నాన్నంటే అన్నం నాన్నంటే గుడ్డ, నాన్నంటే ఇల్లు
నాన్నంటే రోటీ కపడా అవుర్ మకాన్
నాన్నంటే కుటుంబ వ్యవస్థ
నాన్నంటే ప్రారంభం.
నాన్నంటే నడక, నాన్నంటే పరుగు
నాన్నంటే వ్యవహారాలన్నీ నడిపే ఇంటి అరుగు –
ఒక్కోసారి నాన్నకు తన కుటుంబమే చిన్ని ప్రపంచం
చిన్నారి బుజ్జిగాళ్ళకు మాత్రం నాన్నంటే ఒక పెద్ద ఆకాశం
నాన్నంటే కలల ఆకాశంలో ఎగరేసుకునే పతంగి
కళ్ళ ముందు కదలాడే రంగుల సింగడి
నాన్నున్న ప్రతివాడూ మరిపాల దొరబిడ్డే
నాన్నంటే అమ్మకు తాళిబొట్టు, అస్థిత్వం, గౌరవం
నాన్నుంటే చాలు బజారులోని బొమ్మలన్నీ పిల్లలవే
నాన్నుంటే చాలు చీరలు, నగలూ అన్నీ అమ్మవే
ఉత్సాహాలు, ఉద్వేగాలు, ఊహలు
నిజమయ్యే వాస్తవాలు – అన్నీ వాళ్ళవే!
నాన్నంటే ఒక ఆశ ఒక ఆశయం
ఎంత తాగినా తరగని జలాశయం!!
నాన్న లేనిది అమ్మలేదు
అమ్మ లేక నాన్న లేడు
నాన్నంటే కట్టుబాటు
అయినా, ఆయనుంటేనే వెసులుబాటు
నాన్నంటే హితుడు – స్నేహితుడు
ఒక ధీమా ఒక జీవిత బీమా
నాన్నంటే నిరంతరం ఒంట్లొ ప్రవహించే మధురగీతం
ఆయనుంటేనే ప్రతి ఇంట్లో జీవన సంగీతం
గలగలలూ సవ్వడులూ బతుకు చప్పుళ్ళు
ముందు గదిలో నాన్న సముద్ర గంభీరంగా కూచుంటే చాలు
వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు జీవనదుల్లా ప్రవహిస్తుంటారు
నాన్న అభయముద్ర ఒక చూపులా
ప్రేమగా వెన్నంటి వస్తే చాలు
చదువులైనా, ఉద్యోగాలైనా
అయస్కాంతంలా వచ్చి మీద పడుతుంటాయి
అది, ఆయన చేసే మేజిక్కేమీ కాదు,
తన అంతరంగంతో ఆయన, తనని తాను
తన పిల్లలతో బలంగా అనుసంధానించుకున్న తీరు
తను నవ్వుల పాలయినా సరే
తన పిల్లల ముఖాల మీద
నవ్వులు పూయించే వనమాలి
తను అవమానాల పాలయినా సరే
తన పిల్లలు తలెత్తుకు తిరగాలనుకునే తోటమాలి
వృత్తి ఏదైనా సంసార సేద్యం చేసే ప్రతి నాన్నా ఓ రైతే
జీవితాంతం స్వేదం పారించే ప్రతినాన్నా ఓ కౌలుదారే!
మారు వేషంలో బాగోగులు తెలుసుకునే మహారాజు నాన్న
సమస్యకు పరిష్కారాన్ని ఆజ్ఞాపించగలడు
అవసరమైతే తనే కూలీలా నడుం వంచనూ గలడు
పిల్లల భూమండలానికి నాన్న ఓ-‘ఒజోన్ పొర’
తన హెచ్చరికల సెటిలైట్ వారి కక్ష్యలో
ప్రవేశించిందా లేదా చూసుకునే కంప్యూటర్ తెర
పిల్లలు వాళ్ళమ్మని పొగడుతూ ఉంటే
ముసిముసిగా నవ్వుకునే నాన్న మనసు
ఎంత విశాలమో ఎవరికి తెలియాలీ?
అందరికీ అన్నీ సమకూర్చి తనదేమీ లేదన్నట్టు
తానేమీ కాదన్నట్టు వేదాంతిలా పక్కకు జరిగే
నాన్న ఔదార్యం, ఇంత వరకు ఎవడికి అంతుచిక్కిందనీ?
నాన్న ఏదీ చెప్పినట్టుగా అనిపించదు
అయినా, నిశ్శబ్దంగా అన్నీ చెబుతూనే ఉంటాడు.
జీవితాన్ని జయించిన వారికి
ఆత్మావలోకనంలో వాళ్ళనాన్న
జెండాలా రెపరెప లాడుతూనే ఉంటాడు
నాన్నంటే చిరునామా నాన్నంటే వీలునామా
నాన్నంటే భయం-నాన్నంటే అభయం
నాన్నుంటే కోలాహలం
నాన్న లేని బతుకు హాలాహలం!
కుటుంబ సాహితిలో నాన్న
ఒక మూల బాక్స్ లో కవిత
పిల్లలే అనువాదాలు
మరి అనువాదకులెవరూ? ఇంకెవరూ – అమ్మే-
చాలాసార్లు అమ్మ లేకపోతే నాన్న లొంగడు
నాన్న వ్యక్తిత్వం కనబడదు-
ఇంటి గోడలకు అందమైన పెయింటింగ్ లా పట్టుకుని
హుందాగా ఉంటుందే తప్ప,
నాన్న అంతరంగం వినబడదు-
కనబడనివన్నీ లేవనుకుంటే కష్టం
ఇంట్లో నాన్న చెమట కనబడదు
ఇంటికున్న పునాదులూ నకబడవు
కొన్ని కనబడకుండానే స్థిరత్వానిస్తుంటాయి
కొన్ని సార్లు కొందరికి – పని అయ్యేదాకా
నాన్నంటే కామధేనువు
పని అయిపోయాక ఇక ఇసుక రేణువు
రెక్కలు తెగి పడి పోయిన పక్షులు
నాన్నలు ఈ దేశంలో కోకొల్లలు!
Also read: నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ
Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!
Also read: చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!
Also read: బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!
Also read: దిల్ కి బాత్