జానపద సాహిత్యంపై పరిశోధన అనగానే తొలుత స్ఫురించే పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు. శిష్ట సాహిత్యానికి పునాదిగా చెప్పే జానపద సాహిత్యంపై ఎందరో ప్రముఖులు పనిచేసినా సమగ్రంగా పరిశోధన చేసి, అనంతర పరిశోధనకుబాట వేసి, పరిశోధకులకు రామరాజు మార్గదర్శకులయ్యారు. `తెలుగు జానపద గేయ సాహిత్యము` సిద్ధాంత వ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో మొదటిదే కాకుండా జానపద సాహిత్యంపై దక్షిణ భారత దేశంలోని తొలి పరిశోధన వ్యాసంగా గుర్తింపు పొందింది. ఈ పరిశోధనకు సంబంధించి ఎదుర్కొన్న సాధకబాధకాల గురించి సందర్భానుగుణంగా చెప్పేవారు బిరుదురాజు వారు.
జననం..చదువు
వరంగల్ జిల్లా దేవునూర్ గ్రామంలో 1925 ఏప్రిల్ 6వ తేదీన నారాయణరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించినరామరాజు స్వగ్రామంలోని వీధిబడిలో చేరి, ప్రాథమిక విద్యను మండికొండలో, ఇంటర్మీడియట్ హన్మకొండలో, బి.ఎ. హైదరాబాద్ నిజాం కళాశాలలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తి చేసి, ఆచార్య ఖండవల్లి లక్ష్మినిరంజనం పర్యవేక్షణలో (1952-55) `తెలుగు జానపద గేయ సాహిత్యం` అనే శీర్షకితో పరిశోధన చేసి పీహెచ్. డి. పట్టా పొందారు. సంస్కృతంలోనూ ఎం.ఎ.చేసి పీహెచ్.డి. పొందారు. కళాశాలలో పార్ట్ టైం ఉపన్యాపసకుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు.ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడిగా (1951) చేరి అంచెలంచెలుగా డీన్, విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడిగా ఎదిగారు. కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య,అక్కిరాజు రమాపతిరావు, ముదిగొండ వీరభద్రశాస్త్రి, రవ్వా శ్రీహరి లాంటి ప్రముఖులు సుమారు 40 మంది ఆయన పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు.
పరిశోధనాసక్తి
చిన్నప్పుడు నాయనమ్మ గారు చెప్పిన జానపద కథలు, పుట్టిన ఊరిలో పొలం పనుల సమయంలో శ్రమజీవులు పాడుకునే పాటలు జానపద సాహిత్యంపై ఆసక్తి కలిగించాయి. పాఠశాల, కళాశాల విద్య నుంచే జానపద గీతాలు సేకరణ మొదలుపెట్టానని చెప్పేవారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనకు అనుమతి లభించిన వెంటనే మొదట యక్షగానం అంశాన్ని ఎన్నుకోవలసి వచ్చిందని, ఆరునెలలు పనిచేసిన తరువాత జానపద సాహిత్యంపై పరిశోధనకు అవకాశం కలిగిందని చెప్పేవారు.
Also Read: తెలుగు భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి అస్తమయం
పల్లెపల్లె సందర్శన
పరిశోధనకు అవసరమైన సమాచార సేకరణకు.. ప్రయాణ సౌకర్యం అంతగాలేనికాలంలోనేతెలంగాణలోని అనేక పల్లెలు తిరిగారు. సుమారు రెండున్నరేళ్లపాటు తిరిగి సమాచారం సేకరించారట. అయితే అది అనుకున్నంత సులువుగా సాగలేదని చెప్పేవారు.జానపదం అంటే మౌఖిక సాహిత్యం.జానపదులు (పల్లీయులు)పాడుతున్నప్పుడు సేకరించిన దానిలోనే జవం,జీవం ఉంటుంది. కొందరు భయం వల్ల, మరికొందరు సిగ్గుతో పాడేవారు కారట.ఫొటోలు తీసేందుకు అనుమతించేవారుకారట. ఫొటో(లు)తీస్తే శరీరం శుష్కించిపోతుందని, కంఠమాధుర్యం చెడిపోతుందన్ననమ్మకంతో సహకరించేవారు కాదట.అడిగి పాడించుకోవడం కష్టంగా ఉన్న సమయంలో వారు పనిపాటల్లో నిమగ్నమై పాడుకుంటున్న వేళ చాటుమాటునుంచి రాసుకునేవారట, ఫొటోలు తీసుకున్నారట. ఒక గ్రామంలో పాడిన వారి పాటలు మరో గ్రామంలోని వారికి పాడి వినిపించి, ఆ స్ఫూర్తితో పాడించుకునేవారట. పాటల సేకరణ కోసం వారికి పాత దుస్తులు,పైకం ఇవ్వడం,కల్లు పోయించడం, పొగాకు ఇవ్వడం లాంటి తాయిలాలు ఇచ్చేవారట. అయినా లొంగని వారిని గ్రామాధికారులు, పోలీసులతో గట్టిగా చెప్పించి, బెదిరించి పాడించుకున్నసందర్భాలు ఉన్నాయట. జానపద గాయక భిక్షుకులు మాత్రం అడిగినంత పాడేవారట. సమాచార సేకరణలో వారిని అలా ఇబ్బంది పెట్టినందుకు పశ్చాత్తాపం చెందారు.
రేడియో సహకారం
జానపద సాహిత్యకారులు నేదునూరి గంగాధరం, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేసే జానపద గేయాలను తొందత తొందరగా రాసుకునేవారట. సమాచార సేకరన సమయంలో పాడేందుకు బిడియపడేవారికి వెంట తీసుకవెళ్లిన రేడియో ద్వారా వినిపించి, `మీరు పాడితే ఇలాగే వస్తుంది` అని నచ్చచెప్పేవారట.
జానపదుల స్థితి
బిరుదురాజు వారి పరిశోధనలో జానపద సాహిత్య విశిష్టతతో పాటు జానపదుల అమాయకత్వం, దయనీయత వెల్లడైనట్లయింది.`వారికి కావలసింది పిడికెటు బిచ్చం, కల్లు నీళ్లు.కావలసిన రాగి డబ్బులు,పాత వస్త్రములు. వీటి వలన వారి జోలెలు నిండకున్నను తమ ఎదలలోని అమృత వాక్కులతో నా పాటల జోలెను మాత్రము పూటిగా నింపినారీ అల్పసంతోషులు`అని వివరించారు.
Also Read: కథాభి`రాముడు`
ఉద్యమ స్ఫూర్తి
విద్యార్థి దశలో ఆంధ్రమహాసభలను పురస్కరించుకొని మహాత్మాగాంధీ వచ్చినప్పుడు ఆ సభలలో వలంటీరుగా పాల్గొన్నారు. నిజాం కళాశాలలలో చదివేటప్పుడు దాశరథితో పరిచమమైంది. అయనతో కలసి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కాళోజీ, టి.హయగ్రీవాచారి, జమలాపురం కేశవరావు, ముదిగొండ సిద్ద రాజలింగం వంటి అప్పటి యువనాయకులతో రజాకార్యవ్యతిరేక ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొన్నారు. అనుమతి లేకుండా విశ్వవిద్యాలయం అర్ట్స్ కాలేజీలో కవిసమ్మేళనం నిర్వహించినందుకు అరెస్టు అయ్యారు
తెరసం కార్యదర్శిగా….
మాడపాడి హనుమంతరావు నెలకొల్పిన `ఆంధ్రసంఘం`కు అధ్యక్షుడిగా నియమితులైన బిరుదురాజు తెలంగాణ రచయితల సంఘం (తెరసం) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. విశాలాంధ్ర ఆవిర్భావంతో అది ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఎం.ఎ.చదివే సయయంలో సి.నారాయణరెడ్డితో కలసి `రామనారాయణ కవులు` పేరుతో కవిత్వం చెప్పారు.
పురస్కారాలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్,విశిష్ట పురస్కారం, కేంద్ర ప్రభుత్వంనుంచి నేషనల్ ప్రొఫెషనల్ షిప్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సీపీ బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం..వంటివి.
రచనలు
తెలుగు జానపద రామాయణం,వీరగాథలు,యక్షగాన వాజ్మయం,ఆంధ్రయోగులు(నాలుగు సంపుటాలు),సంస్కృత సాహిత్యానికి తెలుగవారి సేవ, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగునపడిన మాణిక్యాలు, తెలుగవీరుడు, తెలుగుసాహిత్యోద్ధారకులు, ఉర్దూ తెలుగు నిఘంటువు, విన్నపాలు, గురుగోవిందసింగ్ చరిత్ర, పల్లెపట్టు (నాటకం) తెలంగాణ పిల్లల పాటలు.
Also Read: వందేళ్ల చింతామణికి ‘నూరేళ్లు’
సుమారు మూడున్నర దశాబ్దాల పాటు బోధించి, అవిశ్రాంత పరిశోధకులుగా అనేక వ్యాసాలు వెలురించిన ఆయన 85వ ఏట 2010లో ఫిబ్రవరి 8వ తేదీన జన`పథం` వీడి పరమపదం చేరుకున్నారు.
(జనవరి 8న ఆచార్యబిరుదురాజు రామరాజు జయంతి)