Thursday, November 7, 2024

భయమంటే….నీకు హెచ్చరిక!

మనిషికి ఆనందం… దుఃఖం…ఎంతో “భయం” అంతే…! ఆ భయం ఉండడం వల్లే ప్రపంచంలో ఇంకా అనర్థాలు జరగడం లేదంటే నమ్ముతారా మీరు? కానీ ఇది ముమ్మాటికీ నిజం! జీవితంలో మనిషికి అన్నింటికన్నా ఆత్మ సాక్షి భయం! ఒక దొంగ కూడా భయం భయంగా దొంగ తనం చేస్తాడు. ఇంట్లోకి జొరబడ్డాకా ఆ దొంగను చూసి గుండె ఆగి భయం తో చచ్చే వారు ఉంటారు. అర్ధరాత్రి బయట గొళ్ళెం తీస్తున్న చప్పుడు అయిందంటే భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి.ఇక్కడ విచిత్రం ఏమిటంటే రెండు ప్రాణాలు భయంతో వణికిపోతూ ఆత్మ రక్షణ కోసం పాటు పాడే సీన్స్ భలే గమ్మత్తుగా, భయం గొల్పే విధంగా ఉంటాయి! ట్రాకింగ్ చేసే వారు ఎత్తైన కొండ ఎక్కే టప్పుడు లక్ష్యం కోసం ప్రశంసల కోసం ఎక్కుతుంటారు. ప్రతి సెకను ప్రాణ భయంతో ఎక్కే ఆ కొండ నుంచి జారి పడితే ఇక అంతే సంగతులు! కానీ ఆ భయాన్ని ఛేదించే ఆత్మ విశ్వాసం ఎంత ఉంటుందో ప్రాణ భయం అంతే ఉంటుంది!

శిఖరం వద్ద లక్ష్యం చేరేముందు   చేతులు జారుతుంటాయి,  చెమట పడుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం ఆ  భయం లోనే లక్ష్యం చేరిన తరువాత ఎంత ఆనందం ఉంటుందో దిగే వరకు కూడా అంతే భయం వెంటాడుతూనే ఉంటుంది! భయం ఉండడం వల్లే లక్ష్యం ఛేదించి, పట్టు తప్పకుండా చేసే మన మెదడు సంకేతాలే నీ విజయానికి కారణాలు! మానవ భావోద్వేగాలలో భయం ఒకటి! ఇది నాడీ వ్యవస్థలో మనకు తెలియకుండానే “ప్రోగ్రామ్” చేయబడింది. ఇది ప్రవృత్తి వలె పనిచేస్తుంది!!  బాల్యం నుండి మనకు ప్రమాదం అనిపించినప్పుడు లేదా అసురక్షితంగా అనిపించినప్పుడు భయంతో స్పందించడానికి అవసరమైన మనుగడ ప్రవృత్తులు మెదడు పొరల్లో నిక్షిప్తం అయి ఉంటాయి!

Also Read: భావోద్రేకాల వేటలో మనిషి మస్తిష్కం ఆడే ‘ఆట’!

 భయం మనలను రక్షించడానికి సహాయపడుతుంది.  ఇది ప్రమాదం గురించి మనల్ని అప్రమత్తం చేస్తుంది, దానిని ఎదుర్కోవటానికి మమ్మల్ని సిద్ధం చేస్తుంది.  కొన్ని సందర్భాల్లో భయపడటం చాలా సహజమైనది! భయం ఒక హెచ్చరిక లాగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే సంకేతం!! అన్ని భావోద్వేగాల మాదిరిగానే, భయం కూడా మానవ మనుగడకే కాదు సమస్త జీవరాశికి దేవుడిచ్చిన వరం! మనకు ప్రమాదం అనిపించినప్పుడు, మెదడు తక్షణమే స్పందిస్తుంది, నాడీ వ్యవస్థను సక్రియం చేసే సంకేతాలను పంపుతుంది.  ఇది వేగంగా హృదయ స్పందన, శ్వాస తీసుకోవడం మరియు రక్తపోటు పెరుగుదల వంటి శారీరక ప్రతిస్పందనలకు కారణమవుతుంది.  శరీరాన్ని శారీరక చర్యలకు సిద్ధం చేయడానికి కండరాల సమూహాలకు రక్తం పంపుతుంది.  శరీరాన్ని చల్లగా ఉంచడానికి చర్మం చెమటలు, కడుపు, తల, ఛాతీ, కాళ్ళు లేదా చేతుల్లో సంచలనాలను వస్తాయి. ఇవే  భయం యొక్క ఈ శారీరక అనుభూతులు!

 ఈ ప్రతిస్పందనను “ఫైట్ లేదా ఫ్లైట్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది శరీరం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. ప్రమాదం నుండి పోరాడండి లేదా దూరంగా ఉండటానికి వేగంగా పరుగెత్తండి అని హెచ్చరిస్తుంది!! మెదడు “అన్ని స్పష్టమైన” సందేశాన్ని అందుకుని, ప్రతిస్పందనను ఆపివేసే వరకు శరీరం ఈ పోరాట…సన్నివేశాలతో ప్రాణులను అప్రమత్తం చేస్తుంది. వాస్తవానికి భయం ప్రమాదకరమైనది కానప్పటికీ, ఆశ్చర్యకరమైన విధంగా మనలో ప్రేరేపించబడుతుంది.  భయం ప్రతిచర్య తక్షణమే సక్రియం చేయబడినందున …మెదడు యొక్క ఆలోచనా భాగం కంటే కొన్ని సెకన్ల వేగంతో ఏమి జరుగుతుందో ప్రాసెస్ చేయవచ్చు!  ఎటువంటి ప్రమాదం లేదని గ్రహించడానికి మెదడుకు తగినంత సమాచారం వచ్చిన వెంటనే “ఓహో, ఇది కేవలం  భయం” అన్న మాట అని ఊపిరి పీల్చుకుంటారు!

 భయం అనేది ప్రమాదకరమైనదిగా అనిపించే మన భావోద్వేగ ప్రతిచర్యను వివరించడానికి ఉపయోగించే పదం.  కానీ “భయం” అనే పదాన్ని ఇతరులను భయపెట్టే ప్రక్రియ కూడా ఉంటుంది. ప్రజలు తమకు అసురక్షితమైన లేదా అస్పష్టంగా అనిపించే విషయాలు లేదా పరిస్థితులకు భయపడతారు.  ఉదాహరణకు, బలమైన ఈతగాడికి లోతైన నీటి భయం ఉండదు..అదే నీటిని చూసి భయపడే వారు కోకొల్లలు.  ఒక పెద్ద వాగు దాటాలంటే ఈ సందర్భంలో, భయం సహాయపడుతుంది! ఎందుకంటే ఇది వ్యక్తిని సురక్షితంగా ఉండమని హెచ్చరిస్తుంది. తనకు రక్షణ గా ఏదైనా పరికరం లేదా అండ దొరికినప్పుడే సురక్షితంగా వడ్డుకు చేరుతారు. ఈత  నేర్చుకోవడం ద్వారా ఎవరైనా కూడా ఈ భయాన్ని అధిగమించగలరు!

Also Read: ఆత్మ విశ్వాసమే మీ ఆయుధం!

 ఒక వ్యక్తి ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకోవద్దని చుట్టూ సురక్షితంగా ఉండమని హెచ్చరిస్తే భయం ఆరోగ్యంగా ఉంటుంది!  కానీ కొన్నిసార్లు భయం అనవసరం మరియు పరిస్థితి కోరిన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు కలిగిస్తుంది.  చాలా మందికి బహిరంగంగా మాట్లాడటానికి భయం ఉంటుంది.  ప్రజలు తమ గురించి తెలుసుకోవడానికి మరియు క్రమంగా వారు భయపడే విషయం లేదా పరిస్థితిని అలవాటు చేసుకోవడం ద్వారా అనవసరమైన భయాలను అధిగమించవచ్చు!! ఉదాహరణకు విమాన భయం సముద్ర ప్రయాణ భయం…ఇవీ అలవాటు అయితే భయం పటా పంచలు అవుతుంది. 

 బాల్యంలో భయాలు

 బాల్యంలో కొన్ని భయాలు సాధారణం.  ఎందుకంటే భయం అనేది ఖచ్చితంగా తెలియని మరియు హాని కలిగించే అనుభూతికి సహజమైన ప్రతిచర్య కావచ్చు!!  పిల్లలు అనుభవించే వాటిలో చాలా క్రొత్తవి మరియు తెలియనివి.  చిన్నపిల్లలకు తరచుగా చీకటి అంటే భయపడతారు, ఒంటరిగా ఉంటే, అపరిచితులు మరియు రాక్షసులు లేదా ఇతర భయానక  జీవులు వల్ల నీకు ప్రాణానికి ముప్పు ఉంటుంది… అని అమ్మా నాన్నా మనకు గోరు ముద్ద పెట్టినట్టు భయం ముద్ద కూడా పెడతారు. కొంతమంది పిల్లలు భయాలకు ఎక్కువ సున్నితంగా ఉంటారు వాటిని అధిగమించడానికి చాలా కష్ట పడతారు. కొన్నిసార్లు, ప్రజలు వారి భయాల గురించి ఆటపట్టిస్తారు. టీజింగ్ చేస్తున్న వ్యక్తి క్రూరంగా మరియు అన్యాయంగా ఉండాలని అర్ధం కాకపోయినా, టీజింగ్ చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది!

ఈ ఫోబియాస్‌కు కారణమేమిటి?

ఎవరైనా ఒక నిర్దిష్ట విషయం లేదా పరిస్థితులతో భయానక అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు కొన్ని భయాలు అభివృద్ధి చెందుతాయి.  “అమిగ్డాలా”  అని పిలువబడే ఒక చిన్న మెదడు నిర్మాణం బలమైన భావోద్వేగాలను ప్రేరేపించే అనుభవాలను అప్రమత్తం చేస్తుంది.  ఒక నిర్దిష్ట విషయం లేదా పరిస్థితి బలమైన భయం ప్రతిచర్యను ప్రేరేపించిన తర్వాత, అమిగ్డాలా వ్యక్తిని లేదా ఆమెను/ అతన్ని ఆ విషయం లేదా పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతిసారీ భయం ప్రతిచర్యను ప్రేరేపించడం ద్వారా హెచ్చరిస్తుంది. ఇక కుక్క భయం… నక్క భయం ఉన్నట్టే ప్రకృతి భయం ఉంటుంది.. భారీ వర్షంతో వెళుతుంటే పిడుగు భయం, ఉరుము భయం, మెరుపు భయం ఉంటుంది. ఒక మానవ కోణంలో ప్రాణ భయం ఎక్కువ భయపెట్టిస్తుంది. ఒంటరిగా స్మశాన వాటికకు వెళ్ళరు! అలాగే పాముల భయం, తేళ్ల భయం ఇలా మనిషిని అప్రమత్తం చేసే ఈ ప్రక్రియ వల్లే ఇంకా ప్రాణాలు నిలుస్తున్నాయి! ఈ మధ్య ‘కరోన” భయం కూడా మనిషి జాగ్రత్తకు వేదిక అయింది. ఇలా సున్నితమైనవే అయినా అక్రమ సంబంధాలు, చాటు మాటు సరసాలు, సోషల్ మీడియా చాట్లు, ప్రేమలు ఒక్కటేమిటీ ప్రతి నిమిషం మనిషికి ఈ భయం ఉండడం వల్లే ఈ పోలీసు వ్యవస్థ భయభక్తుల్లో ప్రజలు ఉంటున్నారు. ఇక కుటుంబంలో “పెళ్ళాం’ భయం 80 శాతం ఉంటుందట! ఇదీ భారతీయుల్లో ఎక్కువ!  సమయానికి ఇంటికి రావడం, తాగిన మైకం దిగే వరకు బయట ఉండడం. ఇంటికి జీతం డబ్బులు ఇవ్వడం, ఇలా భార్య భయం ఉండడం వల్లే సంసారాలు సాఫీగా సాగుతున్నాయి! ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే .గొప్ప మేధావులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు ఎక్కువగా భయపేడేది భార్యకే నంట.

Also Read: మానవ జీవితమే ఒక సముద్ర ఘోష!

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles