లిప్తపాటులో దృష్టి మళ్ళే రోజులలో ఒక ఫ్లెక్సీ పది సెకన్లలో రాజకీయం మాట్లాడగలదు. ఫ్లెక్సీ ఆర్థిక వ్యవస్థకు భారత జోడో యాత్ర తన తోడ్పాటు అందించింది.
రాజకీయాలలో ఇప్పుడు నడుస్తున్న ప్లాస్టిక్ యుగానికి ఫ్లెక్సీ బ్యానర్ ఒక ముద్ర. ఫ్లెక్సీకి ఉపయోగించే పదార్థాలు, దాని ఉపయోగం, అది అందించే సందేశం, ఇతర లక్షణాలన్నీ మన రాజకీయ జీవితంలో వస్తున్న మార్పులకు సంకేతాలు. దీన్ని రాజకీయాలను ఫ్లెక్సీకరించడం అని నేనంటాను.
Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం
భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో నడుస్తూ ఉంటే ఫ్లెక్సీ బ్యానర్ల పరంపరను చూడటం అనివార్యం. ఫ్లెక్స్ ని మనవాళ్ళు ఫ్లాక్స్ అంటున్నారు. రోడ్డు పక్కన అన్ని రకాల, అన్నిసైజుల, అన్ని నమోనాల ఫ్లెక్స్ లు కనిపిస్తాయి. ఫ్లెక్స్ ఆర్థిక వ్యవస్థకు భారత్ జోడో యాత్ర (బీజేవై) తన వంతు దోహదం అందించింది. కానీ ఫ్లెక్స్ లు యాత్రలకూ, రాజకీయాలకూ మాత్రమే పరిమితమైనవి కావు. కోచింగ్ క్లాసులూ, స్కూళ్ళూ, బంగారు నగల దుకాణాలూ (కేరళలో), దుస్తులూ, ఇతర వస్తువుల, కార్యకలాపాల గురించి వాణిజ్య ప్రకటనలు చిన్న నగరాలలో ఫ్లెక్స్ లపైన చూస్తాం. స్థానిక మంగలి దుకాణం నుంచి పెద్ద షాపు దాకా మీకు స్వాగతం చెప్పే ఫ్లెక్స్ పెట్టుకొని ఉంటుంది.
ఫ్లెక్స్ చౌక, వీలైనది
అడుగడుగునా రాజకీయం ఫ్లెక్స్ తో నడుస్తుంది. ఇదివరకు రాజులు తమ విజయ చిహ్నాలను కట్టడాల రూపంలో నిర్మించినట్టు నేటి రాజకీయ నాయకులు తమ దైనందిన కార్యక్రమాలను ఫ్లెక్స్ ల ద్వారా తెలియజేస్తారు. చిన్న సమావేశం జరిగినా, ఫంక్షన్ జరిగినా, పుట్టిన రోజు వేడుక జరిగినా నేపథ్యంలో ఫ్లెక్స్ తప్పని సరి. పార్టీ నాయకుల ఫొటోలను ఫ్లెక్స్ లో ఎట్లా ఏర్పాటు చేశారో చూసి సదరు పార్టీలో వారి స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఫ్లెక్స్ లో రాసే వాక్యాలు రాజకీయ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడి హోదా అతని ఫ్లెక్స్ హంగామాపైన ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషులో ఫ్లెక్సింగ్ (ఫ్లెక్సింగ్ ద మజిల్) అంటే ప్రదర్శించడం అని అర్థం. రాజకీయాలకూ ఇది సరిపోతుంది. ఇదంతా బయటకు కనిపించే దృశ్యం గురించి మాత్రమే.
కొత్త రాజకీయ విపణిలో అన్ని అవసరాలకు తగినట్టుగా ఫ్లెక్స్ ను కనిపెట్టారు. చదరపు అడుగు పది రూపాయలో, అంతకంటే తక్కువలోనో దొరుకుంది. భలే చౌక. ఇదివరకు కట్టే నూలు బ్యానర్ల కంటే ఫ్లెక్స్ ఏర్పాటు త్వరగా జరుగుతుంది. అది చాలా కాలం మన్నుతుంది. లోహంతో లేదా ఫైబర్ గ్లాస్ తో తయారు చేసే బిల్ బోర్డులకంటే ఇది చౌక, తేలిక. గోడల మీది రాతలకంటే ఫ్లెక్స్ లను త్వరగా తొలగించవచ్చు. నిరుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నావో, ఏ హోదాలో ఉన్నావో గుర్తు చేస్తూ గోడల మీది రాతలలాగా ఫ్లెక్సీ మీవైపు చూడదు. అప్పటి కల్లా మీ ఫ్లెక్స్ పేదవాడి గోడమీద కాగితం లాగానో, కాళ్ళు తుడుచుకునే పట్టాలాగానో మారిపోతుంది. రాజకీయాల వల్ల ప్రయోజనం వారికి కూడా అందుతుంది. పేరులోనే ఉన్నట్టు నేడు భారత రాజకీయాలలో అత్యవసరమైన ఫ్లెక్సిబిలిటీని (సర్దుకుపోయే తత్వాన్ని) కలిగి ఉంటుంది. తనతో పోటీ పడే అన్ని నమూనాలనూ ఫ్లెక్స్ ఓడించింది – బీజేపీ సైతం అసూయ చెందే విధంగా.
ఫ్లెక్స్ సూపర్ మార్కెట్ లో అన్ని రకాల ఫ్లెక్స్ లూ దొరుకుతాయి. ఇప్పుడు బాగా వ్యాప్తిలో ఉన్నవి 4×6 అంగుళాల ఫ్లెక్స్ లు. భారీ బిల్ బోర్డులు వ్యాప్తిలో ఉన్న యుగంలో మనం ఉన్నాం. పూల మాదిరి ఉండే ఫ్లెక్స్ ల స్థానంలో చతురస్రాకారంలో ఉండే ఫ్లెక్స్ లు వస్తున్నాయి. దక్షిణాది సినిమా పబ్లిసిటీ ఫ్లెక్స్ లను పోలిన ఫ్లెక్స్ లలో అదో రకమైన ఆకర్షణ. ఒకటి, రెండు, అనేక పుటలు ఉండే దొంతర ఫ్లెక్స్ లు. లైటింగ్ లో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. రంగుల కల్నేతలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. గాడీగా, మెరిసేట్టు ఉండటం మీకు ఇష్టం లేకపోతే మీరు నచ్చిన రంగులు వేయించుకోవచ్చు. రాజకీయాలలో మాదిరే ఫ్లెక్స్ ల సూపర్ మార్కెట్ లో కూడా మీకు ఎంతో వైవిధ్య భరితమైన రకాలు కనిపిస్తాయి. ఏదైతే మాత్రమేమిటీ, వీటిలో తేడా ఏముందీ అని మీకు అనిపించకపోదు. అన్ని ఉత్పత్తులూ ఒకే విధంగా కనిపిస్తాయి- అన్ని రాజకీయ పార్టీల మాదిరే.
Also read: భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది
సందేశం తెచ్చేవారే సందేశం
ఫ్లెక్స్ ల ఉద్యానవనంలో అర్థం కోసం మీరు వెతకవచ్చు. సమస్య ఫ్లెక్స్ తో కాదు, మీతోనే. ఎన్ని చెప్పినా చూసే వాడి దృష్టికోణంలోనే అర్థం ఉంటుంది. సెకన్లలో దృష్టి మళ్ళించే ఈ రోజులలో ఒక ఫ్లెక్స్ పది సెకన్లలో రాజకీయ సందేశం చెప్పగలదు. సహజంగానే ఫ్లెక్స్ పైన అక్షరాలు పొదుపుగా వాడతారు. అంతా బొమ్మలతోనే సందేశం అందుతుంది. ఒకే ఒక ఫ్లెక్స్ లో నేను ఒక సారి రెండు వందల ఫొటోలు లెక్కబెట్టాను. అత్యంత సాధారణంగా కనిపించే చిత్రహారాలు. సాధ్యమైనంత ఎక్కువ ఫొటోలను ఒక ఫ్లెక్స్ లో ఇమిడ్చడం. ఇదివరకు చెప్పిన సామెత ‘ఒక చిత్రం వెయ్య అక్షరాలతో సమానం’ అని. ఆ సామెతను తిరగేసి ఇప్పుడు వెయ్యి ఫ్లెక్స్ లు ఒక అక్షరంతో సమానం అనవచ్చు.
Also read: ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి
ఫ్లెక్స్ లో కనిపించే చిత్రహారంలో దాగి ఉన్న సందేశాలను మీరు చదవరు. ఇందులో హిందీ క్యాలండర్ తయారు చేసేవారు వినియోగించే కళనూ, సాంకేతిక నైపుణ్యాన్నీ ఉపయోగిస్తారు. వరుసగా ఫ్లెక్స్ లు చదువుకుంటూ పోతే సదరు వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడో, ఆ పార్టీలో ఏ ముఠాకు చెందినవాడో కూడా తెలిసిపోతుంది. ప్రముఖ నాయకుడు- భారత జోడో యాత్రలో అయితే రాహుల్ గాంధీ- ఫ్లెక్స్ మధ్యలో పెద్దగా ఉంటాడు. భక్తులు ఫ్లెక్స్ కింద ఉంటారు. ఫ్లెక్స్ కోసం డబ్బు ఖర్చు చేసే వ్యక్తి పేరు పెద్ద అక్షరాలతో కిందనే ప్రముఖంగా ఉంటుంది. దొంతర కట్ అవుట్లు – స్థానిక నాయకుడి ఫోటోను, హరియాణా కాంగ్రెస్ నేత దీపేందర్ హుడాలో చొప్పించి, హుడా ఫొటోను రాహుల్ గాంధీ ఫొటోలో దూర్చి మొత్తం నిచ్చెన మెట్ల ఫ్లెక్స్ ఉంటుంది. సకల వివరాలు, ఎవరి స్థానం ఏమిటో చెబుతుంది. అప్పుడుప్పుడు సందేశం ఇవ్వడానికి ప్రయత్నించే ఫ్లెక్స్ లు కూడా కనిపిస్తాయి. చాలా సందర్భాలలో సందేశం ఇచ్చేవాడే సందేశం.
ఈ ఫ్లెక్స్ ల వల్ల అంతర్గతంగా సందేశం ఇవ్వడం మినహా మరేదైనా ప్రయోజనం ఉన్నదా అనే అనుమానం మీకు కలిగితే ఒక విషయం ఆలోచించండి. రాజకీయ కార్యకలాపాలు మొబైల్ కు కాకపోయినా టీవీ తెరలకు పరిమితమై పోతున్న రోజులలో బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడానికీ, ప్రజలను ఆకర్షించడానికీ ఫ్లెక్స్ లు తప్ప వేరే ఉపాయం లేదు. రాజకీయ వేదికపైన మీ ఉనికిని చాటుకోవడానికి ఫ్లెక్స్ పనికి వస్తుంది. రాజకీయాలలో మీకు ఆసక్తి ఉన్నదని చాటడానికి ఫ్లెక్స్ పనికివస్తుంది. వచ్చే ఎన్నికలలో టిక్కెట్టుకోసం దరఖాస్తు చేసుకోవడం వంటిదే ఫ్లెక్స్ పెట్టడం. రాజకీయ పార్టీలో ఏ ముఠాకు చెందినవారో ప్రకటించుకోవడానికి ఫ్లెక్స్ అవకాశం ఇస్తుంది. క్షేత్రంలో మీరు చేస్తున్నపనిని గుర్తించే పార్టీ ఏదీ లేనప్పుడు మీరు రాజకీయాలలో ఉన్నారని చెప్పడానికి ఫ్లెక్స్ ఒక నిదర్శనం. ఫ్లెక్స్ ఒక గ్రీటింగ్ కార్డు లాంటిది. ధన్యవాదాలు చెప్పేది. ఒక కరపత్రంగా ఉపయోగించేది. మీరు తీసుకోబోయే చర్యను సూచించేది. నేటి భారతంలో రాజకీయంగా చెలామణి అవుతున్న ప్రజాజీవితంలో మీరు బలంగా, మెరుస్తూ కనిపించడానికి ఫ్లెక్స్ ఒక సాధనం, ఒక శాసనం.
Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు