Sunday, December 22, 2024

రైతుల ఆందోళన సొంత విషయమంటున్న క్రికెటర్లు

విదేశీశక్తుల జోక్యంపై క్రికెట్ హీరోల గరంగరం

సచిన్,విరాట్,రోహిత్, కుంబ్లే, రవి,రహానే స్పందన

సాగు చట్టాల రద్దుకోసం గత రెండుమాసాలుగా రైతులు చేపట్టిన ఆందోళన విషయంలో విదేశీశక్తుల జోక్యాన్ని సహించేది లేదని భారత క్రికెట్ దిగ్గజాలు, స్టార్లు స్పష్టం చేశారు. భారత అంతర్గత విషయాలలో జోక్యం చేసుకొనే హక్కు విదేశీయులకు లేదని, ఈ విషయంలో తమ మద్దతు భారత్ కు మాత్రమే ఉంటుందని సచిన్ ,కొహ్లీ, రవి శాస్త్రి, అనీల్ కుంబ్లే వేర్వేరు ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మీరు ప్రేక్షకులు మాత్రమే- సచిన్

భారత రైతులు చేపట్టిన ఆందోళనకు తమ మద్దతు ఉంటుందంటూ గ‌్లోబ‌ల్ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, అమెరికా గాయని రిహానతోపాటు మియా ఖ‌లీఫాల ట్వీట్ల‌పై భారత క్రికెట్ దేవుడు మాస్ట‌ర్ స‌చిన్ టెండుల్కర్ ఘాటుగా స్పందించారు. భారతీయుల మద్దతు భారతీయులకు మాత్రమే ఉంటుందని, భారత్ లో జరుగుతున్న విషయాలతో విదేశీయులకు సంబంధం ఏంటని సచిన్ తన ట్వి్ట్ ద్వారా నిలదీశారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న సాగిస్తున్న రైతుల‌కు మ‌ద్ద‌తుగా రిహానా, గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ త‌దిత‌ర విదేశీ ప్ర‌ముఖుల ట్వీట్ల‌ను సచిన్ ఖండించారు. దేశ సార్వ‌భౌమ‌త్వం విషయంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని, భారతీయులంతా ఒక్క‌టే కావాల‌ని అభ్య‌ర్థించారు. భారత్ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకొంటున్న విదేశీయులు కేవ‌లం ప్రేక్ష‌కులే కానీ భాగ‌స్వాములు కాదని, తమ కోసం ఏం చేసుకోవాలో భార‌తీయుల‌కు తెలుసంటూ స‌చిన్ ట్వీట్ చేశారు.

రైతులూ ఈ దేశం పౌరులే- విరాట్

రైతులు ఆందోళనకు దిగిన ఈ క్లిష్టతరుణంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని, ఆందోళన వద్దని, శాంతి,సౌఖ్యాలే ప్రధానమని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ట్విట్ ద్వారా అభ్యర్థించాడు.

చర్చలతోనే పరిష్కారం- రహానే

రైతుల ఆందోళన భారత్ కు పరీక్షాసమయమని, ఇలాంటి తరుణంలో అందరూ ఐక్యంగా ఉండి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, చర్చలతో సమసిపోని సమస్యలంటూ ఏవీ ఉండవని భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ట్విట్ ద్వారా కోరాడు.

ఐకమత్యమే భారత్ బలం- రోహిత్ శర్మ

భారత దేశ ప్రగతిలో రైతులపాత్ర మరువరానిదని, కలసి కట్టుగానే సమస్యలు పరిష్కరించుకోగలమని భారత వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా తనమనసులో మాట బయటపెట్టాడు. రైతుల ఆందోళన కు సమష్టిగా పని చేయడం ద్వారా పరిష్కారం కనుగొనాలని రోహిత్ సూచించాడు.

భారత్ కు రైతులే వెన్నెముక- రవిశాస్త్రి

వ్యవసాయరంగం లేకపోతే భారత్ లేదని, మనదేశానికి రైతన్నలే వెన్నెముకని..రైతుల సమస్యలను పరిష్కరించుకొనే శక్తి భారత్ కు ఉందని, విదేశీశక్తుల జోక్యం అనవసరమని భారత ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి ట్విట్టర్ ద్వారా తేల్చి చెప్పాడు. పరస్పర గౌరవం, అవగాహనతో చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని తెలిపాడు.

కుంబ్లే ఘాటైన స్పందన

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ కు అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే తెగువ, సత్తా ఉన్నాయని, విదేశీయుల జోక్యం అవసరమే లేదని, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చునని భారత మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనీల్ కుంబ్లే ట్విట్ ద్వారా చెప్పాడు.

గౌతం గంభీర్ గరం గరం

భారత మాజీ ఓపెనర్, లోక్ సభలో బీజేపీ సభ్యుడు గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. భారత్ ను వెలుపలి శక్తులు విడ‌దీయాల‌ని శ‌తాబ్దాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని, కానీ తమకు ఏంకావాలో భార‌తీయుల‌కు తెలుసునని, విదేశీశక్తులు లక్షల కోట్లు ఖ‌ర్చు చేసినా, ఎంత ప్ర‌య‌త్నించినా.. ఇది నవ్య భార‌త్ అంటూ ట్విట్ చేశారు. మొత్తం మీద రైతుల ఆందోళనలో విదేశీశక్తుల జోక్యం పై క్రికెట్ దిగ్గజాలు తొలిసారిగా గళం విప్పి తమ ఉనికిని చాటుకోగలిగారు. ప్రభుత్వానికి దన్నుగా నిలువగలిగారు.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్షాల నిరసన

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles