• ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది ట్రాక్టర్లు
• సింఘూ సరిహద్దుల్లో ఉద్రిక్తత
• టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. ఓవైపు దేశమంతా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంటే రైతులందరూ విపరీతమైన చలిని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో ఆందోళన చేపడుతున్నారు. రాజ్ పథ్ లో గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ నిర్వహిస్తుంటే మరోవైపు రైతులంతా కిసాన్ పరేడ్ కు సిద్ధమయ్యారు. ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతమైన టిక్రీ నుంచి వేలాది రైతులు తమ ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను సింఘూ సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది చదవండి: మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు
మరోవైపు కిసాన్ పరేడ్ లో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాలనుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ చేరుకున్నారు. ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ పోలీసులు 5 వేల ట్రాక్టర్లు, 5 వేల మంది రైతులకు మాత్రమే అనుమతినిస్తున్నట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న భారీ కవాతు లో పాల్లొనేందుకు పంజాబ్, హర్యానాతోపాటు ఉత్తరప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు . రాజ్ పథలో గణతంత్ర వేడుకలు ముగియగానే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లోని దీక్షా శిబిరాల వద్ద నుంచి శకటాలు, ట్రాక్టర్లు ప్రదర్శనగా బయలుదేరనున్నాయి. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇది చదవండి: రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు
మరోవైపు ఢిల్లీలో రైతులకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు మహారాష్ట్రలోని 21 జిల్లాలనుంచి దాదాపు 6 వేలమంది రైతులు ఆజాద్ మైదానానికి చేరుకున్నారు.