- బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- అసోంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తొలి విడతలో మొత్తం 30 నియోజకవర్గాలకు గాను 10,288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 730 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. తొలి దశలో 191 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. పురులియా, ఝార్గామ్ జిల్లాల్లోని అన్ని స్థానాలు బంకుర, మేదినీపుర్, పశ్చిమ మేదినీపుర్, పుర్బా జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం నమోదయినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి: ఒపీనియన్ పోల్స్ బ్యాన్ చేయాలా?
టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ:
పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. సువేందు అధికారి సోదరుడు సోమేందు అధికారి కారుపై కాంటాయ్ ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీఎంసీనే దాడికి పాల్పడినట్లు సోమేందు ఆరోపించారు. దాడి ఘటనపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అరాచకాలకు సౌమేందుపై దాడే నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల్లో సంఘవిద్రోహ శక్తులను కట్టడిచేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి:బెంగాల్ పై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ
అసోంలో పోలింగ్ ప్రశాంతం:
అసోంలో 47 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72.16% శాతంగా నమోదయింది. అసోంలోని 47 నియోజకవర్గాలలో 264 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పోలింగ్ లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. 12 జిల్లాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్ కు 11,537 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. అసోంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ జరిగే తీరును అధికారులు సీసీ కెమెరాలలో పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: వంగభూమిలో బీజేపీకి కష్టమే