Sunday, December 22, 2024

విజయవంతమైన తొలి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం

  • వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

అంతర్జాలంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇటీవల 12 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “తొలి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం ” దిగ్విజయమైంది. సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో తానా, వంగూరి ఫౌండేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, సీపీ బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్), దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, తెలుగు అసోసియేషన్ సిడ్నీ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, వేగేశ్న ఫౌండేషన్ వారి సంయుక్త నిర్వహణలో  కళాప్రపూర్ణ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతి సందర్భంగా ‘మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం’ అత్యంత వైభవంగా నిర్వహించారు. నవంబర్‌ 1 ఆదివారం రోజున 12 గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.

First world music and literary composition successful


దేవుల‌ప‌ల్లి పాట‌కు ప‌ట్టాభిషేకం

దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటకు పట్టాభిషేకం చేసిన ‘మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం’ కార్యక్రమానికి.. ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో గౌరవ స్థానం దక్కింది. భారత్‌, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి 58 మంది గాయనీ గాయకులు పాల్గొని దేవులపల్లి వారు రచించిన 100 పాటలతో  రాత్రి 11 గంటల వరకు శతగీతార్చన గావించారు. 12 గంటల పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారమై, ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల మంది కృష్ణశాస్త్రి అభిమానులకు వీనులవిందు చేసింది.

 కళా హృద యులు, కళా పోషకులు, వంశీ రామరాజు స్వాగత వచనాలతో ప్రారంభమైన ఈ సభకు దేవులపల్లి మనుమరాళ్ళు  రేవతి అడితం (అమెరికా), రేఖ సుప్రియ (చెన్నై) జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తమ తాత జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మక మైనదని, తమకు ఆనంద దాయకమని హర్షం వ్యక్తంచేశారు. కృష్ణ శాస్త్రితో తమకున్న సాన్నిహిత్యాన్ని,  అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సాహితీవేత్త కేవీ రమణాచారి  దేవులపల్లి రచనా వైశిష్ట్యం గురించి  ప్రారంభోపన్యాసంలో వివరించారు.  ఆయన విరచితమైన ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి’ పాటకు జాతీయగీతం కావాల్సిన అర్హత, స్థాయి ఉందన్నారు. సింగపూర్ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ దివంగత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రికి నివాళిగా ప్రప్రథమ సంగీత కార్యక్రమం చేయడం తమ సంస్థకు దక్కిన గౌరవం అన్నారు. ప్రముఖ గాయని సురేఖ మూర్తి ప్రార్థనా గీతం ఆలపించగా, దేవులపల్లి గురించి వీరుభొట్ల హరి శ్రీనివాస్ రాసిన గీతం గాన గంధర్వుడు ఎస్పీ బాలు గానం చేసిన ఆడియోను సభలో వినిపించడం ఒక ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది.

First world music and literary composition successful

దేవుల‌ప‌ల్లి గీతాల ఆలాప‌న‌

సాయంత్ర సభలో రాధిక మంగిపూడి నిర్వహణలో ,  సురేఖ మూర్తి, సీతా రత్నాకర్, విజయలక్ష్మి, శశికళ తదితర ప్రముఖ గాయకులు  కృష్ణశాస్త్రి విరచిత గీతాలను  శ్రావ్యంగా ఆలపించి అలరించారు. సింగపూర్ నివాసి,  కార్యక్రమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు అక్షర మరో  ఇరువురు పిల్లలు కలసి ‘నారాయణ నారాయణ అల్లా అల్లా’ అనే బృందగానం ఆలపించి అందరిని ఆకట్టు కున్నారు. అనంతరం సాహితీవేత్త, ప్రముఖ సినీ రచయిత భువన చంద్రకు  ‘దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారం’  అందజేసి, సన్మానించారు.
 భారత దేశం నుండి సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు, వెన్నెలకంటి, మహాభాష్యం చిత్తరంజన్, అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్, శారద, దేవులపల్లి కుటుంబ సభ్యులు రత్నపాప, ఆస్ట్రేలియా నుంచి కొంచాడ రావు, మధు, న్యూజిలాండ్ నుంచి శ్రీలత, లండన్ నుంచి జొన్నలగడ్డ మూర్తి, వీపీ కిల్లీ, దక్షిణాఫ్రికా నుంచి సీతారామరాజు మొదలగు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం దేవులపల్లికి నివాళులర్పించి, భువనచంద్రకి శుభాకాంక్షలు అందజేశారు. రాధిక మంగిపూడి-సింగపూర్, విజయ గొల్లపూడి- ఆస్ట్రేలియా, జయ పీసపాటి- హాంకాంగ్, రాధికా నోరి- అమెరికా నుంచి వ్యాఖ్యాతలుగా సమయ సందర్భోచితంగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా, ప్రశంసా పాత్రంగా  నిర్వహించారు. సినీ గేయ రచయిత భువనచంద్రకు పురస్కార ప్రదానం మినహా, సినీ, రాజకీయ, తదితర ప్రసంగాలకి అతీతంగా, శాలువా రహితంగా, సన్మానం సత్కారాల ఆర్భాటాలు లేకుండా కేవలం స్వరార్చనకు మాత్రమే పెద్ద పీట వేసిన 12 గంటల ఈ నిర్విరామ సంగీత కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించి, మేనులు పుల కించగా, ఆనందించడం సంగీత చరిత్రలో ఒక మైలు రాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles