గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గత ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ స్థాయి బాగా పడిపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. తనకు ఎంఐఎం దగ్గరగా ఉన్నప్పటికీ ఎక్స్ అఫిషియో సభ్యులతోమేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంటామని అధికార పక్షంలో ధీమా వ్యక్తమవుతోంది.
అంతా ప్రముఖల బంధువులే
మేయర్ స్థానం జనరల్ మహిళలకు కేటాయించడంతో కనీసం ఐదుగురు దాని కోసం పోటీ పడుతున్నారు. వీరంతా అధికార పక్ష ప్రముఖ నాయకుల బంధువులు కావడం గమనార్హం.దివంగత పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయరెడ్డి (ఖైరతాబాద్), రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి (బంజారాహిల్స్),ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి (చర్లపల్లి), ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి సోదరుడిన కోడలు సింధు ఆదర్శ్ రెడ్డి (భారతీనగర్), కవితా రెడ్డి (వేంకటేశ్వర కాలనీ)మేయర్ రేసులో ఉన్నారు.మేయర్ పదవిని అగ్రవర్ణాలకు ఇస్తే, డిప్యూటీ మేయర్ పదవిని బీసీ,ఎస్సీ మైనార్టీల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుతున్న సమాచా రాన్ని బట్టి బొంతు రామ్మోహన్ భార్య శ్రేదేవి,కేకే కూతురు విజయ లక్ష్మికి అవకాశాలు తక్కువని అంటున్నారు. ఒకరు ప్రస్తుత మేయర్ భార్యకాగా, మరొకరు రాజ్యసభ ఎంపీ కూతరు కావడం కారణంగా చెబుతున్నారు.సింధూ ఆదర్శ్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి సోదరుడి కోడలు కావడం కూడా ఈ పదవికి అడ్డంకిగా మారవచ్చని కొందరు అంటున్నా, ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ ఆమెతో ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. పైగా ఆమె కార్పొరేటర్ గా రెండవసారి గెలిచారు.
విపక్షాల విమర్శలు
కీలకపదవుల్లో ఉన్నవారికి మరో అవకాశం ఇస్తే అప్రదిష్ట మూటకట్టు కోవలసి వస్తుందనే జంకు కూడా వెన్నాడుతోందని అంటున్నారు. సీఎం పీఠం దళితులకు కట్టబెడతానన్న కేసీఆర్ మాటతప్పారని ప్రతిపక్షాలు ఇప్పటికీ సమయం వచ్చినప్పుడల్లా విమర్శిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ఆచితూచి అడుగేయవలసి ఉంటుంది.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబసభ్యులకు టికెట్ ఇచ్చారా?అని బీజేపే ఎమ్మెల్యే రఘునందన్ రావు తాజాగా ప్రశ్నించారు.టీఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే విపక్షాలు విమర్శల దాడులు పెంచే ప్రమాధం ఉంది.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన 85 మంది మహిళల్లో 30 మంది విజయం సాధించారు. మేయర్ స్థానం ఈసారి మహిళలకు కేటాయించడంతో ప్రస్తుత మేయర్ రామ్మోహన్ పోటీకి దూరంగా ఉండి భార్యను పోటీకి దింపారు. కాగా , మేయర్ ,డిప్యూటీ ఎన్నిక అంశంపై చర్చించేందుకు మంత్రి తారకరామారావు నాయకులతో సమావేశమ వుతారని తెలుస్తోంది.