- కాశీక్షేత్రానికి తోడుగా అయోధ్యలో రామమందిరం
- అడ్వాణీ రథయాత్ర వేసిన పునాదిపైనే భవ్యాలయం
అయోధ్య రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దేవాలయ నిర్మాణ పురోగతిపై ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ‘ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాటల ప్రకారం డిసెంబర్ 2023 నుంచి భక్తుల దర్శనానికి ద్వారాలు తెరుచుకుంటాయని అర్థమవుతోంది. కరోనా కాలంలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2020 ఆగస్టు 5 వ తేదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ చేసిన తర్వాత పనులు ఊపందుకున్నాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే మహాద్భుతంగా నిలిచిపోయే కట్టడంగా నిర్మాణం సాగుతోంది. కనీసం 1000 ఏళ్ళ వరకూ పటిష్ఠంగా నిలిచేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయ కోణాలు అటుంచగా, నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన చారిత్రాత్మక సందర్భం అయోధ్య నిర్మాణానికి అడుగులు పడడం.
Also read:ఆజాద్ నిష్క్రమణ
రామభక్తుల స్వప్నసాకారం
ఏళ్ళ తరబడి కోర్టు కేసుల మధ్య నలిగిపోయిన ఈ అంశం ఎట్టకేలకు శుభాంతమైంది. కోట్లాది రామభక్తుల వందల ఏళ్ళ స్వప్న సాకారానికి గొప్ప ప్రాకారం ఏర్పడింది. బిజెపి ప్రభుత్వానికి గొప్ప శక్తి చేకూరింది. అడ్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి బిజెపి అగ్రనేతలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడమే కాక, మహాసంకల్పాన్ని తమ జీవితకాలంలోనే సిద్ధింపజేసుకున్న గొప్ప ఆత్మతృప్తి, ఆత్మానందం పొందగలిగారు. ఎల్ కె అడ్వానీకి 95 ఏళ్ళు దాటినా ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు. 2023 డిసెంబర్ లో ఆలయం సర్వంసిద్ధం కానుంది. ఆయన ఈ మహోత్సవాన్ని కనులారా తిలకిస్తారని విశ్వసిద్దాం. ఈ రోజు బిజెపి ఏకఛత్రాధిపత్యంతో ఏలుబడిలో ఉందంటే ‘రథయాత్ర’ వేసిన పునాదులే. ఈ రథాన్ని అన్నీ తానై నడిపించినవారు అడ్వానీ అన్న విషయం జగద్వితం. మిగిలిన వారంతా ఆయన వెంట నడచారు. మనుషుల జీవితాలు ఆశాశ్వతం. సుస్థిరంగా మిగిలిపోయేది ఇటువంటి మహానిర్మాణాలు, పాలకులు, నాయకులు చేసిన మంచిపనులే. అయోధ్య రామమందిర నిర్మాణంతో ప్రధాన భాగస్వామ్యులందరూ చరిత్రలో నిలిచిపోతారు. రాళ్లెత్తిన కూలీలుఆ బండల మాటున మిగిలిపోతారు. 2024 లో సార్వత్రిక ఎన్నికల సమయానికి అయోధ్య రామమందిరం కళకళలాడుతూ ఉంటుందని భావించవచ్చు. బిజెపికి ఎన్నికల్లో ఈ అంశం ఏదో ఒక స్థాయిలో తప్పక లాభిస్తుందని అంచనా వేయవచ్చు. మన దేశంలో వేల సంవత్సరాల నాటి దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అదే స్ఫూర్తితో ఈ ఆలయం కూడా నిర్మాణం జరుగుతోంది. దేవాలయ నిర్మాణం వేగిరమవ్వడం కోసం అడ్డుగా వున్న కూల్చివేతలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణానికి కావాల్సిన నిధుల కొరత లేకపోవడంతో ఆర్ధిక ప్రతిబంధకాలు కూడా లేవు. కోట్లాది రూపాయల విరాళాలు వచ్చి పడిపోయాయి. ఈ నిర్మాణం పూర్తయితే అయోధ్య చుట్టుప్రక్కల ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయి. భారతదేశ ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి, ఆదాయంలో అయోధ్య రామమందిరం తలమానికం కానుంది. దక్షిణాదిలో తిరుమల వలె ఉత్తరాదిలో అయోధ్య గొప్పగా విరాజిల్లే శకునాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విలక్షణంగా అగ్రపీఠాన నిలబెడుతున్నవి మన సంస్కృతి, ఆచారవ్యవహారాలు,ఆధ్యాత్మికత. సామాజిక శాంతికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇవన్నీ దివ్య ఔషధాల్లా పనిచేస్తాయన్నది పెద్దలమాట. ఈ ప్రగతి ప్రస్థానానికి ఇటువంటి కేంద్రాలు రథచక్రాలుగా ముందుకు నడిపిస్తాయి.
Also read: సమర్థుని జీవయాత్ర!
సర్వమత సహనం
భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు. సర్వమత సహనాన్ని పాటించడం, అన్ని మతాలను గౌరవించడం ఎంత ముఖ్యమో మెజారిటీ ప్రజలకు సంబంధించిన హిందుత్వాన్ని కాపాడడం, ధార్మిక వ్యవస్థను పటిష్ఠపరచడం, వైదిక ధర్మాన్ని నిలబెట్టడం అంతే కీలకం. శ్రీరాముడి నుంచి శ్రీకృష్ణదేవరాయలు వరకూ వారి పరిపాలనా కాలంలో చేసిందదే. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, ఐకమత్యాన్ని నిలబెట్టుకుంటూ సాగడం పాలకులకు ఏ యుగంలోనైనా మౌలికమైన బాధ్యత. అయోధ్య రామమందిర నిర్మాణం ద్వారా ఆ యా ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇది ఉత్తరప్రదేశ్ వారితో పాటు మిగిలినవారికి కూడా ప్రయోజనకారిగా మిగులుతుంది. మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలో మత సహనాన్ని పాటిస్తూ శాంతిని స్థాపించడం కీలకం. దేశ రాజధాని పీఠాన్ని ఎవరు అధిరోహించాలన్నా, దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగివున్న ఉత్తరప్రదేశ్ లో అధిక మెజారిటీ తెచ్చుకోవడం కీలకం. దేశంలో గొప్ప పౌరాణిక, చారిత్రక నేపథ్యం వున్న వారణాసి అక్కడే ఉంది. ఇప్పుడు అయోధ్య మందిరం జత కలవనుంది. వారణాసి లోక్ సభ స్థానానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే పార్టీకి చెందియుండి, భావి ప్రధాని అభ్యర్థిగా కొందరు చెప్పుకొనే యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిరువురూ అక్కడ వేసే ప్రతి అడుగూ పెద్ద ప్రభావం చూపిస్తుంది. అయోధ్య రామమందిరం సిద్ధమవుతున్న వేళ పాలనలో అప్రమత్తం అవసరం. నాయకుల గెలుపుకు అదే గీటురాయి.
Also read: మరో మహా కర్షక పంచాయతీ!