Tuesday, January 21, 2025

మిల్ఖాసింగ్: సికిందరాబాద్ నుంచి రోమ్ దాకా…

పరుగుల రారాజు మిల్ఖాసింగ్

పద్మశ్రీ గ్రహీత, కామన్ వెల్త్ స్వర్ణపతకం విజేత

మొన్న కన్నుమూసిన పరుగుల రేడు మిల్ఖాసింగ్ అథ్లెటిక్ జీవితం ఆరంభమైంది సికిందరాబాద్ లోనే. 1953లో ఒక సైనికుడిగా మిల్ఖాసింగ్ సికిందరాబాద్ వచ్చాడు. సైనికులు శాంతిసమయంలో రోడ్లు వేయడం, కందకాలు తవ్వడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేస్తూ ఉంటారు. వాటికంటే వ్యాయామం చేసి అథ్లెటిక్ గా తను భిన్నమైన జీవితం గడపవచ్చునని మిల్ఖా భావించారు. ఆరు మైళ్ళ పరుగు పందేల కోసం శిక్షణ ప్రారంభించారు. చివరికి 400 గజాల పరుగులో పతకాలు సాధించారు. సూపర్ స్టార్ అథ్లెట్ గా, ఫ్లయింగ్ సిక్ గా పేరుప్రఖ్యాతులు గడించారు. భారత దేశానికి గర్వకారకుడైనారు.

‘భాగ్ మిల్ఖా భాగ్’ పేరుతో 2013లో వచ్చిన సినిమాలో మిల్ఖాసింగ్ పాత్రధారి ఫర్హాన్ అఖ్తర్ రైలు వెంట పరుగెడుతూ కనిపిస్తాడు. అది మిల్ఖా నిజజీవితం నుంచి, సికిందరబాద్ లో శిక్షణ కాలం నుంచి తీసుకున్న ఘటనే. దేశంలో అతి పెద్ద ఇఎంఇ కేంద్రం సికిందరాబాద్ లో కొహీఇమామ్ జమీన్ కొండ సానువుల్లో ఉంది. సికిందరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రైలు మార్గం ఈ ప్రాంతం నుంచే వెడుతుంది. దగ్గరలోనే ఉన్న అమ్ముగూడా స్టేషన్ లో కొన్ని రైళ్ళు ఆగేవి. ఆ రోజుల్లో ఆ మార్గం మీటర్ గేజ్ లో ఉండేది. బొగ్గుతో ఆవిరి ఇంజన్లు రైళ్లను లాగేవి. ఆ రైళ్ళు పట్టాల మీద వెడుతుంటే పట్టాల కింద దారిలో మిల్ఖా రైళ్ళతో సమానంగా, సమాంతరంగా పరుగెడుతూ శిక్షణ పొందేవారు. తాను రైళ్ళతో పాటు పరుగెత్తడం ద్వారా ఎంత ఆనందం అనుభవించిందీ మిల్ఖా తన స్వీయచరిత్రలో అభివర్ణించారు. కంటోన్ మెంటులోని విశాలమైన ఖాళీ ప్రాంతంలో తాను పరుగు తీయడం కూడా మంచి జ్ఞాపకంగా ఆయన పేర్కొన్నారు.

తొలి ప్రధాన జవహర్ లాల్ నెహ్రూతో మిల్ఖాసింగ్

తనకు ఇష్టం వచ్చినట్టు పరుగులు తీస్తున్న మిల్ఖాను గుర్తించి ప్రోత్సహించిన వ్యక్తి బ్రిగేడియర్ ఎస్ పి వోహ్రా అనే అధికారి. సైనికుడిగా మిల్ఖాసింగ్ పని భారం తగ్గించి పరుగులో శిక్షణ శాస్త్రీయంగా పొందడానికి వీలు కల్పించిన అధికారి ఆయనే. అమ్మూగూడాలో ఉన్న కొండ కూడా మిల్ఖాసింగ్ శిక్షణలో ప్రధానమైనది. బండరాళ్ళు సంచీలో వేసుకొని దాన్ని మోస్తూ కొండపైకీ, కిందికీ, కొండ చుట్టూ పరుగులు తీస్తూ తన శారీరకశక్తినీ, పట్టుదలనూ పరీక్షించుకునేవారు.

మిల్ఖాసింగ్ తో పాటు తమిళ సామాజికవర్గానికి చెందిన దళితులు పరుగులో శిక్షణ పొందేవారు. వారు అథ్లెటిక్స్ గా పేరు తెచ్చుకొని సైన్యంలో చేరాలని ప్రయత్నించేవారు. అటువంటి దళిత యువకులు మిల్ఖాసింగ్ తో కలసి పరుగులు తీసేవారని ఆయన తన స్వీయచరిత్రలో వెల్లడించారు. ఆయనతో కలసి శిక్షణ పొందినవారిలో చాలా మంది అమ్మూగూడా, యాప్రాల్, జేజే నగర్ ప్రాంతాలలో ఇప్పటికీ వార్థక్యంలో కనిపిస్తారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అథ్లెటిక్స్ లో సూపర్ స్టార్ హోదాను సాధించి, పద్మశ్రీ పురస్కారం అందుకున్న మిల్ఖాసింగ్ కోవిద్ చికిత్స చేయించుకున్న తర్వాత పరిస్థతి విషమించి శుక్రవారంనాడు తన 91వ ఏట కన్ను మూశారు. అంతకు అయిదు రోజుల క్రితమే మిల్ఖా సహధర్మచారిణి నిర్మల్ సింగ్ కోవిద్ కారణంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. వారిది 59 సంవత్సరాల వివాహబంధం.  మిల్ఖాసింగ్ కు అథ్లెటిక్స్ ప్రపంచం శనివారం సాయంత్రం 5 గంటలకు బరువెక్కిన గుండెలతో వీడ్కోలు పలికింది. చండీగఢ్ లో సకల ప్రభుత్వ లాంఛనాలతో మిల్ఖాసింగ్ అంతమయాత్ర ఘనంగా జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్రసింగ్ మిల్ఖాకు ఘనమైన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, తదితర ప్రముఖులు మిల్ఖా దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

ఫ్లయింగ్ సిక్ మిల్ఖాసింగ్

‘‘నాకున్న అర్హత కంటే ఎక్కువే జీవితం నాకు ఇచ్చింది,’’ అని మిల్ఖాసింగ్ పదేపదే అనేవారు. నా జీవితం గురించి మాట్లాడమంటే ఈ విషయాన్నే ఎన్నిసార్లయినా చెబుతానని అనేవారు. ‘‘దేశానికి ఖ్యాతి తీసుకురావాలని భగవంతుడు నన్ను ఆదేశించాడు. అందుకు అవసరమైన హంగులన్నీ ఏర్పాటు చేశాడు. నేను ఊహించినదానికంటే ఎక్కువే నాకు నా దేశం, నా దేశ ప్రజలు నాకు ఇచ్చారు,’’ అని ఆత్మకథలో రాసుకున్నారు. జీవిత చరమాంకం వరకూ క్రమశిక్షణకూ, శారీరక స్వస్థతకూ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. సదరన్ కమాండ్ లోనూ, ఆ తర్వాత సర్వీసెస్ లోనూ మిల్ఖా 200, 400 మీటర్ల పరుగులో అనేక విడతల గెలుపొందారు. 1958 కామన్ వెల్త్ గేమ్స్ లో 440 గజాల పరుగులో స్వర్ణపతకం సాధించారు. ఇది తన జీవితంలో మరువలేని విజయమనీ, ఆ తర్వాత తనకు హెల్మ్స్ ట్రాఫీ ఇచ్చి సత్కరించిన ఘట్టాన్ని కూడా తాను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాననీ మిల్ఖాసింగ్ అనేవారు. 1962 కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా రాణించారు. కానీ 1960 రోమ్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచి పతకం సాధించలేకపోయినందుకు సతతం చింతించేవారు. మిల్ఖాసింగ్ కుమారుడు జీవ్ గోల్ఫ్ లో భారత దేశం తరఫున ఆడాడు. పరుగు తర్వాత గోల్ప్ ను మిల్ఖాసింగ్ ఇష్టపడేవారు. ‘‘గోల్ఫ్ కీ, పరుగు పందేనికీ సామ్యం ఉంది. రెండు పోటీలలోనూ మన శక్తిని, ప్రావీణ్యాన్నీ ప్రదర్శించవచ్చు. ప్రత్యర్థులు అడ్డుకునే అవకాశం లేదు,’’ అనేవారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles