- 1100 కోట్ల పెట్టుబడి
- వెయ్యిమందికి ఉద్యోగాలు
- వచ్చే సంవత్సరం అంతానికి సంస్థ కార్యకలాపాలు ఆరంభం
- అమెరికా వెలుపల ఫియట్ మజిలీ ఇదే
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం ఐటీ సిగలో మరో అందమైన పుష్పం చేరుకోనున్నది. ఆటోమొబైల్ రంగంలో మేటి ఫియర్ అమెరికా తర్వాత తన రెండో మజిలీగా హైదరాబాద్ ను ఎన్నుకున్నది. ప్రపంచంలో వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఫియట్ హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని నెలకొల్పనున్నది. రూ. 1,110 కోట్ల (150 మిలియన్ అమెరికన్ డాలర్ల) పెట్టుబడితో ఫియట్ తన ఐటీ హబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నదని ఆ సంస్థ బుధవారంనాడు ప్రకటించింది. ఈ కేంద్రంలో ఎఫ్ సీఏ కు ట్రాన్స్ ఫర్మేషన్, ఇన్నోవేషన్ ఇంజిన్ గా గ్లోబల్ డిజిటల్ హబ్ సేవలు అందిస్తుంది.
‘‘ప్రపంచంలోని అన్ని రంగాలలో పురోగమిస్తున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ గత ఐదారేళ్ళుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్ కు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తాం. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ , ట్టాన్స్ పోర్టేషన్, ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలకూ తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది,’’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఫియట్ నిర్ణయం పట్ల హర్షం ప్రకటించారు.
ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్ సీఏ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన వర్చువల్ మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో కేటీఆర్, ఎఫ్ సీఐ నార్త్ అమెరికా, ఆసియా-ఫసిఫిక్ సీఐవో మమత చామర్తి, ఫియట్ ఇండియా ఎండీ పార్థదత్తా ఇతర వివరాలు అందజేశారు. డైరెక్టర్ హెడ్ ఆఫ్ పీసీఏ కరీం లలానీ, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఐటీ చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్ నాథ్ రెడ్డి, తదితరులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఉత్తర అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే గ్లోబల్ డిజిటల్ ఏర్పాటు చేస్తున్నామనీ, వచ్చే ఏడాది చివరినాటికి దాదాపు వెయ్యిమందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ ఎఫ్ సీఏ సీఐవో మమత చామర్తి తెలియజేశారు. కనెక్టెట్ వెహికిల్ సర్వీసెస్, డాటా సైన్స్, క్లౌడ్ సర్వీసెస్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వంటి సాంకేతిక అవకాశాలపైన దృష్టి సారిస్తామని ఆమె వెల్లడించారు. హైదరాబాద్ కు తమ సంస్థను విస్తరించడంతో భారత్ తో తమకు గల సంబంధం బలపడుతుందని ఫియట్ ఇండియా ఎండీ పార్థదత్తా వ్యాఖ్యానించారు.