ఉరుముల నాగన్న బృందం
ఆకాశవాణిలో నాగసూరీయం -11
“…కురిసే వానలో, మెరిసే మేఘంలో, పారే పంట కాల్వల్లో, పైరు మీద పరుగెత్తే పసి తెమ్మెరలో, చిగురు దున్నెల్లో, పొర్లే ఆశలో, పులకించే మనసులో, ఎన్నెల పిట్ట రొదలో, నిశ్శబ్దంలో, నర్తనలో, బతుకు జీరలో – అట్టా జీవితం ప్రతి అంచునా….”
Also read: జంట ప్రసంగాల కదంబం – బొమ్మా, బొరుసా
అంటరాని వసంతం
ఈ మాటలు ఎక్కడివో గుర్తుపట్టగలరా? జి. కళ్యాణ రావు రచించిన ‘అంటరాని వసంతం’ నవల లోనివి! రెండు దశాబ్దాల క్రితం ఈ నవల గొప్ప సంచలనం రేపింది. కఠోర వాస్తవికతకు దర్పణంగా ‘అంటరాని’ అనే మాట ‘వసంతం’తో ముడిపడటం మొదట తారసపడినప్పటి నుంచి అంతే స్థాయిలో ఆలోచనలు రేపుతోంది. చరిత్రపుటల్లో దాగిన క్రౌర్యాన్ని బట్టబయలు చేస్తుంది ఈ నవల. అంతకు మించి కోస్తా జిల్లాలతో పాటు అనంతపురం జిల్లా దళిత జీవనంలోని సౌందర్యం కూడా ఇందులో నిక్షిప్తమై ఉంది. చంద్రన్న, నాగన్న, ధర్మవరం, దీపాల దిన్నె గ్రామం – వీటితోపాటు ఉరుముల నృత్యం కళారూపం కూడా నవలలో ప్రధానపాత్ర వహిస్తాయి.
ఈ నవలను 2000 సంవత్సరం లో చదివినపుడు – ఈ నృత్యం నుంచి పేరిణి నృత్యం పరిణమించిందని తెలుసుకొని ఉద్వేగానికి గురయ్యాను. ఉరుముల నృత్యం గురించి జాగ్రత్తగా గుర్తుచేసుకుంటే అది నేను బాగా ఎరిగినదేనని బోధపడింది. ఇంత గొప్ప వారసత్వం గురించి ఆ జిల్లాకు చెందిన నాకు తెలియకపోవడం సిగ్గుచేటు కదా అనిపించింది! మరి, మిగతావారికీ, మిగతా ప్రాంతాలకు ఎలా పరిచయం అవుతుంది? ఇలాంటి సందర్భంలో సంబంధించిన చరిత్రనూ, గొప్ప కృషి చేసిన మహానుభావుల విజయాలను తెలుసుకోవడానికి, నా వరకు ప్రయత్నాలు మొదలవుతాయి. జన మాధ్యమాల (మాస్ మీడియా) లో పనిచేసేవారు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మరికొంత మందికి చేరే అవకాశం ఉంది!
Also read: చిరస్మరణీయమైన ‘వెలుగుజాడ’ ధారావాహిక!
ఉరుముల నృత్యం
‘అంటరాని వసంతం’ నవల చదివినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. అప్పట్లో ‘కృష్ణా ఉత్సవాలు’ జరిగేవి. వారి నిర్వహణకు సంబంధించి కల్చరల్ కమిటీలో సభ్యుడిగా జానపద కళారూపాలను ప్రదర్శించాలనే ప్రతిపాదన వచ్చినపుడు, ‘ఉరుముల నృత్యం’ చేర్చమని ప్రతిపాదించాను. అందులో భాగంగా వారు వచ్చి ప్రదర్శించారు కూడా! ఆ సమయంలో ఒక విషయం స్పష్టంగా బోధపడింది. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రాసిన ‘తెలుగువారి జానపద కళారూపాలు’ చాలా సమగ్రంగా, ప్రత్యక్ష అనుభవంతో సాగిన గ్రంథం. దానిలో సైతం ఉరుముల నృత్యం గురించి చాలా అరకొరగా, అస్పష్టంగా ఉంది. నిజానికి అన్ని కళారూపాలు చూసి, రాయాలంటే ఎవరికైనా సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం పరిశీలించాక ప్రతిప్రాంతపు జానపద కళారూపాలు సంబంధించిన చరిత్ర, ప్రదర్శనా విధానాలలో మార్పులు, వాడే వాయిద్యాలు, ఇతర పరికరాలు, గొప్పగా కృషి చేసిన మహానుభావులు గురించి సమాచారం డాక్యుమెంట్ చేయడం అవసరమనిపించింది. అయితే, మన అవసరం గురించి ఇంకొకరితో చెప్పడం కన్నా, వీలయితే మనమే చేస్తే ఆ పనిలో సమగ్రత కూడా సిద్ధిస్తుంది!
అనంతపురం కేంద్రానికి రెండో సారి
2002 మధ్యలో అకస్మాత్తుగా నాకు అనంతపురం ఆకాశవాణికి బదిలీ అయ్యింది. అంతకు క్రితం 1991-1996 సంవత్సరాల కాలంలో అక్కడ పని చేశాను కనుక జిల్లాకు సంబంధించిన ప్రాథమికమైన అవగాహనతోపాటు ఏ కళాకారుడు ఏ స్థాయిలో ఎంత నాణ్యంగా ఆకాశవాణికి దోహదపడగలరో అనే విషయం గురించి కూడా స్పష్టత ఉంది.
Also read: అన్నమయ్య పదగోపురం
జానపద కళారూపాలుగా పిలువబడేవి గ్రామీణ ప్రాంతాలలో, శ్రామిక కులాలలో, శరీర కష్టంతో కూడుకుని ఉన్నవి. వీటిలో కళాకారుడి గొంతుక, సంగీత వాయిద్యాలతోపాటు పరిసరాలు, పక్షులు, జంతువులు కూడా అంతర్భాగమవుతాయి. అంతకు మించి పద్ధతి, పాట, ఆటకు సంబంధించి గ్రంథస్థమైంది బాగా తక్కువ! ఒక తరం నుంచి మరో తరానికి నేరుగా అందేది ఎక్కువ. ఒకే కళారూపం సైతం ప్రాంతం బట్టి కూడా మార్పులకు లోనవుతుంది. అలా పరిగణిస్తే బాగా వృద్ధి చెందిన కళారూపాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 150-200 పైగా ఉన్నాయని అర్థమైంది. వాటిలో యాభై దాకా అనంతపురం జిల్లాలో ప్రచారంలో ఉన్నాయని కూడా స్పష్టమైంది.
హాస్యనటుడిగానే కాకుండా, కాదరయ్య పాటతో కూడా ప్రాచుర్యంలోకి వచ్చిన గ్రంథాలయోద్యమశీలి అమళ్ళదిన్నె గోపీనాథ్ (అనంతపురం జిల్లా అప్రశ్చెరువులో 1933లో జన్మించి, 2007 ఆగస్టు 15న కాలం చేశారు ) వారిని సంప్రదించిన తర్వాత మరికొన్ని విషయాలు తేటతెల్లం అయ్యాయి. ఉరుములు, గొరవయ్యలు, డప్పులు, కీలుగుర్రాలు, మరగాళ్ళు, కుంచెల నృత్యం, పోటీవేషాలు, నామాలసింగడు, కోలాట, చెక్కభజన, పండరి భజన, తోలుబొమ్మలు, పగటి వేషాలు, దాసప్ప, బుడబుడకలు, యక్షగానాలు, బయలు నాటకం, హరికథలు, బుర్రకథలు, పులివేషం, గంగిరెద్దులాట, కోతి ఆట, ఎలుగుబంటి ఆట, కోతి పందేలు, పావురాల పందేలు, ఎడ్లపందేలు, దొమ్మరాట, చౌడమ్మ జ్యోతులు, బీరప్ప డోలు, కత్తిసాము – కర్రసాము, ఎరుకలసాని (సోదె), ఉట్లమాను – ఆ జిల్లా పల్లె కళలలో ఇవికొన్ని!
Also read: ఉత్సవరథానికి ఉజ్వల సందర్భం
పల్లె కళారూపాలు
అనంతపురం పల్లె కళారూపాలు గురించి ధారావాహికంగా 8 నిమిషాల చిరుప్రసంగాలు చేద్దామని అప్పటి ఆకాశవాణి డైరెక్టరు ఎస్.హెచ్. అంజనప్పతో సంప్రదించాను. వారు కన్నడ రాష్ట్ర సరిహద్దు తుముకూరులో జన్మించిన తెలుగువారు, పల్లె జనాలంటే మక్కువ. ఆలస్యం చేయకుండా ప్రారంభించమన్నారు. బహుశా అది 2003 లో అయి ఉండవచ్చు. తొలుత 13 ప్రసంగాలు చేయమని గోపీనాథ్ ను కోరాం (పదమూడుకు ప్రాధాన్యత ఏమీలేదు. మూడు నెలల వ్యవధిలో ఏ వారమైనా పదమూడుసార్లు వస్తుంది, అంతే). రక్తి కడుతోందని, మరో 13 వారాలు పొడిగించి మొత్తం 26 కళారూపాల గురించి చిరు ప్రసంగాలు చేయించాం. గోపీనాథ్ గాయకుడు, హాస్యనటుడు కనుక ప్రసంగాల మధ్యన చిన్న పల్లవులు, చమత్కారాలు జోడించి ఎంతోమందిని అలరించారు. అప్పటికి సోషల్ మీడియా ఆచూకీ పొడసూపలేదు. కేవలం రేడియో ద్వారానే ఎంతోమంది విన్నారు.
ప్రసంగాల రూపకల్పనలో గోపీనాథ్ కృషి
గోపీనాథ్ కి అప్పటికి సుమారు డెబ్బయి సంవత్సరాలుంటాయి. చాలా ఆనందంగా, తృప్తిగా ప్రసంగాలను రూపొందించి, శ్రోతలతో పంచుకున్నారు. అంతటితో ఆగక ఈ ప్రసంగాలు ఆధారంగా 194 పేజీల పుస్తకాన్ని ‘అనంత జానపద కళారూపాలు’ అనే పేరుతో 2004-2005లో ప్రచురించారు. అంతకుమించి ఆ కళారూపాలను కులపరమైనవి, ప్రబోధాత్మకాలు, ఆరాధన, వినోదం, వీరోచితం, జంతు కళారూపాలు, జంతు అభినయ కళారూపాలు అంటూ వింగడించారు. చివరిలో, నేటి సమాజానికి ఎలా దోహదపడగలవో ఈ జానపద కళారూపాలు అంటూ ఒక విశ్లేషణ కూడా రాశారు.
ఇప్పుడు ఆ కృషి అనంతపురం జిల్లా కళా వారసత్వానికి ఒక రెఫరెన్స్ పుస్తకం. నా పూనిక ఆకాశవాణి ద్వారా నా సొంత జిల్లాలో పనికొచ్చేపని ఒకటి జరిగిందనే తృప్తి మిగిలింది!
Also read: వెళ్ళలేనిచోటే లేని రెక్కల గుర్రం!
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్-9440732392