వోలేటి దివాకర్
మనం సెల్ ఫోన్ ద్వారా వేరే వాళ్ళకు డబ్బు పంపినట్లు గానే అగ్నిహోత్రం ద్వారా పితృదేవతలకు మనం ఆహారం అందించవచ్చునని నిత్య సంస్కృత భాషి, కొవ్వూరు సంస్కృత కళాశాల నిర్వాహకులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకరశర్మ పేర్కొన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో ధార్మిక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. ఇహ పర లోకాల్లో ఉన్నవారికి కూడా ముక్తినిచ్చేది వేదమేనని, కర్తవ్యాన్ని నిర్దేశించేది వేదమేనని ప్రభాకర శర్మ వక్కాణించారు.
ఈ ధార్మిక సమావేశంలో ఆయన ప్రవచనం ఈవిధంగా సాగింది: ధర్మం తప్పకుండా ఆచరించాల్షింది. ఆ ధర్మాన్ని తెలిసినవారి నుండి తెలుసుకోవాలి. తనకు తోచిందే ధర్మం కాదు. ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మనం ధర్మాన్ని రక్షిస్తేనే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. వేదము చెప్పిందే ధర్మము. వేదము అందరికీ అందుబాటులోకి తేవడానికే ఇతిహాస ములు. లోకాల్లో ఉన్నవారికి కూడా ముక్తి నిచ్చి వేదం. మన కర్తవ్యాన్ని నిర్దేశించేది వేదమే.
ప్రయోజనాలు మూడు రకాలు
దృష్ట, అదృష్ట, దృష్టా దృష్ట ప్రయోజనం. అన్నం తింటే కడుపు నిండుతుంది. ఇది దృష్ట ప్రయోజనం. అన్నం దేవుడికి నివేదన చేసి తింటున్నాం. అది అదృష్ట ప్రయోజనం. వేదము ఏది చెప్పిందో అది చేయడం దృష్టా దృష్ట ప్రయోజనం. వేదాన్ని నమ్మక పోతే మనం నష్టపోతాం. వేదానికి నష్టం ఏముంది? దేవుడి గుళ్లో పళ్ళు ఇస్తున్నాం. తిరిగి పూజారి ప్రసాదంగా ఇస్తే కళ్ళకి అద్దుకుటున్నాం. అదే శక్తి.
అతివృష్టి, అనావృష్టి నివారణకు వేదానుష్ఠానమే కర్తవ్యం.