అనంతమైన స్వేచ్చకు
రెక్కలు మొలిస్తే పక్షి
ఒక బెదురును
ఒక అదురును
కళ్ళనిండా నింపుకుని
సరిహద్దు సైనికుడిలా
అనుక్షణం అప్రమత్తమై
అన్వేషణే చూపై చూసేది పక్షి
రెక్కల కొసలకి
తోకల మొనలకి
అందమైన కలనేత రంగులు
అద్దుకునేది పక్షి
ఒక జెట్ వేగాన్ని
ఒక వాయు సోయగాన్ని
వలేసి పట్టుకునేది పక్షి
కడుపు కాలిన క్షణంలో
ఎక్కడైన అందిన
ఆహారాన్ని శస్త్ర చికిత్స చేసి
ఫోర్క్ లా ముక్కు కందించేది పక్షి
ఒక వేకువ ను స్వాగతిస్తూ
సమాజాన్ని మేల్కొలిపేది పక్షి
ఒక చలి రాత్రిని దాటి
పొగ మంచు ఉదయాన్ని
ముక్కు తో చీలుస్తూ
చాచిన కాళ్ల తో రివ్వున ఎగురుతూ
ఫలహారపు వేటకు
పరిగెడుతుంది పక్షి
ఒక ఎత్తయిన చెట్టు
చిటారు కొమ్మన
వాయు కాలుష్యాన్ని పరీక్షించి
కల్మషాన్ని తుడిచేసేది పక్షి
ఒక మండుటెండ మధ్యాహ్నం
ఎంపిక చేసుకున్న
జల మైదానంలో
ఎగిరి దుమికి
గిరికీలు కొట్టి
నీటి కబడ్డీ ఆడి
ఒళ్ళు విదిల్చి
రెక్కలార్చుకునేది పక్షి
వేల మైళ్ళ దూరాల్ని కొలుస్తూ
అక్కడి చరిత్రను
ఇక్కడి సంస్కృతికి
అక్కడి జాతిని
ఇక్కడి తరానికి
తరలించేది వలస పక్షి
ఎగిరే రాగ దేవత పక్షి
ఎగిరే శాంతి సందేశం పక్షి
ఎగిరే స్వర సంపుటి పక్షి
సాయం సంధ్యకు
చేసిన యాత్రలను ముగిస్తూ
చెట్టు ముంగిట చేరి
సామూహిక కచ్చేరికి
సంసిద్దమైయ్యేది పక్షి
కవి కోకిలల్ని
గాన గాంధ్వర్వుల్ని
ప్రతిబింబించేది పక్షి
చావు పుటకల నడుమ
ఆకలి, నిద్ర, ప్రేమ, శృంగారం
సర్వ ప్రాణులకు సమానం
పక్షికీ అనుబంధాలుంటాయి
అక్రమ సంబంధాలు లేవు
పక్షులకీ సంఘ జీవనం ఉంటుంది
సంఘావిద్రోహమే తెలీదు
విశాల భావాల రెక్కలు విప్పే పక్షి
స్వార్థ చింతనే ఎరుగదు
సంకుచితత్వంతో కుచించుకుపోదు
సహనం, సంయమనంతో
పొదిగే ఆడ పక్షి కి
పులికాట్ ఫలహారాన్ని
ముక్కు కింద సంచుల్లో పొదుక్కొచ్చి
పొడిచి పొడిచి తినిపిస్తుంది
అసూయ ద్వేషాలకతీతం పక్షి
తన పై ఏ తూటాను పేల్చనివ్వక
జాగ్రత్త వహించిన
ఆ పరిసర పల్లె ప్రజలకు
పరోపకారిగా, కృతజ్ఞతాభావంతో
తమ రెట్టలతో నేలపట్టు
నేలను సారవంతం,
ఫలవంతం చేసి
ముక్కారు కాపు
కాన్కగా ఇచ్చి వెళ్తుంది
నిజాయితీకి, నిబద్ధతకు,
క్రమశిక్షణకు
పక్షి మనిషికాదర్శం కావాలి!!