హస్తినలో రైతుల ఆందోళనలు 31వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సింగు టక్రి ఘాజిపూర్ చిల్లా సరిహద్దుల వద్ద వేల సంఖ్యలో రైతులు బైఠాయించారు. వీరికి మద్దతుగా టిక్రి వద్ద మహిళా రైతులు దీక్ష చేపట్టారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు టో ల్ రుసుములు చెల్లింపు నిరాకరించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
రైతుల దీక్షలతో రాజకీయ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. రైతు చట్టాలపై చర్చకు రావాలని రాహుల్ గాంధీ, డీఎంకే అధినేత స్టాలిన్ లకు ప్రకాష్ జవదేకర్ సవాలు విసిరారు. మరోవైపు చర్చలకు రావాలని ప్రభుత్వం పిలవడంతో తదుపరి కార్యాచరణకు రైతు సంఘాలు భేటీ అయ్యాయి. ప్రభుత్వం రైతు సంఘాలమధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు
అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు
రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. రైతుల ఉద్యమాలను మోడీ అణిచివేస్తున్నారని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు రైతుల సమస్యలను పెద్దవిగా చేసి చూపుతున్నాయని ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మోడీ విమర్శించారు.
మైక్ పాంపియోకి లేఖ
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నెలరోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలపై జోక్యం చేసుకోవాలని అగ్రరాజ్యం అమెరికాను భారతీయ అమెరికన్ చట్ట సభ్యుల బృందం మైక్ పాంపియోకి లేఖ రాసింది. బృందంలో అమెరికన్ కాంగ్రెస్ మహిల పరిమళ జైపాల్ తో పాటు ఏడుగురు చట్ట సభ్యులు ఉన్నారు.
ఇదీ చదవండి: రైతు ఉద్యమంపై ఎవరి మాట వారిది