- ప్రధాని మోదీ స్వప్నం సాకారం అవుతుందా?
- వ్యవసాయరంగమే ఆదుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి
భారతదేశంలో 2024 కల్లా 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పం. ఈ అంశాన్ని ఆయన పదే పదే స్ఫుటంగా ప్రకటిస్తూ ఉంటారు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ భారతదేశ ప్రగతి ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే విశ్వాసం ప్రధానికి బలంగా ఉంది. వ్యవసాయంలో, కార్మిక రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు గతంలో ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఆశాభావం కూడా ఆయనకు ఉంది. ఉత్పత్తి, తయారీ రంగంలో ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన మార్కెట్ కేంద్రంగా సమీప భవిష్యత్తులో భారత్ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. సంస్కరణల పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుందనీ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా, దానికి తగ్గట్టుగా రాష్ట్రాలు స్పందించక పోతే ఆశించిన అభివృద్ధి జరగదని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని తప్పుపడుతున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించడం కీలకమని ఆయన అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. చేయాలనుకున్న మేలు, చిట్ట చివరి మైలు వరకూ చేరుకునే డెలివరీ వ్యవస్థ మనల్ని కాపాడిందని, ఈ యంత్రాంగాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే నిర్మించిన ఘనత ఎన్ డి ఏ ప్రభుత్వానికే చెల్లిందని తమ పాలన పట్ల అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ఆయన గతంలోనే ప్రకటించారు. ప్రధాన మంత్రి సంకల్పం, ఆలోచనలు మంచివే.ఆచరణలో అన్ని వర్గాలకు ఇంకా భరోసా రావాల్సి వుంది.
Also read: సౌర విద్యుత్తుకు అపారమైన అవకాశాలు
ఎటు చూసినా నైరాశ్యమే
ప్రస్తుతం ప్రపంచం వున్న పరిస్థితుల్లో సుమారు 139కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ఆర్ధిక రంగంలో అభ్యుదయ పథంలో నడపడం ఆషామాషీ కాదు. కరోనా సృష్టించిన అలజడి సామాన్యమైంది కాదు. దీని దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇంత ఘోరమైన ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదు. గతంలో ఆర్ధిక మాంద్యం, సంక్షోభాలు వచ్చిన దశల కంటే, నేటి దశ చాలా ఘోరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయంతో ప్రపంచ సంపన్న దేశాలు సైతం గడగడ వణికిపోతున్నాయి. జి డి పి లో చాలా వెనకబడే ఉన్నాం. నిర్మాణం, ఉత్పత్తి రంగాలు ఇంకా కోలుకోవాల్సి వుంది. ఆర్ధిక లావాదేవీలు ఇంకా ఎన్నో రెట్లు ఊపందుకోవాల్సిన ఉంది. డిమాండ్-సప్లై మధ్య ఉన్న బంధం ఇంకా ఆరోగ్యదాయకంగా లేదు. కరోనా ప్రభావంతో తోటి దేశాల్లో వచ్చిన ఆర్ధిక కష్టాల ప్రభావం మన దేశంపైనా పడింది. దెబ్బతిన్న దేశాల్లో అమెరికా, చైనా రెండూ ఉన్నాయి. అమెరికా బాగా దెబ్బతింది. చైనాకు -భారత్ కు మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార బంధాలు తెగిపోతూ ఉండడం వల్ల, దాని ప్రభావం మన ఉత్పత్తి రంగం, తద్వారా మన ఆర్ధిక రంగంపై పడుతోంది. ఫార్మా మొదలు అనేక తయారీల్లో మనం చైనాపైనే ఆధారపడ్డాం. అదే విధంగా ‘మేక్ ఇన్ ఇండియా’ ను ఆచరణలో ఆశించిన స్థాయిలో సాధించలేదు. గడ్డు పరిస్థితుల్లోనూ మన దేశాన్ని కాపాడింది వ్యవసాయ రంగమన్నది మరచిపోరాదు. అది ఎంతో కొంత పచ్చగా ఉండడం వల్ల, కొంత ఆర్ధిక రక్షణ జరిగింది. ఎక్కడైతే వ్యవసాయ రంగం బాగుంటుందో, ఆ క్షేత్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగంపై పాలకులకు ఇంకా శ్రద్ధాభక్తులు పెరగాలి. వ్యవసాయం కోసం ఉపయోగించుకోకుండా ఉన్న భూమి ఇంకా చాలా ఉంది. దానిని గుర్తించి, వ్యవసాయాన్ని విస్తరించాలి. వ్యవసాయ ఆర్ధిక రంగాన్ని పరుగులు పెట్టించాలి. స్వామినాథన్ వంటి నిపుణులు చేసిన సూచనలు ఆచరణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. రుణాల వసతి కల్పించినా, వాడుకునే పరిస్థితి రాష్ట్రాలకు ఏ మేరకు ఉందో ప్రశ్నించుకోవాలి.
Also read: జీ-ట్వంటీలో మన గళం
మాల్థస్ మహనీయుడి మాటలు మనసులో పెట్టుకోవాలి
థామస్ రాబర్ట్ మాల్థస్ అనే ఆర్ధిక పండితుడు ఎప్పుడో 200ఏళ్ళ క్రితం చెప్పిన మాటలను దేశాధినేతలు పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. జనాభా పెరుగుదల సంఖ్య ఆధారంగా, ప్రతి 25సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయనీ, వాటికి అనుగుణంగా మనం సిద్ధమై ఉండాలనీ ఆయన హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యాలు, కరోనా వైరస్ వంటి ముప్పులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ వుంటాయని, వీటిని గుర్తెరిగి, మనం నడచుకోవాలని ఆయన సూచించారు.ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్ల, ఆర్ధికంగా,మౌలికంగా సంసిద్ధమై ఉండక పోవడం వల్ల,విపత్తులు వచ్చినప్పుడు కుదేలైపోతున్నాం. మాల్థస్ మహనీయుని మాటలు ఇప్పటికీ ప్రత్యక్ష సత్యాలుగా నిలుస్తున్నాయి. భారతదేశాన్ని పునర్నిర్మించాలనే సత్ సంకల్పం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండడం ఎంతో అభినందనీయం, 2024కల్లా 5ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రశంసాపాత్రం.ప్రస్తుత ప్రపంచ పరిణామాలను గమనిస్తే, 2024కల్లా 3 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థకు భారత్ చేరుకుంటే అది గొప్ప ప్రగతిగా చరిత్ర సృష్టించి తీరుతుంది.ప్రధాని నరేంద్రమోదీ సంకల్పిస్తున్నట్లుగా 5ట్రిలియన్ల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇంకాస్త సమయం పడుతుందనే ఎక్కువ శాతం ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం. నిజంగా సాధిస్తే, అంతకంటే కావాల్సింది ఏముంది?నరేంద్రమోదీ చరిత్రలో మిగిలిపోతారు.బ్యాంకులు -ఆర్ధిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలపై నిన్ననే ముగ్గురు అర్ధశాస్త్రవేత్తలు అత్యున్నతమైన నోబెల్ బహుమతి దక్కించుకున్నారు.వడ్డీ రేట్లు, రుణాల ఎగవేతలు,డిపాజిట్లు, కుప్పకూలిపోయిన బ్యాంకింగ్ వ్యవస్థపై విస్తృతమైన చర్చ చేశారు. ప్రభుత్వాల పాత్రను కూడా సూచించారు.మన దేశంలో కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినవారు,వాటిపై చేసిన రద్దు నిర్ణయాలు ఎప్పటికీ చర్చనీయాంశాలే.తుదిగా బలయ్యేది సగటు మనిషి. ముందుగా ఈ అవ్యవస్థల నుంచి బయటపడాలి.
Also read: కె సీ ఆర్ జాతీయ విన్యాసం