కోవిడ్ -19 మానవాళికి కొత్తగా సోకిన వైరస్, వైద్య రంగాలకు కొత్తగా పరిచయమైన అంటు వ్యాధి. దీని వయస్సు ఇప్పటికి సుమారు ఒకటిన్నర సంవత్సరం. గత జనవరికి కాస్త అటుఇటుగా ఈ వైరస్ వెలుగు చూసింది. చైనా నుంచి మొదలైన దాని ప్రయాణం ఇంచుమించుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సాగింది. గత సంవత్సరం దీన్ని పూర్తిగా అర్ధం చేసుకోడానికి వీలు పడలేదు. నిపుణుల అధ్యయన వేగం మెల్లగా మెల్లగా పెరుగుతోంది. ఈపాటికే కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని వాక్సిన్లు మార్కెట్ లో ఉన్నాయి. కరోనా వైరస్ ప్రయాణం ప్రారంభమైన అతి తక్కువకాలంలోనే మ్యుటేషన్స్ జరిగి వివిధ రకాలు ఉత్పన్నమయ్యాయి.
Also read: తాత్పర్యం లేని టీకాలు
అర్థం చేసుకోవడమే అసలైన సవాల్
ఈ వేరియంట్స్ అన్నింటినీ అర్ధం చేసుకుంటూ ముందుకు సాగడం నిపుణులకు పెద్ద సవాల్ గా నిలిచింది. వైద్యం, వ్యాక్సినేషన్ కంటే ముందుగా, మానవాళి పాటించాల్సిన జాగ్రత్తలను నిపుణులు మన ముందుంచారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, శరీరాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంచే దిశగా ఆహారం, యోగా, ధ్యానం, ప్రాణాయామం, శారీరక వ్యాయామాలు మొదలైన వాటిని నిపుణులు సూచించారు. దీన్ని అందరూ పాటించకపోయినా, పాటించిన కొందరికి ఫలితాలు దక్కాయి. వీటన్నింటి వల్ల దుష్ప్రభావం మాత్రం కొంత తగ్గింది. వ్యాప్తిని, తీవ్రతను, మరణాలను కట్టడి చేయడంలో కొంత వరకూ సత్ఫలితాలు వచ్చాయి. వైరస్ లో వచ్చిన మార్పులు, ప్రజల్లో ఎక్కువమంది స్వయం క్రమశిక్షణ పాటించకపోవడం, ప్రభుత్వాలు ముందు జాగ్రత్తతో సన్నద్ధం కాకపోవడం, అశ్రద్ధ, అనాసక్తి మొదలైన వాటి వల్ల 2021 ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఉధృతి పెరిగింది. తర్వాత తర్వాత అది తీవ్ర రూపాన్ని దాల్చింది. మరణాల రేటు పెరిగింది. మనుషుల్లో మానసిక ఒత్తిడి పెరిగింది. 139కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో కరోనా అన్ని రంగాలకు అతిపెద్ద సవాల్ గా మారింది.
Also read: అనివార్యమైన లాక్ డౌన్
మనిషికీ, మహమ్మారికీ మధ్య పోరాటం
ఇది మనిషికి – వైరస్ కు మధ్య జరుగుతున్న పెద్ద పోరుగా పరిణామం చెందింది. మానవ జీవన పరిణామ క్రమంలో ఇంతకంటే పెద్ద వైరస్ లు, వ్యాధులు చుట్టుముట్టాయి.మనిషి వాటిని అధిగమిస్తూనే తన ఉనికిని కాపాడుకుంటూ, మేధోమధనంతో విజయం సాధిస్తూ వస్తున్నాడు. కాకపోతే, ఈ తరాలు కరోనా వైరస్ అనేదాన్ని కలలో కూడా ఊహించలేదు. ఇంత విపత్తును చూడవల్సి వస్తుందని కలలో ఇలలో తలచలేదు. ఈ రెండు దశాబ్దాల్లో అనేక వ్యాధులు ఇబ్బందులు పెట్టినా, కష్ట నష్టాలు కలిగించినా,ఇంతగా యావత్తు మానవాళిని వణికించి, నిర్వీర్యులుగా మార్చింది కరోనా మాత్రమే. కొత్త కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి, మందులు వస్తున్నాయి, చికిత్సా విధానాలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ వరుసగా భారత్ కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ వైరస్ పై నిపుణులకు, శాస్త్రవేత్తలకు, వైద్యులకు, పాలకులకు గతంలో కంటే అవగాహన పెరుగుతోంది.
Also read: అంతా ఆరంభశూరత్వమేనా?
అమాంతంగా వచ్చిపడిన ఆపద
అమాంతంగా వచ్చి మీద పడిన ఆపద కాబట్టి దీన్ని అడ్డుకోవడంలో అందరూ తడబడ్డారన్నది వాస్తవం.ప్రభుత్వాల డొల్లతనం,నాయకుల దార్శనిక వైఫల్యం బట్టబయలయ్యాయి. జులై కల్లా ఉధృతి తగ్గుముఖం పడుతుందంటున్నారు.అదే సమయంలో, మూడవ వేవ్ కూడా ముందుందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచుకుంటే తప్ప, మూడవ వేవ్ ను అడ్డుకోలేమని నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెడితే, అత్యంత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలోనూ శాస్త్రవేత్తలు, పరిశీలకులు ప్రభుత్వాలను, ప్రజలను అప్రమత్తం చేశారు. వాటికి విలువ ఇవ్వకుండా మొద్దు నిద్ర పోవడం వల్లనే ఈనాడు ఈ దుస్థితి ఎదురైంది. కనీసం ఇప్పటి హెచ్చరికలకైనా విలువిచ్చి నడుచుకుంటే మంచిది. ఒక్క ఔషధంతో కోవిడ్ ను అడ్డుకునే దిశగా ఆస్ట్రేలియా -అమెరికా శాస్త్రవేత్తల బృందం గొప్ప పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది.
Also read: ఈ సారైనా వలస కార్మికుల గురించి ఆలోచించారా?
సరికొత్త ఔషధం వస్తోంది!
గ్రిఫిత్ విశ్వవిద్యాలయానికి చెందిన మెంజీస్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన ప్రత్యేక ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగిస్తే మంచి ఫలితాలు వచ్చాయాని సమాచారం. ఎలుకలపై జరిపిన పరీక్షల్లో 99.9 శాతం వైరస్ పార్టికల్స్ క్షీణించాయని చెబుతున్నారు. కరోనా బాధితులకు వరుసగా ఐదు రోజుల పాటు ఇంజక్షన్ ఇస్తే, వైరస్ ను అరికట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. కాకపోతే, మనుషులపై ప్రయోగాలు పూర్తవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఔషధం అన్నిరకాల స్ట్రెయిన్లపై పనిచేస్తుందని చెప్పడం విశేషం. మొన్ననే,భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డి ఆర్ డి ఓ 2-డిజి ఔషధాన్ని రచించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధిగ్రస్తులకు ఆక్సిజన్ అంశంలో ఇది ఉపయోగ పడుతుంది. ఇలా, ప్రభుత్వ, ప్రైవేట్, స్వదేశీ, విదేశీ సంస్థలు కరోనాను కట్టడి చేయడానికి వివిధ చికిత్సా మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఇంకా అన్వేషణలను కూడా కొనసాగిస్తున్నాయి. ఆన్నీ ఫలించి కరోనా కాలం త్వరలో ముగుస్తుందని ఆశిద్దాం.
Also read: కోరలు చాచుతున్న కరోనా