- ఒక మధ్యతరగతి వ్యవసాయదారుడి పిల్లలు సాధించిన ఘనకార్యం
- ముక్తారావుకు మొదటి స్థానం
అయిదుగురు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు వారిని భారంగా భావించి పెళ్ళిళ్ళు చేసి పంపించడం ఎట్లాగా అని ఆలోచిస్తారు. కానీ రాజస్థాన్ లో హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఇందుకు భిన్నం. అయిదుగురినీ బాగా చదివించి పోటీ పరీక్షలకు తయారు కావలిసిందిగా ప్రోత్సహించారు తల్లిదండ్రులు. అయిదుగురూ రాజస్థాన్ సివిల్ సర్వీసెసె లో సెలక్టయినారు. తాను కలెక్టర్ కావాలనుకొని మధ్యతరగతి రైతుగా తేలాననీ, నా కలను తన కుమార్తెలు సాకారం చేయాలనీ వారిని ఆయన కోరాడు. తమ తండ్రి అభీష్టం నెరవేర్చాలని అయిదుగురు అక్కచెల్లెళ్ళూ ప్రతిన బూనారు.
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నిర్వహించిన పరీక్షల ఫలితాలు మంగళవారంనాడు ప్రకటించారు. సహదేవ్ సహరన్ కుమార్తెలు ముగ్గురు అన్షు, రీతు, సుమన్ లు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు ఎంపికై సమాజాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటికే వారి అక్కలు రోమా, మంజు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు చెందిన అధికారి ముగ్గురు సోదరీమణుల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వార్తను వెల్లడించడంతో అది వైరల్ గా మారింది. ఈ అరుదైన కుటుంబం సాధించిన ఘనకార్యాన్ని రాజస్థాన్ లోనే కాకుండా దేశం అంతటా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సహదేవ్ సహరాన్ అయిదుగురు కుమార్తెలూ ఆర్ఏఎస్ అధికారులే అంటూ ప్రవీణ్ కాశ్వాన్ పెట్టిన ట్వీట్ ను 5వేల మంది లైక్ చేశారు.
ఝునిఝునికి చెందిన ముక్తారావు ఆర్ఎస్ఎస్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. టొంక్ కి చెందిన మన్మోహన్ శర్మ ద్వితీయ స్థానం సాధించారు. జైపూర్ కి చెందిన శివకాసి ఖండల్ మూడో ర్యాంకు పొందారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అత్యున్నత ర్యాంకులు సాధించిన ముగ్గురినీ ట్వీట్ ద్వారా అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. నలభై సంవత్సరాల ముక్తారావు ఎంసీఏ చదివి ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె భర్త ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలోో అధ్యాపకుడు.
.