కాలం రెక్కలపై కదిలిన ఫెలికాన్లు
గాలి కారులో దూసుకొచ్చిన ఫ్లెమింగోలు
పతంగులై ఎగిరొచ్చిన ఎర్రకాళ్ళ కొంగలు
రెపరెపలాడుతూ ఎగిరిన కొంకణాయి
కెరటాల తెరచాపల పైన నల్ల కొంగలు
దేశదేశాల ప్రేమ రాయబారులందరూ
అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నట్టు
నేలపట్టు ప్రకృతంతా రంగుల ప్రేమ సందేశాలు
పక్షి పర్యాటకుల అనురాగోత్సవాలన్నీ
ఆనందంగా జరుపుకుంటుంది జవానీ
నేలపట్టు కొమ్మల నిండా ఆనందరామాలు
ఏ కుప్పాల్లో చూపుదారి తప్పినా
కదిలే రంగుల కలల హంగామాలే
మన్మధ సామ్రాజ్యాల సరంజామాలే
మిధున రాశి ప్రయోగ రహస్యాలే
ఎగిరే వర్ణ నావల శతక ప్రవల్హికలే..
పులికాట్ సరస్సంతా కావ్యనాయకుల సమ్మేళనం
పులికాట్ ఆకాశమంతా భావ వీచికల ప్రభంజనం
ఒక్కో పక్షి ఎగిరేసిన ఒక్కో కవితా పతాక
రంగుల రామ చిలుక కలల ఖండ కావ్యం
చీకటి అడుసు తొక్కిన నల్ల కాళ్ళ కొంగ
నీలి పులికాట్ లో కాలు కడుగుతుంది
రంగురంగుల సముద్రపు రామచిలుక
గిలకబాయి చేదలా నీళ్ళలో జారుతుంది
ఒంటరిగా ఒక మహాతపస్వి
ఒంటికాలు తపస్సు చేస్తుంటాడు
నీటి ఛాయలో నారాయణి ప్రత్యక్షమయితే
గుటకాయ స్వాహా మంత్రం జపిస్తాడు
కాలం పక్కలకు రెక్కలు జోడించి
గూడస్వామి మూడు
మునకలేస్తాడు పులితీర్ధంలో
వేలమంది నారీమణులు
భారతీయ సంప్రదాయ నృత్యభంగిమల్లో
నిశ్చల చిత్రమైనట్లు
జలవేదికపై అనుకరిస్తున్న
వేల ఫ్లెమింగోల భంగిమలు
నవనవలాడే నవలామణుల కోసం
జలనిధికై నిత్యం నాచికోలు సమరం
నేలపట్టు నాగస్వరం ఊదినట్లు
చీటికి మాటికి గూటి పయనం
అల్లరి పిల్లలే అలలై
తేలాడే రెక్కల పడవలు
ప్రళయకావేరి జలమైదానాన్ని
ప్రణయ సావేరి
రాగ కచ్చేరి చేసిన శిల్పం
జలతరంగిణి ప్రసన్న జుగల్బందీలో
జలతారు రాగాల పరాగ వర్షం
తెల్లవారితే చాలు పులికాటంతా
రంగురంగుల తివాచీ పరుచుకొని
వసంత హేమంత హేలల్ని అల్లుకొని
ఎగిరే పూలతోటై ప్రవహిస్తుంది
ఎదురు చూసే సముద్రుని నోట నీరూరుస్తుంది..!
Also read: ఫ్లెమింగో-1
Also read: ఫ్లెమింగో-2
Also read: ఫ్లెమింగో-3
Also read: ఫ్లెమింగో-4
Also read: ఫ్లెమింగో-5