- తొలిసారి డిజిటల్ బడ్జెట్
- ఆరోగ్య రంగానికి పెద్ద పీట
- లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- నల్లచొక్కాలతో హాజరయిన కాంగ్రెస్ సభ్యులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ ప్రత్యేకతను సంతరించుకుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణను చేపట్టలేదు. ఈసారి బడ్జెట్ ను డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు. గతంలో బడ్జెట్ కాపీలను సూట్ కేసులో తీసుకొచ్చేవారు. అయితే 2019 2020 బడ్జెట్ సమర్పించే సమయంలో సంప్రదాయ వస్త్రం లో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు నల్లచొక్కాలు ధరించి హాజరయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు నల్ల చొక్కాలు ధరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదానికి ముందు నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. బడ్జెట్ గురించి వివరించారు.
ఆరోగ్యానికి పెద్ద పీట:
కరోనా మహమ్మారి నేపథ్యంలో బడ్జెట్ లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి 2 లక్షల, 23 వేల 846 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కేటాయింపులలో భాగంగా 9 బీఎస్ఎల్-3 స్థాయి ల్యాబ్ లు , 15 ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని అన్ని జిల్లాలలో సమీకృత వ్యాధి నిర్ధరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా దేశంలో కొత్తగా నాలు ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు:
2021-22 బడ్జెట్ లో కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక రంగం కోలుకునేందుకు కేంద్రం పలు పథకాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 1) 12 గంటల సమయనికి బీఎస్ఈ సెన్సెక్ 921 పాయింట్లు లాభపడి 47206 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 261 పాయింట్లు లాభపడి 13893 వద్ద కొనసాగుతోంది. పాత వాహనాలకు సంబంధించిన నూతన తుక్కు విధానాన్ని ప్రకటించడంతో ఆటో రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: కరోనా బడ్జెట్ మధ్యతరగతిని కనికరిస్తుందా?