భగవద్గీత–88
పెళ్ళి జరుగుతున్నది. పురోహితుడు ఆయన దారిన ఆయన మంత్రాలు చదువుతున్నారు. వధూవరులు వేదిక మీద తమను కలవటానికి వచ్చిన వారితో కబుర్లు చెపుతున్నారు. పెండ్లి కూతురు తండ్రి పెళ్ళికి వచ్చిన వాళ్లను receive చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. పెళ్ళికూతురు తల్లి ఆమె పనులలో ఆమె బిజీగా ఉన్నది. జీలకర్రబెల్లం పెట్టుకోండని పురోహితుడు గట్టిగా చెప్పాడు. ఆ పని కానిచ్చారు వధూవరులు. అక్షతలు వేయండని పంతులుగారు చెప్పారు. క్రిందున్నవారు లైనులో వచ్చి ఒక గంటసేపు నిలుచొని అక్షతలువేసి ఫోటోకుఫోజులిచ్చి వేదికదిగారు ఇదంతా ఒక గంట.
Also read: పక్కవాడి పొడ భరించలేకపోతున్నారా?
గ్రాండ్ గా చేయాలి అని ప్లేటు భోజనం 1000 లేదా 2000 రూపాయలు ఖర్చుపెట్టి విందు ఇస్తున్నాడు కన్యాదాత. మరి ఆ విందుకు హోటల్లో డబ్బుపెట్టి తినే భోజనానికి తేడా ఏముంది? అక్కడెలాగో ఇక్కడా అంతే. మరొక్కమారు వడ్డిస్తాము అని అడిగేవాడు, ఆప్యాయంగా కనుక్కునేవారు ఏరీ ఏదో వరుసలో నిలబడి దొరికింది నోట్లో కుక్కుకోవడమే తప్ప? పెళ్ళికి వచ్చినవారు పెట్టిన తిండి తిని ఎవరిదారిన వారు వెళ్ళి పోయారు. ( తిండే అది పెళ్ళిభోజనం కాదు)
ఇప్పుడు జరుగుతున్న ప్రతి పెళ్ళి అనబడే తంతులో ఇదే దృశ్యం. ఆశీర్వదించి వెళ్ళేవారు కొన్ని చోట్ల కనీసం కాలి చెప్పులు కూడా విప్పరు. ఏం జరుగుతున్నది?
Also read: మానసిక ప్రశాంతతే స్వర్గం
పెళ్ళి పేరుతో ఒక తంతు. ఒక సర్కస్. ఒక డ్రామా మాత్రమే. పెళ్ళి అనే ఒక యజ్ఞాన్ని నిష్ఠతో, శ్రద్ధతో చేస్తున్నామా? ముమ్మాటికీ లేదు. మంత్రార్ధం తెలియని పురోహితుడు , తెలిసినా గబగబ చదివేవాడు, తెలిసి చెపుదామని ప్రయత్నించినా పట్టించుకోని వధూవరులు, కన్యాదానం అంటే అదేదో అనుకునే తల్లితండ్రులు.
పెళ్ళిలో జరిగే కార్యక్రమం వరుసక్రమం ఏమిటి?
ఆ మంత్రార్ధము ఏమిటి?
ప్రమాణాలు ఏవి?
వాటిని పాటించడం ఎలా?
ఇవి ఏవీ అక్కరలేదు. ఎవడి గోల వాడిదే. ప్రతి పనిని యజ్ఞంలా భావించమని చెప్పారు మన పెద్దలు. యజ్ఞము సంగతి దేవుడెరుగు. ప్రతిదీ ఒక తంతు అయి కూర్చుంది. శ్రద్ధ, నిష్ఠ మచ్చుకు కూడా కానరావటం లేదు. ఇలాంటి వాటివలన ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు గాక లేదు అని నొక్కి వక్కాణించారు పరమాత్మ!
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్
అసదిత్యుచ్యతే పార్ధ న చ తత్ప్రేత్య నో ఇహ
‘‘ఓ అర్జునా శ్రద్ధ, విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపుబడు ఇతర శుభకార్యములు ‘‘అసత్’’ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గానీ, మరణించిన పిదపగానీ ఎట్టి ప్రయోజనమూలేదు.’’
Also read: స్వోత్కర్ష అసురీ ప్రవృత్తి