ఆకాశవాణిలో నాగసూరీయం-21
“… మానవచరిత్రలోనే అపూర్వమైన ఒక సంఘటన జరిగిన ఈనాడు జీవించి ఉన్న మన అదృష్టమే అదృష్టం…. ” అని 1969 జూలై 22న ప్రచురితమైన ‘మానవ విజయం’ అనే సంపాదకీయంలో అంటారు నార్ల వేంకటేశ్వరరావు. మానవచరిత్రలోనే 23 అపూర్వ ఘట్టాలను పేర్కొంటూ — సగం సంపాదకీయంగా సాగే ఒక మహావాక్యం ప్రశ్నగా ముగుస్తుంది!
Also read: కదంబ కార్యక్రమాలకు పునాది
నార్ల సంపాదకీయ స్ఫూర్తి
చంద్రునిపై మనిషి కాలుపెట్టిన సందర్భంగా రాసిన నార్ల రచన కలకాలం చరిత్ర స్ఫూర్తినీ, వర్తమాన సంఘటనల ప్రాధాన్యతనూ గుర్తించడానికి విశేషంగా దోహదపడుతుంది. ఈ విశ్లేషణ గమనిస్తే గతచరిత్రను గర్వంతో, విశ్వాసంతో గౌరవిస్తూనే చేతనున్న, చెంతనున్న ఘటనలను కూడా గుర్తించాలని చెబుతోంది. సుమారు నలభై మూడేళ్ళ క్రితం జూనియర్ ఇంటర్ చదివే కాలంలో మొదట చదివినప్పటి నుంచి ఈ సంపాదకీయం నాకు అభిమాన విషయంగా మారింది. వర్తమాన సంఘటనల తీరును తొలిగా ఒడిసిపట్టుకునే అవకాశమున్న ఆకాశవాణి ఉద్యోగం లభించినప్పటి నుంచి ఇది మరింత విలువయిన ధ్రువతారగా దారిచూపుతోంది!
Also read: రేడియోకూ, పత్రికలకూ పోలిక ఉందా?
తెలుగు కథానిక శతజయంతి
2010 సెప్టెంబరు 19న నల్లగొండలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం, నేషనల్ బుక్ ట్రస్ట్ తోడ్పాటుతో ‘తెలుగు కథానికా శతజయంతి’ సందర్భంగా ‘కథాపఠనోత్సవం’ నిర్వహించింది. పలు ఆకాశవాణి కేంద్రాల నుంచి కాలువ మల్లయ్య, శ్రీరమణ, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, జాజుల గౌరి, జగన్నాథ శర్మ, వి. ప్రతిమ, నందిగం కృష్ణారావు, గుడిపాటి, చిలుకూరి దేవపుత్ర, బారహంతుల్లా రెండు సదస్సులలో తమ కథలను పఠించారు. అలాగే ముదిగంటి సుజాతారెడ్డి, వేదగిరి రాంబాబు గార్లు ఈ సదస్సులకు అధ్యక్షత వహిస్తూ కథలు కూడా చదివారు.
Also read: నా మైక్రోఫోన్ ముచ్చట్లు
పది పుస్తకాల ఆవిష్కరణ
దీని ముందు జరిగిన ఎన్ బి టి ప్రచురించిన 10 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ పది పుస్తకాలలో నేను అనువదించిన ‘సామాజిక మార్పుకోసం విద్య’ అనే పుస్తకం కూడా ఉంది. ఈ సమావేశంలో కేతు విశ్వనాథరెడ్డి, జి. బలరామయ్య, కె. ముత్యంరెడ్డి, బోయ జంగయ్య, విహారి, వేణు సంకోజు వంటి సాహితీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరగడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ లో తెలుగు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న డా. పత్తిపాక మోహన్ చొరవా, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నిర్దేశకులు కె.పి.శ్రీనివాసన్ గార్ల తోడ్పాటు ముఖ్యమైనవి. నా పాత్ర మొత్తం కార్యక్రమం సంబంధించి ప్రణాళికతో పాటు నిర్వహణా అనుసంధానం!
Also read: హేమావతి… రత్నగిరి… సేద్యపు సుద్దులు
దిద్దుబాటు
1910 సంవత్సరంలో ‘ఆంధ్రభారతి’ అనే పత్రికలో గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథానిక ప్రచురితమైంది. కనుక 2010 సంవత్సరం తెలుగు కథానిక శతజయంతి సంవత్సరంగా పరిగణించాం. సెప్టెంబరు 21 గురజాడ వారి జయంతి కనుక సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 1వ తేదీ దాకా ఈ 12 కథలను అన్ని పన్నెండు కేంద్రాలు రాత్రి 8.15 గం. ప్రసారం చేశాయి. దీనికి అనువుగా సెప్టెంబరు 19న నల్లగొండ జిల్లాపరిషత్ హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆరోజు తాపీధర్మారావు జయంతి కావడం కూడా ఇంకో విశేషం. అప్పటికి ఈ కార్యక్రమం చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ చేసిన సందర్భం కానీ, ఉద్దేశించిన లక్ష్యం కానీ చాలా ఉన్నతమైనవని ఇప్పుడు అవలోకన చేసుకుంటే బోధపడుతోంది. అంతేకాదు ఈ ప్రయత్నం మరింత శోధనకూ, మరిన్ని ప్రయత్నాలకు ద్వారాలు తీసిందని కూడా అవగతమవుతోంది.
Also read: ఉత్సవాలవెల్లువగా ఆకాశవాణి ఉద్యోగపథం!
ఆకాశవాణి గురించి ముందే తెలుసు
ఆకాశవాణి ఘనమైన చరిత్ర ఏమిటి అనే అవగాహన ఆకాశవాణిలో చేరకముందే కొంత ఉంది. ఆకాశవాణి కృషి, ప్రక్రియల పోకడల గురించి కోంకణి, మరాఠి ప్రసారాల కేంద్రమైన గోవా ఆకాశవాణి లో గమనించాను. 1991 నుంచి తెలుగు నాట పలు కేంద్రాలలో పనిచేస్తూ, టెలివిజన్ ప్రసారాలు, పత్రికల పోకడల మీద అధ్యయనం చేస్తూ, కాలమ్స్ రాస్తూ చాలా విషయాలు తెలుసుకున్నాను.
Also read: బదిలీ బాదరాయణంలో జీవనమాధుర్యం!
ఆకాశావాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవం
అందులో భాగంగానే ‘తెలుగు కథానికా శతజయంతి వత్సరం’ లాంటి సందర్భాలను గుర్తించగలిగాను. అదేసమయంలో ఆకాశవాణి చరిత్ర, స్థానిక తెలుగు కేంద్రాల గమనం కూడా పరిశీలించి సరైన సందర్భంలో తగిన వేదికలు కల్పించగలిగాను. 1950 ఏప్రిల్ 1న తిరవాన్కూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు రేడియో కేంద్రాలను భారత ప్రభుత్వం స్వీకరించి ఆకాశవాణి కేంద్రాలుగా కొనసాగించింది. 2009-2010లో హైదరాబాదు ఆకాశవాణికి అరవయ్యేళ్ళ (వజ్రోత్సవ) పండుగకు కొన్ని కార్యక్రమాలు చేశాం. ‘మన తెలుగు’ ప్రముఖుల భాషా ప్రసంగాలు అందులోనివే!
ఆకాశవాణి విస్తరణ
1947 ఆగస్టు 15 నాటికి మనకు కేవలం ఆరు ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. మొదటి సమాచార, ప్రసారశాఖామాత్యులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హయాంలో రేడియో విస్తరణ బాగా జరిగింది. జలంధర్, జమ్ము, పాట్నా, కటక్, గౌహతి, నాగపూర్, విజయవాడ, అలహాబాద్, అహమ్మదాబాదు, ధార్వాడ, కొజికొడె కేంద్రాలు 1950 సంవత్సరం మధ్యలోపే ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయిలో సంగీత, ప్రసంగాల, నాటకాల, రూపకాల కార్యక్రమాలు అన్ని కేంద్రాల ద్వారా మొదలయ్యాయి. రేడియో సంగీత సమ్మేళనం (ఆకాశవాణి సంగీత సమ్మేళనం) 1954లో, సర్దార్ మెమోరియల్ లెక్చర్ 1955లో, జాతీయ కవి సమ్మేళనం లేదా సర్వభాషా కవి సమ్మేళనం 1956 నుంచి మొదలయ్యాయి.
Also read: పదిలంగా సాగిన ఉద్యోగ రథం!
ప్రతి ప్రక్రియలో ఉత్సవాలు
ఆకాశవాణి కార్యక్రమాల వృద్ధి, పోకడలూ గమనిస్తే ప్రసంగాలు, చర్చలు, కవిత్వం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, నాటకాలు, రూపకాలు వంటి వాటికి ఉత్సవాలు ప్రతియేటా జాతీయ స్థాయిలో ఉన్నాయి. కానీ కథానిక సంబంధించి సందర్భం లేదనిపించింది. దీనికి కారణం 2010 తర్వాత జరిగిన నా అధ్యయనమే నేపథ్యం. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం అప్పటి నిర్దేశకులు కె.పి.శ్రీనివాసన్ తో చర్చించాను. ఆయన నా పరిశీలనతో ఏకీభవించారు. ఏదైనా ప్రణాళిక చేయమన్నారు. అలా ‘ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం’ రూపం పోసుకుంది!
సంక్రాంతి కథోత్సవం
అప్పటికి తెలుగు రాష్ట్రం విడిపోలేదు. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు ఇద్దరు కథకులను; వరంగల్, అదిలాబాదు, నిజామాబాదు, కొత్తగూడెం, కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి కేంద్రాలు ఒకో కథకుణ్ణి రికార్డు చేశాయి. ఈ కథలను 2012 జనవరి 1 నుంచి 15 దాకా ప్రతిరోజూ రాత్రి 8.15 కు ‘ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం – 2012’ పేరున అన్ని తెలుగు కేంద్రాలు ప్రసారం చేశాయి. ప్రతి సంవత్సరం ఇదే బాణిలో సాగేట్టు ప్రణాళిక స్ఫురించేలా ప్రథమ ప్రయత్నం సాగింది!
తెలుగు కథకు సంబంధించి నా వరకు ఆకాశవాణి ప్రయత్నాలలో ఇదొక ఘట్టం!
Also read: లేచి వచ్చిన లేపాక్షి బసవడు!
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు
మొబైల్: 9440732392