నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 26వ తేదీన భారత్ బంద్ కు దేశ పౌరులంతా సంఘీభావం తెలపాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైలు, బస్సు సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. దేశ వ్యాప్తంగా దుకాణాలు స్వచ్చందంగా మూసివేయాలని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. షాపు యజమానులపై ఎలాంటి ఒత్తిడి చేయమని బంద్ పై స్వచ్చందంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
భారత్ బంద్‌కు వైసీపీ మద్దతు:
భారత్ బంద్‌కు రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘీభావం తెలిపింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంయమనం పాటించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 26న ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అయితే బంద్ సందర్భంగా అత్యవసర ఆరోగ్య సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. భారత్ బంద్‌కు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి.
Also Read: బీజేపీ ఓటమే లక్ష్యం
బంద్ కు కాంగ్రెస్ మద్దతు:
భారత్ బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు:
భారత్ బంద్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. సరిహద్దుల్లో బారీకేడ్లను మోహరించారు.
Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం