

  మీ ఏకాంతంలో మా దినాలు వీక్షించారు

  మీ మెలకువలో నిదురలోని

  మా దుఃఖాలు, మా నవ్వులు చూశారు.

  అందుకని, ఇప్పుడు మా గురించి మాకు చెప్పండి .

  ఈ జనన, మరణాల మధ్య ఏముందో

  మాకు విశదీకరించండి.

Also read: మతం

Also read: ఇసుక పైన

Also read: దేహము– ఆత్మ

Also read: మరణం

Also read: ఇద్దరు వేటగాళ్ళు

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles