Tuesday, January 21, 2025

అన్నదాత ఆగ్రహించి వందరోజులు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపట్టిన మహోద్యమానికి వంద రోజులు పూర్తయ్యాయి. ఉద్యమం విజయవంతమైనా, ఆశయం ఫలవంతమవ్వలేదు. ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే, సుఖాంతమయ్యే సూచనలు ప్రస్తుతానికి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్ని వందల రోజులైనా, అనుకున్నది సాధించేంత వరకూ మడమ తిప్పేది లేదని రైతు నేతలు తెగేసి చెబుతున్నారు. వంద రోజులు పూర్తయిన సందర్భంగా, ఇళ్ళు, కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన ప్రదర్శన చేయాలని వివిధ సంఘాలను రైతు సంఘం కోరింది. సంఘీభావం ప్రకటించేందుకు ఎందరో సిద్ధంగానూ ఉన్నారు.

మహిళా కిసాన్ దివస్

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, దాన్ని మహిళా కిసాన్ దివస్ గా సంఘం ఇప్పటికే ప్రకటించింది. మార్చి 15వ తేదీని కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. ఆ రోజును కార్పోటీకరణ వ్యతిరేక దినంగానూ పాటించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా తన మద్దతును ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమబాట పట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక కూడా దీనికి జత కలిసే అవకాశం ఉంది. ఈ నాయకులు కూడా ఢిల్లీలో తమ గళం బలంగా వినిపించాలని సిద్ధమవుతున్నారు.

Also Read : ఉద్యమాలకు ఊతం ఇచ్చే నిర్ణయాలు

కర్షక, కార్మిక నిరసనోద్యమాలు

ఒక పక్క రైతు సంఘాలు -మరో పక్క కార్మిక సంఘాలు -ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ పోరాట సంఘాల త్రిముఖ యుద్ధంతో త్వరలో దేశ రాజధాని వీధులు దద్దరిల్ల నున్నాయి. ఇవన్నీ విజయవంతంగా జరిగితే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం పెరిగే అవకాశం ఉంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటి ఫలితాలపై ఎంతో కొంత ఫలితం చూపించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.  వంద రోజుల నుండీ నిరాఘాటంగా సాగుతున్న రైతు ఉద్యమం జనవరి 26 తర్వాత కొత్త మలుపు తీసుకుంది. కొంత మార్పు మొదలైంది.

హింసాకాండ తర్వాత పరిణామాలు

రిపబ్లిక్ డే రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మాకంగా మారడం, ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగురవేయడం, విధ్వంసం జరగడంతో కొన్ని రైతు సంఘాలు ఉద్యమం నుంచి తప్పుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా జరిగిన విధ్వంస సంఘటనలను తప్పుపట్టాయి. ఆ సందర్భంలో రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ ఉద్యమ అగ్నిని చల్లార్చకుండా చూశారు. ఆయనకు మద్దతుగా కొన్ని సామాజిక వర్గాలు కూడా జత కలిశాయి. దీనితో ఉద్యమం అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

Also Read : రైతు ఉద్యమంలో దేశద్రోహులు

ఫలించని చర్చలు

రైతు సంఘాల నేతలు – కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య 11సార్లు చర్చలు జరిగాయి. ఏ ఒక్కటీ ఫలించలేదు. చట్టాల అమలును కొన్ని నెలల పాటు వాయిదా వేస్తామని చర్చల్లో భాగంగా కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఆ అంశాలన్నీ లిఖిత పూర్వకంగా కావాలని సంఘాలు కోరాయి. ప్రభుత్వం దీనికి ప్రతిస్పందించ లేదు.ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరికి ఏ మాత్రం విశ్వాసం లేదు. కేంద్ర నిర్ణయాలను పూర్తిగా వాపసు తీసుకోవాలనే రైతు సంఘాలు కోరుతున్నాయి. కొత్త విధానాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయనే కేంద్రం చెబుతోంది. ఈ ఉద్యమం నకిలీ రైతు ఉద్యమమనీ, కమిషన్ ఏజెంట్లు డబ్బులు ఖర్చుపెట్టి నడిపిస్తున్న ఉద్యమంగానూ, ఖలీస్థాన్ ఉద్యమకారులు, మద్దతుదారులు జరిపిస్తున్న అల్లర్లుగానే కొందరు బిజెపి పెద్దలు విశ్వసించి, ఆ దిశగానూ ప్రచారం చేస్తున్నారు.

ఎవరి వాదన వారిది

అదానీ, అంబనీలకు లాభం చేకూర్చడానికే ప్రభుత్వ పెద్దలు ఈ బిల్లులను ప్రవేశ పెట్టారని ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండు వర్గాలదీ మొదటి నుంచీ  ఇదే తీరుగా సాగుతోంది. జనవరి 26వ తేదీన జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం 14మంది పంజాబ్ రైతులు అదృశ్యమయ్యారని, వారి ఆచూకే ఇప్పటి వరకూ తెలియరావడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా విలపిస్తోంది. ఈ వంద రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమ కాలంలో, తీవ్రమైన చలి కారణంగా 108 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతు సంఘాలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు

సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు

మహిళలు, వృద్ధులు ఉద్యమాన్ని విరమించాలనీ సుప్రీం ప్రకటించింది. ఈ సమస్య సత్వరమే పరిష్కారమవ్వాలని, ఆ దిశగా చర్చలు జరపాలని, నివేదికలు సమర్పించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందులోని కొందరు సభ్యులు ఈ బిల్లుల విషయంలో మొదటి నుంచీ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేసినవారేనని కిసాన్ మోర్చా అనుమానించింది. ఈ సభ్యులతో మాట్లాడే ప్రసక్తే లేదని రైతు సంఘం నేతలు ప్రకటించారు. దీనితో, ఆ సభ్యులు కొందరు తప్పుకున్నారు.సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ముందు హాజరవ్వడానికి రైతులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో, వీరి వైఖరిని తప్పు పడుతూ సుప్రీం ధర్మాసనం అసహనాన్ని ప్రకటించింది.

రుతువులు మారుతున్నా మారని రైతుల వైఖరి

ఎముకలు కొరికే చలిలోనూ, జోరు వర్షాలలోనూ సాగిన ఈ ఆందోళనల పర్వం మండే ఎండల్లోనూ ఆగేట్టు ఎక్కడా కనిపించడం లేదు. గత నవంబర్ 26న ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎంత వేడి ఉందో, అంతే వేడిగా, వాడిగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. రాజధాని హస్తిన సరిహద్దు ప్రాంతాలన్నీ నాటి కురుక్షేత్ర యుద్ధ వాతావరణాన్నే తలపింప చేస్తున్నాయి. కరోనా వైరస్ కొత్త రూపాలను సంతరించుకుంటూ దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్ళీ విజృంభిస్తోంది.

Also Read : సర్కార్ కు సుప్రీంకోర్టు దారి చూపుతుందా?

రోజురోజుకూ విస్తరిస్తున్న ఆందోళన

రైతుల ఆందోళనలు కూడా రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. దీనికి తోడు, కనీస మద్దతు ధరపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఎం ఎస్ పి దిలావ్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సంయుక్త కిసాన్ మోర్చా ప్రణాళికలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రచారానికి రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఉద్యమం ప్రారంభమై వందరోజులైనా ఇరువర్గాలు భీష్మించుకొని కూర్చున్నాయి. ఈ ఆందోళనలు భవిష్యత్తులో ఎటువంటి రూపాలను సంతరించుకుంటాయో? సకల రైతుజనుల క్షేమాన్ని కోరుతూ ప్రభుత్వాలు వ్యవహారించాలి. ఇరు వర్గాలు నిష్పక్షపాతమైన వైఖరితో చర్చలు జరిపి, శుభం కార్డు వేయడమే శ్రేయోదాయకం.

Also Read : మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles