- అన్ని వైరస్ లూ జంతువుల నుంచి వచ్చేవే
- అంతిమంగా మనిషే గెలిచి నిలబడతాడు
- నియోకోవ్ గురించి ప్రచారం నమ్మవద్దు
కరోనా వైరస్ ల వ్యాప్తి కంటే కొత్త వేరియంట్లు, వైరస్ లకు సంబంధించిన వార్తలే ఎక్కువ భయపెడుతున్నాయి. ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అప్రమత్తంగా ఉంచడం వేరు, భయకంపితులను చెయ్యడం వేరు.
Also read: విజయపథంలో బీజేపీ, ఆప్?
భయపెడుతున్న నియోకోవ్
డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల నుంచి త్వరలోనే విముక్తి ఉంటుందనే శుభవార్తలు వింటున్న దశలోనే ఇప్పుడు ‘నియో కోవ్ ‘ అనే కొత్త వైరస్ నుంచి పెనుప్రమాదం ముంచి ఉందనే వార్తలు మంటలు రగిలిస్తున్నాయి. అది సోకిన ముగ్గురిలో ఒకరికి మరణం తప్పదని, దీనిని తట్టుకొనే వ్యాక్సిన్లు ప్రపంచంలో లేవని పెద్ద ప్రచారం జరుగుతోంది. అది ఇంకా గబ్బిలాలకే పరిమితమై ఉందని, మనుషులను చేరడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. ఏదో ఒకరోజు మనిషిని కూడా తాకుతుందనే ఆ మాటలు ధ్వనిస్తున్నాయి. ఇంతకూ దీనికి సంబంధించిన పరిశోధనలలోని సమగ్రత ఎంత? అధికారిక ముఖ్య జర్నల్స్ లో ఎన్ని వ్యాసాలు ప్రచురితమయ్యాయి? మిగిలిన ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు దాని గురించి ఏమి మాట్లాడుకుంటున్నారు? మొదలైనవన్నీ బయటకు రావాల్సి ఉంది. నియో కోవ్ వైరస్ పై డబ్ల్యూ హెచ్ ఓ ( ప్రపంచ ఆరోగ్య సంస్థ ) తాజాగా స్పందించింది. డబ్ల్యూ హెచ్ ఓ ఏమంటుందో ఒకసారి చూద్దాం. గబ్బిలాల్లో ‘ నియో కోవ్ ‘ ఉన్నట్టు వూహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని డబ్ల్యూ హెచ్ ఓ అంటోంది. ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకోనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూ హెచ్ ఓ పేర్కొన్నట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ చెబుతోంది. మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు జంతువులే మూలమని, అందునా వన్యప్రాణులని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ జంతువులతో పాటు గబ్బిలాల్లోనూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘నియో కోవ్’ అనే కొత్త రకం వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందని వస్తున్న ప్రచారం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల ప్రభుత్వాలదే. 2012, 2015 ప్రాంతంలో కొన్ని దేశాల్లో మెర్స్ – కోవ్ విజృంభించింది. ప్రాణనష్టం కూడా జరిగింది. కాకపోతే, అది అప్పుడు ప్రాశ్చ్య దేశాలకే పరిమతమైంది. భారత్ వంటి దేశాలకు ఆ చేదు అనుభవాలు ఎదురవ్వకపోవడం అదృష్టం.
Also read: వీడని కోవిద్ మహమ్మారి
అతిగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోవద్దు
ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్న ఈ కొత్త వైరస్ ప్రమాదం కూడా అన్ని దేశాలకు పాకుతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అసలు మనిషిని చేరడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితిలోనే వూహాన్ శాస్త్రవేత్తలు సైతం ఉన్నారు. దీనిపైనే కాదు, ఏ వైరస్ గురించీ అతిగా అలోచించవద్దని ఎక్కువమంది శాస్త్రవేత్తలు హితవాక్కులు పలుకుతున్నారు. కోట్లాది సంవత్సరాల జీవరాశి ప్రయాణంలో, లక్షలాది సంవత్సరాల మానవ వికాస పరిణామంలో ఎన్నో చర్యలు చోటుచేసుకున్నాయి, ఎన్నెన్నో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. తోటి జీవరాశుల దాడులు, మనుగడ కోసం యుద్ధాలు, ఊహించని దెబ్బలు, ప్రకృతి వైపరీత్యాలు అన్నింటినీ తట్టుకుంటూనే మనిషి ఇక్కడ దాకా వచ్చాడు. కరోనా కంటే ముందు ఎన్నో వైరస్ లు మనిషిని చుట్టుముట్టాయి. కాలక్రమంలో వాటిని శాస్త్రీయంగా ఎదుర్కొని జయించాడు. ఇప్పుడు కరోనా వైరస్ లతోనూ పోరాడుతున్నాడు. వచ్చిన కొత్తల్లో గందరగోళం నెలకొన్నా, నేడు మెల్లగా ఆ భయాల నుంచి బయటకు వస్తున్నాడు. ఆధునిక వైద్య శాస్త్త్రాన్ని ఆయుధంగా మలుచుకొని రక్షణ కల్పించుకుంటున్నాడు. రేపు నియో కోవ్ వచ్చినా, దాని తర్వాత ఇంకేది వచ్చినా ఇలాగే ఎదుర్కుంటాడు. ఇది నిరంతర స్రవంతి. అంతంలేని పోరాటం. ఈ సూత్రాలను మర్చిపోతే మనిషి నిత్యం చస్తూ బతకాలి. ముందు భయమనే మానసిక వైరస్ నుంచి బయటపడండని మనస్తత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also read: ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలు వస్తున్నాయ్!
మెడికల్ మాఫియా ప్రచ్ఛన్న హస్తం
నేటి ఆధునిక మానవుడికి సుఖాలతో పాటు ఇటువంటి కష్టాలు రావడానికి కారణం కూడా మనిషేనని మేధావులు గుర్తు చేస్తున్నారు. పర్యావరణాన్ని, వాతావరణాన్ని, జీవావరణాన్ని ప్రకృతిని, తోటి జీవరాశులను చంపుకుంటూ వచ్చిన ఆధునిక మానవుడికి ఇటువంటి గతిపట్టడం సహజమని ప్రకృతి పరిరక్షణా ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ అనారోగ్యం వెనకాల మెడికల్ మాఫియా దాగి ఉందని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలను భయభ్రాంతులకు గురిచేస్తూ సొమ్ము చేసుకొనే వ్యవస్థల పట్ల కూడా అప్రమత్తం కావడం ముఖ్యమని వారు ప్రియం పలుకుతున్నారు. ఒమిక్రాన్ ఒరవడి, వేడి మార్చి కల్లా తగ్గిపోతుందని వస్తున్న వార్తల్లోని నిజానిజాలు ఎలాగూ త్వరలోనే తేలిపోతాయి. అట్లాగే, ఈ నియో కోవ్ వైరస్ కు సంబంధించిన నిజాలు కూడా త్వరలోనే తేలుతాయి. స్వయంక్రమశిక్షణను పాటిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, మనల్ని మనం కాపాడుకోవడమే మనం చెయ్యాల్సింది, చేయగలిగింది.
Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి