దిల్లీ : యుద్ధరంగంలో ప్రదర్శించిన సాహసాన్ని ప్రశంసిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పతకాలను వాపసు ఇచ్చివేయాలని మాజీ సైనికులు ప్రయత్నిస్తున్నారు. సింఘు సరిహద్దు దగ్గర మకాం వేసిన మాజీ సైనికాధికారులు నవంబర్ 26 నుంచి సుమారు 5,000 పతకాలను జమ చేశారు. సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వ్యవసాయమే బతుకుతెరువుగా పంజాబ్, హరియాణలో స్థిరపడిన మాజీ జవాన్లు మూడు చట్టాలనూ రద్దు చేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్ ను సాధించుకోవడానికి గ్యాలెంట్రీ మెడల్స్ ను వాపసు చేసే ఉద్యమం ఆరంభించారు. వచ్చే రెండు రోజులలో 25,000 పతకాలను సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు మాజీ సైనికాధికారులు తెలియజేశారు. నిరసనకారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమకు కష్టం కలిగిస్తున్నదని మాజీ సైనికోద్యోగులు అన్నారు.
జీవితాలను త్యాగం చేస్తున్నరైతులు : రాహుల్
‘‘వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి రైతు సోదరులు ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలి?’’ అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కడచిన 18 రోజులలో మరణించిన 11 మంది రైతుల ఫోటోలను రాహుల్ చూపించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రతి వ్యక్తినీ మావోయిస్టుగానో, దేశద్రోహిగానో చిత్రించడానికి కేంద్ర మంత్రలు ప్రయత్నించడాన్ని రాహుల్ నిరసించారు. కొన్ని వామపక్ష శక్తులూ, మావోయిస్టులూ రైతు ఉద్యమం పట్టు సాధించాయంటూ రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ ఒక విలేఖరుల గోష్ఠిలో వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతున్నారు. ఉద్యమిస్తున్న రైతులను నిందించడం బాధ కలిగిస్తున్నదని పంజాబ్ కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాజ్వా అన్నారు.
కొత్త చట్టాలు భూస్వాములను తయారు చేస్తాయి : మేధా పాట్కర్
శనివారంనాడు ఎముకలు కొరికే చలినీ, వణుకుపుట్టించే వానను లెక్కచేయకుండా ప్రదర్శనలు సాగిస్తున్న రైతులను ఉద్దేశించి సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, రైతు నాయకుడూ, భారతీయ కిసాన్ యూనియన్ అధినాయకుడూ రాకేశ్ తికాయత్ లు ప్రసంగించారు. వ్యవసాయాన్ని కార్పెరేటీకరించడం ఒక్కటే మూడు వ్యవసాయ చట్టాల వెనుక ఉన్నఅంతరార్థమని మేధా పాట్కర్ వ్యాఖ్యానించారు. ‘‘ ఈ చట్టాలు కార్పొరేట్ రంగం ఏజెంట్లకు మినహాయింపులూ, వెసులుబాట్లూ కల్పిస్తాయి. కొత్త భూస్వాములను సృష్టిస్తాయి,’’ అని ఆమె అన్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో దళారులు ఉన్నారు కానీ వారిపైన అదుపు ఉన్నది. మూడు చట్టాలు తెచ్చే వ్యవస్థలో అంతా కార్పొరేట్ సంస్థల పెత్తనమే ఉంటుంది’’ అని చెప్పారు.
ఒక చేత్తో జెండా, ఒక చేత్తో దండా
రైతులు ఒక చేత్తో జెండానూ, మరొక చేతితో దండానూ (కర్రనూ) పట్టుకోవడం అవసరమని రాకేశ్ తికాయత్ వ్యాఖ్యానించారు. ‘‘1996లో ఎంఎస్ పీ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు మూడు క్వింటాల్ గోధుమలు విక్రయించిన రైతు పది గ్రామలు బంగారం కొనుక్కోగలిగాడు. ఇప్పుడు కూడా అది సాధ్యమయ్యేట్టు చేయండి. మేము ఇళ్లకు వెళ్ళిపోతాం,’’ అని తికాయత్ అన్నారు. ‘‘విస్తృతమైన ప్రయోజనం కోసం మేమంతా ఒకే జెండా కింద ఉద్యమిస్తున్నాం, ’’ అని అఖిలభారత కిసాన్ సభ బులంద్ షహర్ విభాగం నాయకుడు మేఘ్ రాజ్ సోలంకీ అన్నారు.