అమరజీవి పొట్టి శ్రీరాములు అపూర్వ త్యాగాన్ని తెలుగువారు విస్మరిస్తున్న రోజుల్లో ఆయన స్మృతిని ఈ తరంవారికీ, భావి తరాలవారికీ గుర్తు చేయాలన్న పరమ ఉత్కృష్టమైన లక్ష్యంతో ప్రముఖ నటుడు త్రిపురనేని సాయిచంద్ చెన్నై నుంచి పాదయాత్రను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఆంధ్రరాష్ట్రం కోసం అసువులుబాసిన పొట్టి శ్రీరాములు 70వ జయంతి సందర్భంగా సాయిచంద్ తన నివాళి అర్పిస్తున్నారు. చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నుంచి ఆయన స్వగ్రామమైన ప్రకాశంజిల్లా కనిగిరి మండలం పడమటిపల్లె వరకూ జరిగే పాదయాత్ర పూర్తిచేయడానికి పది నుంచి పన్నెండు రోజులు పడుతుందని అంచనా.
ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు, విఖ్యాత సాహితీవేత్త, సామాజిక ఉద్యమకారుడు త్రిపురనేని రామస్వామిచౌదరి మనుమడు అయిన సాయిచంద్ విశిష్టమైన వ్యక్తి. అతడు సినీ నటుడు, డాక్యుమెంటరీల నిర్మాత, రచయిత, గాయకుడు. ఆజన్మబ్రహ్మచారి. ‘మా భూమి‘ సినిమాద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతం ఘోష్ దర్శకత్వంలో ప్రముఖ దర్శక, నిర్మాత నర్సింగ్ రావు నిర్మిచిన ఈ సినిమాలో సాయిచంద్ అద్భుతమైన నటన చూసి నటుడిగా పెక్కు చిత్రాలలో నటిస్తారని ప్రేక్షకులు ఆశించారు. ‘మాభూమి’ తర్వాత ‘రంగులకల’లోనూ, ‘ఆడవాళ్ళే అలిగితే’ అనే టైటిల్ తో వచ్చిన సినిమాలోనూ, మరికొన్ని సినిమాలలోనూ నటించారు.
1992లో నటనకు విరామం ప్రకటించారు. దూరదర్శన్ కు డాక్యుమెంటరీల నిర్మాణంలో నిమగ్నమైనారు. పాతికేళ్ళు వెండి తెరకు విరామం ప్రకటించిన సాయిచంద్ చేత మళ్ళీ ‘ఫిదా’ చిత్రంలో సాయిపల్లవి తండ్రి పాత్రలో శేఖర్ కమ్ముల జీవింపజేశారు.
అంతకు ముందు ‘మాభూమి’ చిత్రాన్ని శేఖర్ కమ్ముల చూసి ముగ్ధుడైనారు. ‘నా తల్లి కదా నా మాట ఇనమ్మా’ అనే సాయిచంద్ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందింది. నేటి యువతులు సాయిచంద్ కు ఫిదా అయ్యారు. తండ్రిపాత్ర పోషించడానికి సాయిచంద్ కు చాలా ఆఫర్లు వచ్చాయి.
రక్తగతమైన సాహిత్యాన్నీ, సామాజిక స్పృహనూ సాయిచంద్ ప్రదర్శిస్తూ రచనలు చేశారు. గోపీచంద్ సాహితీ వీక్షణం, దాశరథి రంగాచార్య ఆరు అనువాద నవలలు, కేరాఫ్, తదితర పుస్తకాలను సాయిచంద్ రచించారు.
పాదయాత్రకు ఉపక్రమించే ముందు చన్నైలోని మైలాపూర్ లో పొట్టి శ్రీరాములు స్మారకభవనం దగ్గర ఆయన విగ్రహానికి మాల వేసి వందనం సమర్పించారు.
ఎవరో ఒకరు ఎపుడోఅపుడు
నడవరా ముందుగా
అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు…
అని ఆయన రాసుకున్నారు.
పొట్టి శ్రీరాములు 15 డిసెంబర్ 1952న 58 రోజుల ఆమరణ నిరాహారదీక్ఝ పూర్తి చేశారు. ఆయన అమరుడైన రోజున చెన్నై నుంచి ప్రకాశం జిల్లాలో ఆయన స్వగ్రామానికి యాత్ర ప్రారంభించారు సాయిచంద్. ‘‘ఈ దీక్ష ద్వారా శ్రీరాములుగారి త్యాగం నేటి తరానికి గుర్తు చేయాలని నా చిరుసంకల్సం’’ అని సాయిచంద్ కాలినడకన దీక్ష అన్న కరపత్రంలో రాసుకున్నారు. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ‘ఏక్లా చలో రే’ అన్న కింద గీతాన్ని ఆయన హృదయంలో నింపుకొని పాదయాత్ర మొదలు పెట్టారు.