దిల్లీ: శనివారంనాడు, డిసెంబర్11వ తేదీ నాడు, తమ 15 మాసాల నిరసన దీక్షను విరమించబోతున్నామని రైతులు ప్రకటించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (రద్దు అయినాయి), కనీస మద్దతు ధరకు రాజ్యాంగపరమైన హామీ ఇవ్వాలని కోరుతూ రైతులు దిల్లీ-హరియాణా సరిహద్దు వద్ద నిరసన దీక్ష పదిహేను మాసాల కిందట ప్రారంభించారు. సంవత్సరంలో అన్ని రుతువులలోనూ వారు ఆరుబయట ఉండి దీక్షను కొనసాగించారు.
గురువారం సాయంత్ర ఫతే అర్దాస్ (విజయ ప్రార్థన) చేశారు. డిసెంబర్ 11వ తేదీ నాడు తొమ్మిది గంటలకు సింఘు, టిర్కీ నిరసన ప్రదేశాల నుంచి ఫతే మార్చి్ (విజయ ప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 13న స్వర్ణాలయంలో పూజలు నిర్వహించాలని పంజాబ్ రైతులు అనుకుంటున్నారు. దిల్లీ డిసెంబర్ 15న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కెఎం) ఒక సభ నిర్వహిస్తుంది. ఆరు డిమాండ్లను పేర్కొంటూ ఎస్ కెఎం ప్రధానికి నవంబర్ 21న ఒక లేఖ పంపింది. ఆ లేఖకు సమాధాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ఎస్ కెఎంకి పంపింది. తాము లేవనెత్తిన అంశాలలో మూడు చట్టాల రద్దు ఒక అంశం మాత్రమేనని, మిగిలిన డిమాండ్లకు కూడా అంగీకరించాలని రైతు సంఘం ప్రధాని నరేంద్రమోదీకి గుర్తు చేసింది. ఎంఎస్ పీ సమస్యపైన ఒక నిర్ణయానికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించేందుకు అంగీకరించింది. రైతులపైన పెట్టిన అన్ని పోలీసు కేసులనూ ఉపసంహరించుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించవలసిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరింది. ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. పంజాబ్ ప్రభుత్వ ఇప్పటికే పరిహారంపైన ప్రకటన చేసింది. విద్యుత్ చట్టంలో రైతులకు సంబంధించిన అంశాలను మార్చే విషయంలో రైతు సమాఖ్యను సంప్రతించిన మీదట ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు. కేంద్రం ప్రతిపాదనను పరిశీలించే నిమిత్తం మంగళవారంనాడు ఎస్ కెఎం సమావేశం సింఘూ సరిహద్దు వద్ద సుదీర్ఘంగా జరిగింది.