భూమిశిస్తూ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆదేశాలు బేఖాతరు
అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోణం రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 289లో 40 ఎకరాల భూమిలో ఆదివాసీలు దశాబ్దాలుగా సాగులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిమ తెగలకు చెందిన ( PV T G) ఆదివాసీలుగా గుర్తించిన కొందు తెగ ఆదివాసీలు ఈ భూమిలో కొత్త వీధి అనే గ్రామాన్ని నిర్మించుకొని గత 30 ఏళ్లుగా జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం విద్యుత్ సదుపాయం కూడా కల్పించింది.
గత ఏడాది జూన్ 13వ తారీకు నాడు అప్పటి తాసిల్దార్ సాగులో ఉన్న ఆదివాసీలకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, విచారణ చేయకుండా భూమి రికార్డులను గిరిజనేతరుల పేరుతో మార్చేశారు. ఏడ ఎకరాల సీలింగ్ మిగులు భూమిని కూడా జిరాయితీ పట్టా భూమిగా అప్పటి తాసిల్దార్ రికార్డులో చూపించారు. అప్పటి నుండి ఆదివాసీలకు భూమి ఖాళీ చేయాలని హెచ్చరికలు మొదలయ్యాయి. దాంతో ఆదివాసి సాగుదారులు భూమిశిస్తూ కమిషనరుకు ఫిర్యాదు చేయగా సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని, ఆదిమ తెగల ఆదివాసీలను భూమి నుండి తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయరాదని 2022 ఆగస్టు 23న అనకాపల్లి జిల్లా, జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. గత ఏడాది జూన్ 13న రికార్డులో చేసిన మార్పులను నిలిపివేస్తూ సర్వే నంబర్ 289 లోని మొత్తం భూమిని వివాదాస్పద భూమిగా రికార్డులో నమోదు చేశారు.
Also read: అంతటివాడు చెప్పినా పరిష్కారానికి నోచుకోసి సమస్య
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాలపై డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ వారు తేదీ 25 ఏప్రిల్ 23న పాడేరు ఐటిడిఏ వారిని ఆదేశిస్తూ సర్వే నంబర్ 289 పై సమగ్రమైన ఎంజాయ్మెంట్ సర్వే జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలుపరిచి ఎంజాయ్మెంట్ సర్వే జరిపితే భూమిలో ఎవరు ఉన్నది తేలిపోతుంది. దీంతో ఒక్కసారిగా భూమాఫియా తన పావులు కదపడం మొదలుపెట్టింది. ఎంజాయ్మెంట్ సర్వే జరగకుండా స్థానిక రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ ఉండగా, మరోవైపున ఆదివాసీలు పెంచిన జీడి తోటలను ఆటోమేటిక్ రంపాలతో కోసేసి తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. జెసిబి లు తీసుకొచ్చి ఆదివాసీల గ్రామాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించడం మొదలుపెట్టారు. ఈరోజు అనగా మీ 18వ తేదీన కొంతమంది గిరిజనేతరులు సర్వేనెంబర్ 289 లోని ఆదివాసీల జీడి తోటలను నరికి వేయడం ప్రారంభించారు.
ఇది గమనించిన కొత్త వీధి ఆదివాసి రైతులు, రైతు మహిళలు జీడి మామిడి తోటలలోకి చేరుకొని తోటల విధ్వంసాన్ని నిలిపివేశారు.
Also read: ఇచ్చిన మాటకు కట్టుబడండి, బాధితుల డిమాండ్
కొందు ఆదివాసి రైతు మహిళా గేమ్మెలి చిలకమ్మ మాట్లాడుతూ తాము ఎంతో శ్రమపడి పెంచిన జీడి మామిడి తోటలను రంపాలతో కోస్తున్నారని తాము అడ్డగించి ఈరోజు నిలిపివేశామని జిల్లా కలెక్టర్ గారు వెంటనే తమ గ్రామానికి వచ్చి పరిశీలన చేసి న్యాయం చేయాలని ఆమె కోరింది.
వంతాల కుమారి కన్నీళ్లు పెట్టుకుంటూ తమ బిడ్డలను పెంచినట్టే జీడి మామిడి తోటలను పెంచామని అవే తమకు జీవనాధారం అని వాటిని తీసేస్తే తాము రోజు కూలీలుగా మారిపోతామని ఆవేదన వెలిబుచ్చారు.
మరో ఆదివాసి రైతు మహిళ మాట్లాడుతూ తమ భూమిలో ఉన్నది లేనిది నిర్ధారించమని కలెక్టర్ నుండి గ్రామ పరిపాలన అధికారి వరకు గత సంవత్సర కాలంగా వేడుకుంటున్నామని మా గ్రామానికి అధికారులు వస్తున్నారు గాని తమ నివేదికలలో మేము సాగులో ఉన్న విషయాన్ని కావాలనే రాయటం లేదని ఆమె ఆవేదన చెందారు.
P.S. అజయ్ కుమార్, జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యున్నత రెవిన్యూ అధికారి అయిన భూమిశిస్తూ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను కూడా మండల రెవెన్యూ అధికారులు పాటించడం లేదని, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో రాష్ట్రస్థాయి అధికారి అయిన డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ వారి ఆదేశాలను కూడా స్థానిక రెవిన్యూ అధికారులు ఖాతరు చేయటం లేదని ఆయన అన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన ఉత్తర్వులపై స్పందించి డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆదేశాలు ఇచ్చారని ఇంతకు మించిన ఉన్నతాధికారులు ఎవరు ఉంటారని ఆయన అన్నారు. గిరిజనేతరుల ప్రయోజనాలను కాపాడడానికే స్థానిక రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే జరపకుండా నాటకం ఆడుతున్నారని మరోవైపున గిరిజనేతరులకకు సమాచారం ఇస్తూ “భూమిలో ఉన్న తోటలను వెంటనే తొలగించండ” ని చెబుతున్నారని తమ వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. ఏకపక్షంగా రికార్డులు మార్చేసిన గత తాసిల్దార్ కు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం షోకజ్ నోటీసు ఇచ్చిందని ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనిని బట్టి గిరిజనేతర భూమాఫియా లాబీ బలంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఆదివాసీలపై జరుగుతున్న ఈ దౌర్జన్యానికి చరమగీతం పాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని గూర్చి సమాచారాన్ని తాసిల్దార్, జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, భూమిశిస్తూ కమిషనర్ కార్యాలయం, డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ వారికి తెలియజేశామని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యటించి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
ఆదివాసి రైతులు రైతు మహిళలు తిరగబడడంతో తాము తీసుకొచ్చిన యాంత్రిక రంపాలను తీసుకొని గిరిజనేతరులు అక్కడ నుండి పలాయినం చెత్తగించారు.
Also read: వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలకు విముక్తి, పట్టా చేతికి వచ్చిన గంటకే ప్రాణం పోయింది!