భగవద్గీత – 65
ఆధునిక జీవితం ఒక డొల్ల.
ఒక ఖరీదయిన కారు దుమ్మురేపుతూ కొండదారులలో వెళ్ళినట్లు, అందులోనుండి అప్పుడే స్నానంచేసినట్లుగా freshగా ఉన్న అందమైన స్త్రీ పురుషులు దిగి ప్రకృతి శోభను చూస్తున్నట్లు….
లేదా… అత్యంత ఖరీదయిన curved TVలో ప్రకృతిని మన ఇంటిముందరే కట్టిపడవేసినట్లు…
లేదా… అప్పుడే విడుదలయిన లేటెస్ట్ ఫోనులో మధురమయిన సంగీతం ఒక పదహారేళ్ళ పడుచుపిల్ల ఆస్వాదిస్తున్నట్లు… ఈ విధంగా ప్రతిరోజూ, ప్రతిక్షణం మనం TV పెట్టగానే advertisements కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉంటాయి.
Also read: నరకంలో ప్రవేశించేందుకు మూడు ద్వారాలు
మొదటి రోజు పట్టించుకోము.
రెండవ రోజు కన్ను అటు మళ్ళుతుంది.
మూడవ రోజు ఆసక్తి పెరుగుతుంది.
నాలుగవ రోజు అది ఎలా స్వంతం చేసుకోవాలా అన్న తపన పెరుగుతుంది.
యమగోల సినిమాలో చిత్రగుప్తుడి పాత్ర ద్వారా ఒక సంభాషణ పలికిస్తాడు దర్శకుడు… ‘‘ఈ ఘంటము బాగుగా వ్రాయుచున్నది. దీనిని స్వంతము చేసుకున్నచో బాగుండును‘‘ అని. అంటే మనస్సు ఎంతటివాడికయినా చలిస్తుంది అని దాని ఉద్దేశ్యము.
ఇలా చలించడమే కావాలి!
ఇదుగో ఇక్కడే ప్రకటనలు చేసేవాడి ప్రయోజనం నెరవేరినట్లు.
Also read: సాత్త్విక తపస్సులు
మరి స్వంతం చేసుకోవాలంటే డబ్బు కావాలి.
నెల సంపాదన అంతలేదు. ఏం చెయ్యాలి?
అదుగో, అక్కడే ఫైనాన్సు కంపెనీలు, బ్యాంకులు ఇచ్చే ప్రకటనల మీద దృష్టి మళ్ళుతుంది!
అంతే! అప్పోసప్పోచేసి కావలసినది స్వంతం చేసుకున్నాను అనుకుంటాడు.
మొదటి నెలవాయిదా బుద్ధిగా కడతాడు. రెండవ నెలలో ఇంట్లో ఎవడికో రోగమో రొష్టోవచ్చి డబ్బులు ఖర్చుఅయిపోతాయి. మూడవ నెల పండగకో పబ్బానికో ఖర్చు. నాలుగవ నెల బంధువుల ఇంట్లో పెళ్ళి. అయిదవ నెల తిరుపతి ప్రయాణానికి మొక్కుబడులకు ఖర్చు.
మూడునెలలు వరుసగా వాయిదా రాకపోతే బ్యాంకువాడు ఊరుకుంటాడా? ఇంటిముందు వచ్చి వాలుతాడు. వాళ్ళకు సమాధానం చెప్పలేక, డబ్బు కట్టలేక ఇంట్లో కోపాలు తాపాలు, చికాకులు, మనస్పర్ధలు. బ్రతుకు దుర్భరం. ఇది ఇట్లానే జరుగుతున్నది. ఇదే నేటి ఆధునిక జీవన చిత్రం.
అసలుఇలా ఎందుకు జరుగుతున్నది?
ఇదుగో ఇందుకు!
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే
ఒక్కొక్క పదాన్ని విపులంగా పరిశీలిద్దాం!
ధ్యాయతః- విషయాన్ – పుంసః – సంగః -తేషు – ఉపజాయతే – సంగాత్ – సంజాయతే -కామః – కామాత్ – క్రోధః – అభిజాయతే
ఒక్కొక్క పదాన్ని ఏరి ఏరి కూర్చిన శ్లోకమిది. పరమాత్మ చెప్పినది.
Also read: మానసిక తపస్సు అంటే ఏమిటి?
విషయాన్ : విషయాలను
విషయాలు అంటే? ఇంద్రియాలు గ్రహించే వాటిని విషయాలు అంటారు. పంచేంద్రియాలు కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము. కన్ను దృశ్యాలను గ్రహిస్తుంది, ముక్కు వాసనలను గ్రహిస్తుంది, నాలుక రుచిని, చెవి శబ్దాలను, చర్మము స్పర్శను గ్రహిస్తుంది. ఒక అందమైన వస్తువు కావచ్చు, స్త్రీ పురుషస్పర్శలు (ఒకరినొకరు కోరుకోవటం), శ్రావ్యమైన సంగీతం, రుచికరమైన పదార్ధము మంచి సుగంధాలు స్ప్రేలు… ఇవన్నీ విషయాలు. ఈ విషయాలకు సంబంధించిన ప్రకటనలు పదేపదేవస్తే ఆ మనిషి వాటి గురించే!
ధ్యాయతః = చింతిస్తున్న
పుంసః = పురుషుడికి
తేషు = ఆ విషయాలలో
సంగః = ఆసక్తి
ఉపజాయతే = కలుగుతుంది
సంగాత్ = ఆసక్తి వలన
కామః = కోరిక
సంజాయతే = కలుగుతుంది
కామాత్ = కోరిక వలన
క్రోధః = కోపం
అభిజాయతే = కలుగుతుంది
‘‘ఎల్లప్పుడూ విషయాలను గురించే ఆలోచన చేసే పురుషుడికి వాటిమీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వలన కోపం కలుగుతుంది. మరి ఆ కోపము వలన?
(రేపు)
Also read: శారీరిక తపస్సు అంటే?