Thursday, November 7, 2024

జగన్ లేఖపై దుమారం, ఖండనమండనలు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకీ మధ్య అగాథం
  • విభేదాలు విస్మరించి ఒక్కటైన న్యాయమూర్తులూ, న్యాయవాదులూ
  • దిల్లీ న్యాయవాదుల అసమంజస వైఖరి
  • సీజెఐ బాబ్డే పైన దేశ ప్రజల దృష్టి
  • ఆరోపణలపైన విచారణ జరిపితేనే న్యాయవ్యవస్థకు కొత్త వెలుగు

కె. రామచంద్రమూర్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హైకోర్టు పనితీరుపైన ఫిర్యాదు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డేకి లేఖ రాయడంపైన దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. మొదట్లో సమర్థిస్తున్నట్టు రాసిన దిల్లీ పత్రికలు క్రమంగా స్వరం మార్చాయి. ముఖ్యమంత్రి తప్పుచేశారని ధ్వనించే విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి. న్యాయవ్యవస్థ అన్ని స్థాయిలలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రతికూలంగా మారినట్టు వాతావరణం కన్పిస్తోంది. రోజులు గడిచిన కొద్దీ అసలు విషయాలు బయటికి వస్తాయనీ, లేఖపైన చర్చ జరుగుతుందనీ, లేఖలో ప్రస్తావించిన ఆరోపణలపైన దర్యాప్తు జరుగుతుందనీ కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లేఖ రాయడం మంచిదేననీ, ఆ లేఖను మీడియాకు విడుదల చేయడం దుస్సాహసమనీ, న్యాయవ్యవస్థతో తలబడటమేననీ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఏమి చేస్తారోనని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సందర్భంగా కొన్ని మౌలికమైన అంశాలను పరిశీలిద్దాం. 1. ఒక ముఖ్యమంత్రికి న్యాయవ్యవస్థపైన ఫిర్యాదు చేసే హక్కు ఉన్నదా? లేదా? 2. ముఖ్యమంత్రికి న్యాయవ్యవస్థ పనితీరుపైన అభ్యంతరం ఉండే అవకాశం ఉన్నదా? లేదా? 3. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడికీ, న్యాయవ్యవస్థకీ మధ్య సంబంధాలు ఉన్న మాట నిజమా? కాదా? 4. భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తప్పా, ఒప్పా? 5. ఆ లేఖను మీడియా గోష్ఠి ఏర్పాటు చేసి విడుదల చేయడం తప్పా, ఒప్పా? 6. దిల్లీలో న్యాయవాదులు ముఖ్యమంత్రిని తూలనాడటం, న్యాయమూర్తిని వెనకేసుకొని రావడం సమంజసమేనా? 7. ఇప్పుడు బంతి భారత ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా- సీజేఐ) కోర్టులో ఉన్నది. ఆయన ఏమి చేయాలి? ఏమి చేస్తే సర్వజనసమ్మతంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటుంది?

న్యాయవ్యవస్థపై ఫిర్యాదు చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది

ఒక ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, ఈ దేశంలో ఏ పౌరుడికైనా న్యాయవ్యవస్థపైన ఫిర్యాదు చేసే హక్కు ఉన్నది. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించకుండా వారి తీర్పులను విమర్శించే స్వేచ్ఛ దేశ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించింది. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే. వారు దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతామూర్తులు కారు. వారూ మానవమాత్రులే. వారి వల్ల పొరపాటు జరగడం సహజం. ఆ పొరపాటును ఎవరైనా ఎత్తి చూపించవచ్చు. దేశంలో ప్రతిపౌరుడూ రాష్ట్రపతికీ, భారత ప్రదాన న్యాయమూర్తికీ నేరుగా ఎవరిపైన అయినా ఫిర్యాదు చేయవచ్చు. ప్రధానమంత్రిమీద, ముఖ్యమంత్రుల మీద ఫిర్యాదు చేసినట్టే న్యాయమూర్తులపైన కూడా ఫిర్యాదు చేయవచ్చు. కనుక జగన్ మోహన్ రెడ్డి సీజేఐకి ఫిర్యాదు చేయడం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా, మరి కొందరు న్యాయమూర్తులపైనా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణపైనా ఫిర్యాదు చేయడం  తప్పు కాదు. నేరం అసలే కాదు.

Also read: దర్యాప్తు చేయకుండా జగన్ లేఖను ఖండిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుందా?

ఏమని ఫిర్యాదు చేశారు? అమరావతి భూముల క్రయవిక్రయాలలో అవతవకలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన 2014-2019 కాలంలో జరిగినట్టు ప్రభుత్వానికి అనుమానం ఉన్నదనీ, ఆ వ్యవహారాలు పరిశీలించేందకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామనీ, ఆ ఉపసంఘం సిఫార్సు మేరకు మొత్తం దర్యాప్తును ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్) అప్పజెప్పామనీ, ఆ టీమ్ దర్యాప్తులో కొన్ని విషయాలు బయటికి వచ్చాయనీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలు కూడా అమరావతిలో భూములు కొన్నారనీ, అమరావతి భూములపైన దర్యాప్తు మొదలైన సమయం నుంచి హైకోర్టు వ్యవహారాలపైన ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారనీ ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు.

ముఖ్యమంత్రి ఏమని అభ్యర్థించారు?

చివరికి ఏమి కోరారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ, ఇతర న్యాయమూర్తులను కానీ అమరావతి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయమని కోరారా? కోరలేదు.  హైకోర్టులో న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించకుండా తటస్థంగా ఉండే విధంగా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి కోరారు? ఈ కోర్కెలో ఏమైనా అసమంజసత్వం ఉన్నదా? జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో న్యాయమూర్తులపైన చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అనడంలో సందేహం లవలేశం లేదు. ఇంతవరకూ భారత రిపబ్లిక్ చరిత్రలో న్యాయవ్యవస్థపైన ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాసిన ముఖ్యమంత్రి లేడు. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకతలలో ఇది ఒకటి.

న్యాయవ్యవస్థపైన ఫిర్యాదు చేయవలసిన అవసరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్నదా? ఈ దేశంలో ఏ ఇతర ముఖ్యమంత్రికీ లేని అవసరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉన్నది. ఏ ఇతర ముఖ్యమంత్రికీ రాష్ట్ర స్థాయి న్యాయవ్యవస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నంత వ్యతిరేకంగా లేదు. ఇది సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయం. ఎగ్జిక్యుటీవ్ (ప్రభుత్వం) ముఖ్యమంత్రిదీ, జుడీషియరీ (న్యాయవ్యవస్థ) ప్రతిపక్షనాయకుడిదీ అంటూ ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ప్రజలు చెప్పుకుంటున్న మాట వాస్తవం.

నిమ్మగడ్డ రమేష్ విషయంలో పొరపాట్లు

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ ఇంతవరకూ ఒకటి రెండు మినహాయింపులు తప్ప అన్ని పిటిషన్లపైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకంగా తీర్పులు వచ్చినంత మాత్రాన అన్ని తీర్పులూ పక్షపాతంతో లేదా ప్రభుత్వ వ్యతిరేక భావంతో ఇచ్చినవని చెప్పడానికి వీలు లేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ పదవులూ నిర్వహించకుండా సరాసరి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. సుదీర్ఘమైన పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నిటినీ అమలు చేయాలని తహతహలాడుతున్న యువనేత. మనసు చెప్పినట్టు నడుచుకునే స్వభావం ఉన్న రాజకీయ నాయకుడు. అందువల్ల  హడావిడిలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉన్నది. అధికారుల వల్ల, న్యాయవాదుల వల్ల కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించి చెన్నై నుంచి ఒక మాజీ న్యాయమూర్తిని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టిన విషయంలో జరిగింది తొందరపాటు అనడంలో తటస్థులు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. రమేష్ కుమార్ పిటిషన్లపైన హైకోర్టు, సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలనూ, ఆయనను తిరిగి ఎన్నికల ప్రధానాధికారిగా నియమించిన విషయంలోనూ  న్యాయవ్యవస్థను  తప్పుపట్టే తటస్థులు ఎవ్వరూ ఉండరు. ఆ వ్యవహారం యావత్తూ అసంబద్ధంగా, అపసవ్యంగా జరిగింది.  ఇటువంటివే అనేకం జరిగి ఉండవచ్చు.

‘గ్యాగ్ ఆర్డర్’ సమర్థనీయం కాదు

మాజీ అటార్నీ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పైన వచ్చిన అభియోగాలను విచారించరాదని నిర్ణయించడం, అమరావతి భూముల వ్యవహారంపైన ప్రభుత్వం తరఫున దాఖలైన ప్రాథమిక సమాచార నివేదిక (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్ట్-ఎఫ్ ఐఆర్)ను పత్రికలు  ప్రచురించకూడదనీ, టీవీ చానళ్లు ప్రసారం చేయకూడదనీ, సోషల్ మీడియా ప్రచారం చేయకూడదనీ ఆంక్షలు విధిస్తూ ‘గ్యాగ్ ఆర్డర్’ జారీ చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. అంతకంటే అభ్యంతరకరం అమరావతి భూముల క్రయవిక్రయాలలో జరిగినట్టు భావిస్తున్న అవకతవకలపైన దర్యాప్తు చేయరాదంటూ న్యాయస్థానం ఆదేశించడం.

Also read: Is there any workable procedure to complain against judges?

విశాఖపట్టణంలో ఒక అతిథిగృహం నిర్మించాలంటే కూడా అనేక అభ్యంతరాలు. న్యాయస్థానం జోక్యం. ఇక ప్రభుత్వం చేయగలిగింది ఏమున్నది? మొత్తం 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాళ్ళూచేతులూ కట్టివేసినట్టు కాలేదా? అందువల్ల న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా ఉన్నదని భావించే అవకాశం ముఖ్యమంత్రికి ఉన్నది. న్యాయస్థానంపైన ఫిర్యాదు చేసే హక్కు కూడా ఆయనకు ఉన్నది.

ప్రభుత్వం చేసిన ప్రతిపని పైనా పిటిషన్లు వేయించడం, అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుతగలడమే పనిగా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో కూర్చొని చక్రం తిప్పుతున్నారనేది బహిరంగ రహస్యం.

అన్నికేసులపైనా ‘స్టే’ సాధించిన నేత

తనపైన వచ్చిన కేసులన్నిటిపైనా ‘స్టే’ సంపాదించిన ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇటువంటి తెలివితేటలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి ఉంటే పశువుల దానా కేసులో జైలులో ఉంటూ ఊచలు లెక్కబెట్టవలసి వచ్చేది కాదు. ఒకానొక కేసులో వచ్చిన ఆరోపణలపైన సీబీఐ చేత దర్యాప్తు చేయించమంటూ న్యాయమూర్తి ఆదేశిస్తే తన వద్ద సిబ్బంది లేరు కనుక దర్యాప్తు చేయలేనని సీబీఐ చెబితే నిమ్మకున్న వ్యవస్థ మనది. యూపీఐ హయాంలో లెక్కకు అందని ఆస్తుల కేసులో సీబీఐకి దర్యాప్తు అప్పగించడంలోనూ, చార్జిషీట్ దాఖలు కాకుండానే 16 మాసాలు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని కారాగారంలో ఉంచడంలోనూ, అప్పటి నుంచి లక్షకోట్ల అవినీతికి పాల్పడినారంటూ శాసనసభ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబునాయుడూ, తెదేపా మంత్రులూ ఎత్తిపోడవడంలోనూ చంద్రబాబునాయుడి పాత్ర ఉన్నదనడంలో ఎవ్వరికీ సందేహం లేదు.

మీడియా మద్దతు గురించి చెప్పనక్కరలేదు. అది బహిరంగరహస్యం. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం మీడియా గోష్ఠిలో వెల్లడించిన విషయాలు ఒకరికి నచ్చినా నచ్చకపోయినా చాలా సంచలనాత్మకమైనవి. దేశంలోని పత్రికలన్నీ ప్రధాన వార్తగా ప్రచురిస్తే తెలుగురాష్ట్రాలలో అత్యధిక ప్రాచుర్యం కలిగిన ‘ఈనాడు’ ఒక్క అక్షరం ప్రచురించలేదు. ప్రాచుర్యం రీత్యా మూడోస్థానంలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ వార్తను వార్తగా ప్రచురించకుండా వ్యాఖ్యగా ప్రముఖంగా ప్రచురించింది. చంద్రబాబునాయుడికి కొమ్ముకాస్తున్నాయనే అపవాదును ఏరికోరి తెచ్చుకుంటున్న పత్రికలకు చెప్పవలసింది ఏమున్నది?  తెలుగునాట జర్నలిజం తీరుతెన్నులు గురించి తర్వాత ఎప్పుడైనా సమీక్షించుకోవచ్చు. చంద్రబాబునాయుడికి న్యాయవ్యవస్థతో మంచి సంబంధాలు ఉన్నాయనీ, మీడియాలో అత్యధికభాగం ఆయనకు అండదండలు సమకూర్చుతున్నదనీ, దిల్లీలో పనులు చేయించే వ్యవస్థ సైతం ఆయన అదుపులో ఉన్నదనీ చెప్పడంలో సందేహం లేదు.

ముఖ్యమంత్రి ఏమి చేయాలి?

హైకోర్టుపైన ఫిర్యాదు చేయాలని అనుకున్నముఖ్యమంత్రి ఏమి చేయాలి? 1961లో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అప్పటి కేంద్రమంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రికి న్యాయవ్యవస్థ తీరుపైన లేఖ రాశారు. అంతటితో ఊరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ విషయం ప్రస్తావనకు కూడా రాలేదు. సంజీవయ్యకు న్యాయవ్యవస్థతో ఎదురైన సమస్యకూ, ఇప్పుడు న్యాయవ్యవస్థలో జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న సమస్యకూ మధ్య పోలికే లేదు. సంజీవయ్యకు చంద్రబాబునాయుడు వంటి ప్రతిపక్ష నాయకుడు లేడు. నాటి పరిస్థితులు వేరు. చంద్రబాబునాయుడు ఆడుతున్నఆటకట్టించాలంటే, ఆయనకు తోడ్పడుతున్నారనే అనుమానం ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నిలువరించాలంటే ఫిర్యాదు చేయడం ఒక్కటే జగన్ మోహన్ రెడ్డికి అందుబాటులో ఉన్న మార్గం. ఫిర్యాదు చేసి ఊరుకుంటే సరిపోయేది. లేఖ రాసినట్టు సీజేఐ ఎవ్వరికీ చెప్పేవారు కాదు. ఆయన లేఖ చదువుకొని చర్య తీసుకోకుండా ఉంటే, లేఖ అందినట్టు కూడా ప్రత్యుత్తరం రాయకుండా ఉంటే వారం, పది రోజులు గడువు ఇచ్చి అదేరకమైన లేఖను రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికీ ముఖ్యమంత్రి సమర్పించవచ్చు. ఆ విధంగా చేసినా ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. ఆ లేఖలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు సమస్యగా పరిణమించారనీ, ఆయనను మరో హైకోర్టుకు బదిలీ చేసి తటస్థంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నియమించాలనీ అభ్యర్థించినా నష్టం లేదు. అజయ్ కల్లం మీడియా గోష్ఠి నిర్వహించడంలోనే సమస్య జటిలమై కూర్చున్నది.

లేఖను మీడియాకు ఎందుకు విడుదల చేశారు?

అజయే కల్లం చేత మీడియా గోష్ఠి ఎందుకు పెట్టించారు? జగన్ మోహన్ రెడ్డికీ, చంద్రబాబునాయుడికీ మధ్య జరుగుతున్న ఆధిక్యపోరాటంలో ప్రజాభిప్రాయం (పర్సెప్షన్) ప్రధానం. ఎవరిది పైచేయిగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారనేది ముఖ్యం. చంద్రబాబునాయుడికీ, జస్టిస్ రమణకూ సంబంధాలు ఉన్నాయనీ, జస్టిస్ రమణ కుమార్తెల చేత భూములు కొనిపించడంలో దమ్మాలపాటి శ్రీనివాస్ కూ, చంద్రబాబునాయుడికీ ప్రమేయం ఉన్నదనీ లోకానికి చాటడం జగన్ మోహన్ రెడ్డికి అవసరం. ఆ పని చేయకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘గ్యాగ్ ఆర్డర్’ వేశారు. ఆ ఆదేశాన్ని నిష్ఫలం చేయాలి. అవే అంశాలను ప్రస్తావిస్తూ సీజేఐకి లేఖ రాసినా దానిలోని అంశాలను సీజేఐ వెల్లడించే అవకాశాలు లేవు. అందువల్ల మీడియా గోష్ఠి పెట్టి సీజేఐకి రాసిన లేఖలోని అంశాలను వెల్లడిస్తే కానీ చంద్రబాబునాయుడితో పోరులో ఆధిక్యం లభించదు. లేఖాంశాలను వెల్లడించడం వల్ల రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మారిపోయిందనీ, జస్టిస్ రమణ పట్ల అభ్యంతరాలు ఉండిన న్యాయమూర్తులూ, న్యాయవాదులూ సైతం ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారనీ అందరూ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరణ శైలిపైన అభ్యంతరాలు ఉన్న తోటి న్యాయమూర్తులూ, న్యాయవాదులూ కూడా లేఖ అనంతరం ఆయనకు అండగా నిలబడ్డారనీ, ప్రభుత్వానికీ, జగన్ మోహన్ రెడ్డికీ అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి సాహసించడం లేదనీ వింటున్నాం.

ఇక దిల్లీలో న్యాయవాదుల సంగతి సరేసరి. ఢిల్లీ హైకోర్టు న్యాయవాదల సంఘం (దిల్లీ హైకోర్ట్ బార్ అసోసియేషన్-డీహెచ్ సీ బీఏ), సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్సీఏఓఆర్ఏ) లేఖ రాసినందుకూ, విడుదల చేసినందుకూ ముఖ్యమంత్రిని తప్పు పట్టాయి. మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన న్యాయమూర్తిగా జస్టిస్ రమణను అభివర్ణిస్తూ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించాయి. అటువంటి న్యాయమూర్తిపైన ఆరోపణలు చేయడం న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేయడమేననీ, న్యాయవ్యవస్థను ధిక్కరించడమేననీ న్యాయవాదుల సంఘాలు ఆరోపించాయి. న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ ప్రజాప్రయోజనవ్యాజ్యం (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) దాఖలు చేశారు. ముఖ్యమంత్రి సలహాదారు నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రిపైన చర్య తీసుకోవాలని కోరారు.

జగన్ పై ఎదురు ఆరోపణలు

ముఖ్యమంత్రిపైన విచారణ జరుగుతున్న క్రిమినల్ కేసుల విచారణను వేగిరం చేయాలని సుప్రీంకోర్టు ప్రయత్నిస్తున్న కారణంగానూ, ఈ విషయం జస్టిస్ రమణ నాయకత్వంలోని బెంచి విచారణలో ఉన్న కారణంగానూ న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారని న్యాయవాదలు ఎదురు  ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిపైన విచారణ జరుగుతున్న క్రిమినల్ కేసులలో పసలేదనీ, రాజకీయ కక్షతో, సోనియాగాంధీని ధిక్కరించి కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి, సొంత పార్టీ పెట్టుకున్నారని జగన్ మోహన్ రెడ్డిపైన ప్రతీకారేచ్ఛతో సీబీఐని ప్రయోగించారనీ, ఆ ఆరోపణలు ఏవీ విచారణలో నిలిచేవి కావని ప్రజలలో అత్యధికుల నమ్మకం. న్యాయస్థానంలో విచారణ ప్రజాభిప్రాయం ప్రకారం జరగదు. సీబీఐ, ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టే సాక్ష్యాధారాలపై ఆధారపడి విచారణ జరుగుతుంది. ఏది ఏమైనా ఆ కేసుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి చేయగలిగింది ఏమీ లేదు. ఆయన న్యాయవ్యవస్థను ధిక్కరించే ప్రయత్నం చేయలేదు, అనవసరంగా 16 మాసాలు జైలులో ఉంచినా న్యాయవ్యవస్థనను కానీ, న్యాయవాదులను కానీ, సోనియాగాంధీని కానీ, అహ్మద్ పటేల్ ని కానీ, గులాంనబీ ఆజాద్ ని కానీ, చిదంబరాన్ని కానీ, అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కానీ జగన్ మోహన్ రెడ్డి నిందించిన సందర్భం లేదు. చంద్రబాబునాయుడిని నిందించవలసిన సందర్భం అడుగడుగునా ఆయనే కల్పించారు కనుక ఆయనను నిందించక తప్పలేదు. కనుక న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టించడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలో అర్థం లేదు. న్యాయవ్యవస్థ ఉదాత్తంగా ఉంటే ఒక్క ముఖ్యమంత్రి ఆరోపణలు చేసినంత మాత్రాన భ్రష్టుపట్టదు. న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలు ఆ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులూ, న్యాయాధికారులూ, న్యాయవాదులూ వ్యవహరిస్తున్న తీరుపైన ఉన్నది. ఇది రాస్తున్న సమయంలో దిల్లీలో ఒక న్యాయవాది నివాసంలో ఐదు కోట్ల రూపాయల నగదును ఆదాయంపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి న్యాయవాదుల వల్లనే న్యాయవ్యవస్థ అపఖ్యాతిపాలు అవుతోంది. ముఖ్యమంత్రుల లేఖల వల్ల కాదు.

ఇప్పుడేం జరగాలి?

లేఖ రాసినందుకు జగన్ మోహన్ రెడ్డిపైన కోర్టు ధిక్కారం అభియోగం మోపి కేసు నమోదు చేయాలా? జగన్ మోహన్ రెడ్డి లేఖాంశాలపైన దర్యాప్తు చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి చర్యలు చేపట్టాలా? ఇది వరకు కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపైనా, న్యాయమూర్తులపైనా అభియోగాలు వచ్చినప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులతో కూడిన ఒక సంఘాన్ని నియమించారు. ఇప్పుడు కూడా అదే జరగాలని ప్రముఖ న్యాయవాది, కోర్టు ధిక్కారం కేసులో రూపాయి జరిమానాను ఇటేవలనే చెల్లించిన ప్రశాంత్ భూషణ్ అంటున్నారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు తీవ్రమైనవనీ, వాటిని విచారించాలనీ, మాజీ న్యాయమూర్తులతో సీజేఐ ఒక కమిటీని నియమించి అంతర్గత విచారణకు ఆదేశించాలనీ ప్రశాంత్ భూషణ్ కోరారు. మచ్చలేని న్యాయమూర్తుల చేత విచారణ జరిపించడం అందరికీ మంచిది. ముఖ్యంగా జస్టిస్ రమణకు ఈ విచారణలో నిజం నిగ్గుతేలడం చాలా అవసరం. ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ లో పదోన్నతి పొందుతున్న ఆయనపైన నీలాపనిందలు చెల్లాచెదురైతేనే ఆయనకు ప్రతిష్ఠాత్మకంగా ఉంటుంది. న్యాయవ్యవస్థ కూడా అసలు విషయం పట్టించుకోకుండా లేఖాస్త్రం సంధించిన ముఖ్యమంత్రిని తప్పుపట్టడం మంచిది కాదు. ‘మెసేజ్’ (సందేశం) ఏమిటో పరిశీలించాలి కానీ ‘మెసెంజర్’ (సందేశం తెచ్చిన వార్తాహరుడు)ని శిక్షించాలనుకోవడం న్యాయం కాదు, ధర్మం కాదు.

జీ.కే. రెడ్డి వ్యాఖ్యానం

రామాయణంలో పిడకల వేట లాగా మరో పుకారు సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తన లేఖను సీజేఐకి అందజేసింది 06 అక్టోబర్ 2020న. అదే రోజు ఉదయం ఆయన ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. లేఖాంశాలపైన ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య చర్చ జరిగిందా? చర్చ జరిగిందో లేదో ప్రధాని నరేంద్రమోదీ అయినా చెప్పాలి లేదా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  అయినా చెప్పాలి. ఇద్దరూ చెప్పకుండానే వారిద్దరి మధ్యా చర్చ జరిగిందంటూ, ఏమేమి చర్చించుకున్నారో, ఎవరు ఏమన్నారో వివరిస్తూ వార్తాకథనాలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు జరిగినప్పుడు ‘ద హిందూ’ దిల్లీ ప్రతినిధి జీ.కే. రెడ్డి వ్యాఖ్యానసహిత సమాచారం పంపించేవారు. ఆ పత్రిక మొదటి పేజీలో ఆయన పేరుమీద ప్రముఖంగా ప్రచురించేది. ఆయన నాకు గురుతుల్యుడు. జర్నలిజం విద్యార్థులుగా  మేమందరం చాలా ఆసక్తిగా రెడ్డి గారి కథనాలను చదివేవాళ్ళం.

ఇద్దరు ప్రముఖులు కలుసుకున్న సందర్భంలో ఉన్న పరిస్థితులు ఏమిటో వివరించి, వాటిలో వేటి గురించి మాట్లాడుకునే అవకాశం ఉన్నదో రాసేవారు. విషయం చెప్పేవారు. ఫలానా సంగతులు చర్చించి ఉండవచ్చునంటూ రాసేవారు కానీ చర్చించారంటూ దబాయించేవారు కాదు. ముఖ్యమంత్రి మనసులో ఈ లేఖ ప్రధానంగా ఉన్నదని భావించినట్లయితే దాని గురించి ప్రధానమంత్రికి తెలియజేసి ఉండవచ్చు. లేఖను సీజేఐకి ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పి ఉండవచ్చు. ఇస్తే ఇవ్వమని కానీ తప్పకుండా ఇవ్వమని కానీ ప్రధాని అని ఉండవచ్చు. లేదా లేఖ విషయం విని మౌనంగా ఉండవచ్చు. ఈ లేఖను ఉపయోగించుకొని ప్రధాని జస్టిస్ రమణకు పదోన్నతి కలగకుండా అడ్డుకోవచ్చుననీ లేదా పదోన్నతి కలిగినా తాను చెప్పినట్టు వినేవిధంగా చేసుకోవచ్చుననీ, ఏది ఏమైనా లేఖ రాయడం వల్ల జగన్ మోహన్ రెడ్డి కంటే మోదీకే ప్రయోజనమనీ విశ్లేషణలు వెలువడ్డాయి. ‘ద వైర్’లో వి. వెంకటేశ్ వ్యాసం ఈ రకమైన విశ్లేషణ చేసింది.  

అన్నీ సవ్యంగా ఉంటే సీజేఐగా ఎస్. ఏ. బాబ్డే 23 ఏప్రిల్ 2021న పదవీ విరమణ చేస్తారు. వెంటనే జస్టిస్ రమణ పదవీ స్వీకారం చేస్తారు. ఆ పదవిలో ఆయన 26 ఆగస్టు 2022 వరకూ ఉంటారు. ఏ కారణం వల్లనైనా జస్టిస్ రమణకు పదోన్నతి లభించకపోతే ఆయన స్థానంలో జస్టిస్ ఆర్. ఎఫ్. నారిమన్ భారత ప్రధాన న్యాయమూర్తి పీఠం ఎక్కుతారు. ఆయన ఆ పదవిలో 12 ఆగస్టు 2021 వరకూ, అంటే నాలుగు నెలల చిల్లర మాత్రమే ఉంటారు. అందులో సింహభాగం వేసవి సెలవులలో గడిచిపోతుంది. ఆయన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ స్వీకారం చేస్తారు. ఆయన మోదీ హితుడని ప్రచారం. జస్టిస్ లలిత్ పదవీకాలం 08 నవంబర్ 2022 వరకూ ఉంటుంది. జమిలి ఎన్నికలూ గట్రా ఉంటే ఆ లోగానే ఉంటాయి. ఇవన్నీ ఊహాగానాలే.

ఇన్-హౌస్ కమిటీ దర్యాప్తు

తాను చేసిన ఆరోపణలు నిజమని తేలుతాయనే నమ్మకం ఉంటే ఇన్-హౌస్ కమిటీని నియమించి దర్యాప్తు చేయించవలసిందిగా జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో సీజేఐని కోరవలసింది. జగన్ లేఖలో చేసిన అరోపణలో బలం ఉన్నదని సీజేఐ భావించినట్లయితే ఇన్–హౌస్ కమిటీని నియమించవచ్చు. ఆ కమిటీ కనుక న్యాయమూర్తుల దోషం ఏమీ లేదని నిర్ణయిస్తే జగన్ మోహన్ రెడ్డి చేయగలిగింది ఏమీ లేదు. ఆరోపణలలో నిజం ఉన్నదని ఇన్-హౌస్ కమిటీ నిర్ణయిస్తే అభిశంసన చర్యలు ప్రారంభించవచ్చు. లోక్ సభ స్పీకర్ కు వందమంది లోక్ సభ సభ్యులు నోటీసు ఇవ్వాలి.  రాజ్యసభ అయితే ఉపరాష్ట్రపతికి 50 మంది సభ్యులు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. వారు ప్రతిపాదించిన తీర్మానాన్ని తిరస్కరించే అధికారం లోక్ సభ స్పీకర్ కూ, రాజ్యసభ అధ్యక్షుడికీ ఉన్నది. కొంతకాలం కిందట అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పైన అభిశంసన తీర్మానానికి రాజ్యసభ సభ్యుడు కపిల్ శిబ్బల్ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తిరస్కరించారు.

ఒక వేళ తీర్మానాన్ని అనుమతించాలని స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ నిర్ణయించిన పక్షంలో ముగ్గురు సభ్యులతో ఒక విచారణ సంఘాన్ని నియమించవచ్చు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తినీ, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, పదవీ విరమణ చేసిన ఒక ఉన్నతమైన న్యాయమూర్తినీ సభ్యులుగా నియమించి ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిటీ కనుక న్యాయమూర్తులది తప్పని నిర్ణయించినట్లయితే కమిటీ నివేదికను పార్లమెంటు ఉభయ సభలలో చర్చకు పెడతారు. జస్టిస్ వి. రామస్వామి విషయంలో ఈ క్రమం యావత్తూ అమలు జరిగింది. అభిశంసన తీర్మానంపైన లోక్ సభలో ఓటింగ్ జరిగినప్పుడు అధికారంలో ఉండిన కాంగ్రెస్ సభలో లేకుండా గైర్ హాజరైంది. అభిశంసన జరగలేదు. ఓటింగ్ వరకూ వచ్చిన ఉదంతం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అది ఒక్కటే.

ఎంత దూరం వెడుతుంది వ్యవహారం?

జగన్ మోహన్ రెడ్డి లేఖ ఎంత దూరం వెడుతుందో, పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చూడవలసిందే. లేఖాంశాలపైన విచారణ జరపకపోతే జగన్ మోహన్ రెడ్డి కంటే న్యాయవ్యవస్థకే ఎక్కువ నష్టం. విచారణ జరిపితే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించినట్టు అవుతుంది. ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ముఖ్యమంత్రికి పెద్దగా పరువు నష్టం ఉండదు. కానీ న్యాయమూర్తుల ప్రతిష్ఠ గణనీయంగా  పెరుగుతుంది. ప్రజలకు న్యాయవ్యవస్థ పైన విశ్వాసం హెచ్చుతుంది. న్యాయవ్యవస్థ పరువుప్రతిష్ఠలు ఇనుమడించాలంటే ఫిర్యాదుపై దర్యాప్తు చేయడం మంచిది. ఇది ఒక్కటే సంస్కారవంతమైన, న్యాయబద్ధమైన, ధర్మమైన మార్గం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles