రామాయణమ్ – 55
‘‘రామా! భరతుడు చెప్పినట్లుగా నీవు అంగీకరించు. అది ధర్మవిరుద్ధము కానేరదు. జనులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు’’ అని వశిష్ఠమహర్షి పలుకగా, ఆయనతో వినయంగా రాముడిలా అన్నాడు.
‘‘ఆచార్యా, పిల్లలు పుట్టినప్పటి నుండీ తల్లిదండ్రులు వారి ఆలనాపాలనా చూస్తూ సమయానికి స్నానపానాదులు చేయిస్తూ, వేళకు నిద్రపుచ్చుతూ వారికి సకలోపచారాలూ చేస్తారు. అలా సేవచేసిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా? నాకు జన్మనిచ్చిన తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ వృధాగా పోనీయను’’ అని స్థిరగంభీరంగా పలికాడు రామచంద్రుడు.
Also read: జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు
భరతుడికి కన్నీరు ఆగటంలేదు. అది వరదగోదావరి అయ్యింది. సుమంత్రుని పిలిచి ‘‘ఇక్కడ నేలపై దర్భలు పరిపించు, అన్నగారు ప్రసన్నుడయ్యేంతవరకు నేను ఆయన ఎదురుగా ఆయనను అడ్డగించి కదలనీయను. ఇక్కడే పడుకొంటాను,’’అని పలికి సుమంత్రుడు రాముని వైపు చూస్తూ ఉండటం గమనించి తానే స్వయంగా దర్భలు తెచ్చుకొని నేలపై పరుచుకొన్నాడు.
అప్పుతీసుకొని ఎగగొట్టిన వాడి ఇంటిముందు ఏ విధంగా హఠంచేస్తూ అడ్డంగా పడుకొంటారో ఆ విధంగా పడుకున్నాడు భరతుడు.
Also read: తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు
‘‘భరతా, నేనేమి నేరం చేశానని ఇలా అడ్డంగా పడుకున్నావు. అయినా ఇలా అడ్డంగా పడుకొనుటకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంది. క్షత్రియులకు లేదు. లేవయ్యా, లే’’ అని పలికాడు.
అప్పుడు భరతుడు చుట్టూ చేరిన ప్రజలకు నమస్కరించి అందరినీ ఉద్దేశించి ‘‘నేనింతగా ప్రాధేయపడుతున్నా మీరెవ్వరూ ఉలకరూ పలుకరేమి?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ పౌరజానపదులంతా ముక్తకంఠంతో ‘‘రాముడి గూర్చి మాకు బాగా తెలుసు. ఆయన యుక్తమైనవే మాట్లాడతాడు. తండ్రిమాట పాలించాలనే ఉదాత్తమైన ఆశయమున్న రాముని మేము ఏ విధంగా మరలించగలం?’’ అని అన్నారు.
వారి మాటలు విన్న రాముడు, ‘‘భరతా! విన్నావుగా అందరి అభిప్రాయము. లే. లేచి నన్నూ, జలాన్ని తాకు’’ అని అన్నాడు.
Also read: భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు
(ఎందుకు ఆయనను స్పృశించి జలాన్ని తాకాలి? ఏదైనా చిన్న దోషము సంభవించినప్పుడు మనకన్నా పెద్దవారిని తాకి ఆచమనం చేస్తే ఆ దోషం పోతుంది.
అక్కడ సాక్షాత్తు తమ గురువుగారుండగా వారిని కాదని తననెందుకు తాకమన్నాడు? అంటే ఇంకెప్పుడూ హఠం చేయక నా మీద ఒట్టుపెట్టుకో అని అర్ధమేమో!)
రాముడి మాటలు విన్న భరతుడు లేచి ఆచమనంచేసి ఎదురుగా ఉన్న మంత్రులు, పౌరులూ, జానపదులూ, విద్వాంసులతో ఇలా అన్నాడు.
‘‘నేనెన్నడూ రాజ్యము ఇమ్మని నా తండ్రిని అడుగలేదు. అందుకోసము నా తల్లిని ప్రేరేపించనూ లేదు. రాముడి అరణ్యవాసాన్ని నేను ఎప్పుడూ సమర్ధించలేదు. తండ్రిగారి మాట ప్రకారము అరణ్యములో పదునాలుగేండ్లు నివసించటానికి నేను సిద్ధం.’’
Also read: రాముడి పాదాల చెంతకు చేరిన భరతుడు
భరతుడి ఈ సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోతూ రాముడు ఈ విధముగా పలికాడు ‘‘నా తండ్రియుండగా జరుపబడిన లావాదేవీలను మార్చుటకు నాకు గానీ భరతునకు గానీ అధికారములేదు. మాత కైకేయి రాజ్యము తన కుమారునకు కట్టబెట్టమని నా తండ్రిని కోరటంలో ఇసుమంతైనా దోషములేదు. వివాహ సమయములో ఆవిడ తండ్రికి మా తండ్రిగారు ఆవిధముగానే కదా వాగ్దానము చేసి యున్నది. ఆ వాగ్దానము నిలుపుకొనుటకు మా తండ్రిగారు భరతునకు రాజ్యమిచ్చుట యుక్తమైనటువంటిదే! రణభూమిలో నా తండ్రికి సహాయము చేసినందులకు గాను మాత కైకకు ఒసగిన వరము ఆవిడ ఇప్పుడు నా తండ్రిని నెరవేర్చమన్నది. దాని ప్రకారము నాకు అరణ్యవాసము విధించుట ఒక మహారాజుగా ఆయనకు గల అధికారమునకు సంబంధించినది. అదియు గాక తండ్రి ఆజ్ఞ పుత్రునకు శిరోధార్యము. అదియే ధర్మము. కావున నా అరణ్య వాసము, భరతుడి పట్టాభిషేకము విషయములో మాత కైక, మరియు తండ్రిగారు చేసిన పని యుక్తమే!
‘‘భరతుడు ఓర్పుగలవాడు. పెద్దలను పూజించు వాడు. సత్యసంధుడు. మహాత్ముడు అని నాకు తెలియును .అతనికి మంగళమగుగాక. అంతేగాక వనవాస విషయములో నా బదులుగా భరతుని పంపుట అత్యంత జుగుప్సాకరమైన విషయము. నేను వనవాసము చేయకుండుట వలన నా తండ్రికి అసత్యదోషము కలుగుతుంది. నా తండ్రికి ఆ అపవాదు ఎన్నటికీ కలుగకుండుగాక! నేను వనమునుండి తిరిగి వచ్చి భరతునితో కూడి పరిపాలనము చేయగలవాడను’’ అని ప్రజలందరితో పలికాడు శ్రీరాముడు.
రామభరతుల ఈ అన్యోన్యమైన ప్రేమ, వారి ధర్మనిష్ఠ అక్కడ చేరినవారందరి మదిలో ఆశ్చర్యం కలుగచేసింది.
ఆహా ధర్మమూర్తులైన వీరిని కన్న ఆ దశరథుడు ధన్యుడు కదా!
Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన
వూటుకూరు జానకిరామారావు