వాల్మీకి మహర్షిని తాలిబాన్ తో పోల్చిన ఉర్దూ కవి మునావ్వర్ రాణా పైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. ‘‘నిరాధారంగా, అనవసరంగా వాల్మీకి మహర్షిని కించపరిచే విధంగా తాలిబాన్ తో పిటిషనర్ పోల్చడం వల్ల మెజారిటీ జనం హృదయాలు బాధకు గురైనాయని జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ సరోజ్ యాదవ్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాలిబాన్ పదేళ్ళ తర్వాత వాల్మీకిలాగా తయారవుతారు. వాల్మీకి రచయిత. హిందూమతం ఎవరినైనా దేవుణ్ణి చేస్తుంది,’’ అంటూ రాణా వ్యాఖ్యానించారు.
హిందూ మహాసభ, సామాజిక సరోకర్ ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హజరత్ పోలీసు స్టేషన్ లో ఎస్ సీ, ఎస్ టీ యాక్టు కింద కేసుపెట్టారు. అంబేడ్కర్ మహాసభ కూడా రాణాపైన కేసు పెట్టాలని డిమాండ్ చేయడం విశేషం. ఐపీసీ సెక్షన్ 153-ఏ, 501 (1)బి, 295-ఏ కింద కేసు పెట్టారు.
ఫిర్యాదులో పేర్కొన్న ఐపీసీ సెక్షన్ల కింద పెట్టిన కేసును పరిశీలించిన మీదట మెజారిటీ సామాజిక వర్గాన్ని బాధించే విధంగా ఉర్దూ కవి వ్యాఖ్యాలు ఉన్నాయని ధర్మాసనం ప్రాథమికంగా నిర్ణయించింది. పిటిషనర్ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించారని అర్థం అవుతోంది. ఎఫ్ఐఆర్ పైన దర్యాప్తు నిలిపివేయవచ్చుననీ, అయితే ఈ దశలో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడం సాధ్యం కాదని ధర్మాసనం నిర్ధారించింది.