తిరుప్పావై 1
తిరుప్పావై, అంటే సిరినోము లేదా శ్రీ వ్రతం, పేర ఎనిమిది పాదాలతో 30 పద్యాల (తమిళంలో పాశురాలు) మధుర భక్తి కావ్యం ద్వారా 12 వందల సంవత్సరాల తరువాత కూడా చిరంజీవియై భాసిస్తున్న మహాకవయిత్రి గోదా దేవి. గోదా దేవి నలనామ సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున (క్రీ.శ. 776) తులసిమొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో కలుపు తీస్తున్నపుడు జనకునికి సీత వలె, విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ. అయోనిజ.
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె యముననీట
భక్తి భాగ్యాల మునిగితేల రారండు, వ్రేపల్లె పడుచులార
వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు
వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార
యశోద ఒడిలోని కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు
కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు
వరద వాత్సల్యగుణాభిరాముడు నారాయణుడు, నెల నోము పట్టి
కలిసి భజింతము రండు, పరై వరాల కలిమి కైవల్యమిచ్చునతడు
అర్థం
(మార్గళి త్తింగళ్)= ఇది మార్గళినెల, (మది నిఱైంద నన్నాళాల్)= చంద్రుడు పదహారుకళలతో పూర్తిగా వికసించిన మంచిరోజు,
(నీరాడ ప్పోదువీర్) = స్నానం చేయదలిచిన వాళ్లు, (పోదుమిన్) =రండి అందమైన ఆభరణాదులు ధరించిన, (నేరిళైయీర్)= సుదతులారా,
(శీర్ మల్గుం) = సిరిసంపదలతో కూడిన, (ఆయ్ ప్పాడి)= గొల్లపల్లెలోని, (శెల్వచ్చిఱుమీర్గాళ్) =భగవదనుగ్రహమనే సంపదను, ధనధాన్యాలనే సంపదను, (కూర్వేల్)= వాడియైన శూలం ధరించి, (కొడుందోళిలన్) =శ్రీకృష్ణుడికి హాని చేయదలిచిన దుర్మార్గులను క్రూరంగా నిర్జించే, (నందగోపన్ కుమరన్) =నందగోపుని కుమారుడు, (ఏరారంద కణ్ణి) =అందమైన నయనాలతో కూడి, (యశోదై) = తల్లి యశోదకు, (ఇళమ్ శింగం) =సింగపు పిల్లవంటివాడు, (కార్మేని) =నల్లని మేని రంగు కలిగి,(చ్చెంగణ్) =కెందామరల తో పోలిన కన్నులు, (కదిర్)=ప్రకాశంలో సూర్యుడిని, (మదియం) =చల్లదనంలో చంద్రుడిని, (పోల్ ముగత్తాన్) పోలిన ముఖ బింబము గలవాడు, (నారాయణనే)=భగవానుడైన శ్రీమన్నారాయణుడే (పఱై)=పఱై అనే వాయిద్యాన్ని మన అభీష్ఠాలను (పారోర్) =ప్రశంసించే విధంగా(పుగళ ప్పడిందు)=ప్రపంచంలోని ప్రజలంతా (ఎమ్బావాయ్ నమక్కే) =ఈ వ్రతంలో పాల్గోనే విధంగా పావై వ్రతాన్ని అనుష్టించడానికి సిద్ధంగా ఉన్నమనకు (తరువాన్)= అనుగ్రహిస్తాడు.
పరమార్థం
మార్గశిరమంటే బ్రహ్మముహూర్తమే
మనకు యేడాది కాలందేవతలకు ఒక రోజుతో సమానం. మన ఆరునెలల ఉత్తరాయణం వారికి ఒకదినంలో తొలి అర్థభాగం. ఉత్తరాయణానికి ముందు వచ్చే నెల మార్గశిర మాసం అంటే దేవతలకు తెల్లవారుఝాము. మార్గశిరం మొత్తం బ్రహ్మ ముహూర్తమని అర్థం. అందులో తొలి పక్షం (శుక్లపక్షం), వెన్నెల నిండిన రాత్రి గడిచి, వస్తున్న తెల్లవారుఝాము. దానికి కాస్త ముందటే లేచి నదీ స్నానంచేసి శ్రీకృష్ణుడిని చేరుకుంటే వ్రతసాధనాలన్నీ ఆయన సమకూర్చుతాడు. రండి రండి అంటూ తొలి పాశురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు.
ఆ నారాయణుడే మన సాధనం, ఆ నారాయణుడే మనకు సాధనం (పరై అనే ఢక్కవంటి సంగీతపరికరం) ఇస్తాడు. ఆ నారాయణుడే మన సాధనకు లక్ష్యం. పదండి, త్వర పడండి. లేవండి వెళదాం…అని రారమ్మంటున్నది గోదమ్మఒక్కొక్క పాశురంలో.