—————————-
(‘ON EATING AND DRINKING ‘ FROM
‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
ప్రయాణీకుల బసను పర్యవేక్షించే ఒక పెద్దమనిషి
ఆల్ ముస్తఫాను ఇలా అడిగాడు.
‘‘తినటం, త్రాగటం గురించి మాకు చెప్పండి.”
ఆల్ ముస్తఫా చెప్పసాగాడు:
గాలిలో చెట్లు వెలుతురుతో జీవించినట్లు,
మీరు నేల సుగంధాన్ని పీల్చుకుని బ్రతక గలరా!
మీ ఆహారం కోసం జంతు వధ తప్పదు
మీ దాహం కోసం లేగదూడ తల్లిపాలు
దోచుకోవటం మీకు తప్పదు!
కనుక,
అది ఒక ఆరాధ్య కార్యంగా మలచుకోండి!
మీ ఇంటినే బలిపీఠం చేసుకోండి!
పవిత్రమైన, అమాయక, పశుపక్ష్యాదులు–
(అడవిలోని, మైదానాల్లోని)
వాటికంటే పవిత్రమైన, అమాయకమైన
జీవితాల కోసం
ఆ వధ్యశిలపై బలి కాబడతాయి
జంతు వధ చేసినప్పుడు మీ హృదయంలో ఇలా అనుకోండి
“ఏ శక్తితో మీరు వధింప బడుతున్నారో
అదే శక్తి మమ్ములను వధిస్తుంది.
మేము కూడా మరొకరికి ఆహారం అవుతాము!
“ఏ చట్టం మిమ్ములను మా చేతికి అప్పగించిందో,
అదే చట్టం మా కంటే బలమైన చేతికి మమ్ము లను అప్పగిస్తుంది!
“మీ రక్తం, మా రక్తం — రెండూ కూడా
స్వర్గ వృక్షానికి జీవ జలమే!”
మీరు ఆపిల్ పండు పంటితో కొరికి నప్పుడు,
మీ మనసులో ఇలా అనుకోండి:
“మీ విత్తులు మా శరీరంలో జీవిస్తాయి
“ఆ మొగ్గలు రేపు మా హృదిలో
పుష్పించి వికసిస్తాయి
“మీ సుగంధమే మా శ్వాస అవుతుంది.
“మనమిద్దరమూ కలిసి ,
అన్ని రుతువుల లోనూ
ఆనందానుభూతి పొందుతాం!”
శరదృతువులో,
ద్రాక్ష తోట లోని పళ్ళతో
మద్యం తయారు చేసేటప్పుడు
మీ హృదయంలో ఇలా అనుకోండి:
“మేమూ ద్రాక్ష తోటలమే
మా పళ్ళు కూడా మద్యం తయారీకి
సమకూర్చ బడతాయి!
“కొత్త మద్యం లా మేము కొత్త పీపాల్లో పెట్ట
బడతాము!”
శీతాకాలం మద్యం తీసినప్పుడు–
తీసే ప్రతి పాత్రకు
మీ మదిలో ఒక గీతం పాడుకోండి:
ఆ గీతం —
శరదృతువు, ద్రాక్షతోట
మద్యం తయారీల గురించిన–
జ్ఞాపకాలతో
నిండి పోనీండి!”
Also read: సన్యాసి ప్రవక్త
Also read: బంగారు బెల్టు
Also read: దాతృత్వం
Also read: జాద్ మైదానము
Also read: నిండు చంద్రుడు