- తెలంగాణలో రాహుల్ రెండు రోజుల పర్యటన
- వరంగల్‌లో రైతు సభ, హైదరాబాద్‌లో వివిధ వర్గాలతో బేటీ
- తెలంగాణలో 40 లక్షల మంది కాంగ్రెస్ సభ్యులకు ప్రమాద బీమా
ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. మే 6, 7 తేదీలలో తెలంగాణకు రాహుల్ గాంధీ విచ్చేయనున్నారు. తెలంగాణలో వ్యవసాయం, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. శనివారం నాడు గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షుల సమావేశంలో ప్రధానంగా రాహుల్ గాంధీ సమావేశానికి సంబంధించిన చర్చ జరిపారు. మే 6వ తేదీన వరంగల్‌లో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో రైతు సంఘర్షణ సభ జరపాలని, 7వ తేదీన హైదరాబాద్‌లో వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ అయి పలు అంశాలపై చర్చించే విధంగా రాహుల్ గాంధీ పర్యటనను రూపొందించారు. సుమారు 5 లక్షల మందితో సభ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ఉంటుందని, అంతకుముందు 4 నుంచి 6 గంటల వరకు వరంగల్ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇకపోతే పార్టీ 40 లక్షల డిజిటల్ మెంబర్‌షిప్ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది.
ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ భీమా కంపెనీతో ఒప్పందం చేసుకొని భీమా సొమ్ము చెల్లించిన నేపథ్యంలో సభ్యత్వం పొందిన వారు బీమా పొందడం ఎలా అంశంపై ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ నాయకులు పవన్ మల్లాది బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్‌మల్లాది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ముఖ్య నాయకులకు బీమా అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించారు. ప్రమాధం జరిగిన సమయంలో ఎలాంటి సర్టిఫికెట్లు అందించాలి, ఏ మేరకు ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం కానీ, సంఘటన కానీ జరిగినపుడు బీమా సొమ్ము పొందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల వివరిస్తూ ముఖ్య నాయకులకు, డిసిసి అధ్యక్షులకు సమాచారం ఇచ్చారు.
అలాగే టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంచార్జి మణిక్కమ్ ఠాగూర్‌లు రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయ, రైతు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 6, 7 తేదీలలో రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వివరించారు. సమావేశంలో ఎం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సి.ఎల్.పి నేత జానారెడ్డి, ఎమ్మేల్యేలు శ్రీదర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, మహెశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహా, ఎఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎం.పి వి.హెచ్, మాజీ కేంద్ర మంత్రులు రేణుక చౌదరి, బలరామ్ నాయక్, సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.