Tuesday, December 3, 2024

మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు

వ్యవసాయ బిల్లులను తాత్కాలికంగా కొన్ని నెలలపాటు నిలుపుతామని కేంద్రం చెప్పినా ఉద్యమం ఆగడం లేదు. గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం కొంత మెత్తబడి దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, తాజాగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ‘రిపబ్లిక్ డే’ నాడు తలపెట్టిన ‘పరేడ్’ కూడా జరుపడానికే రైతు సంఘాలు సిద్ధపడుతున్నాయి. ఈ 26న జరగబోయే రిపబ్లిక్ డే ఉత్సవాల లోపే ఉద్యమం సద్దుమణిగేలా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

భిన్నమైన చర్చలు

రైతు సంఘాలతో మొన్న బుధవారం నాడు జరిగిన చర్చలు గతంలో కంటే భిన్నంగా గడిచాయి. రైతు సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడి కమిటీ వేసి, వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోంప్రకాశ్ మొన్న ప్రతిపాదించారు.ఈ కమిటీ నివేదిక వచ్చేవరకూ సాగు చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ వాయిదా వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు ఈ ముగ్గురు మంత్రులు రైతు సంఘాల నేతలకు చెప్పారు. దీనిపై చర్చించుకొని నిర్ణయం చెప్పాలని రైతు సంఘాలను వారు కోరారు.

Also Read : రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు

లిఖితపూర్వక హామీ కోరిన రైతు నేతలు

చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనపై లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు.22వ తేదీ నాడు మళ్ళీ సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. దీంతో, కేంద్రం దిగి వచ్చిందనీ, ఇక ఉద్యమం త్వరలో సమసిపోతుందని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ దిశగా పలు కథనాలు చక్కర్లు కొట్టాయి. ఇది శుక్రవారం వరకూ ఉన్న వాతావరణం. అనుకున్నట్లుగా శుక్రవారం నాడు మళ్ళీ భేటీ అయ్యారు. కానీ, ఆశించినట్లుగా సమావేశం సాఫీగా సాగలేదు.ఇది 11వ విడత సమావేశం. ఇది కూడా అర్ధంతరంగా ముగిసింది. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్ళీ చర్చలు ఎప్పుడు జరుగుతాయో వెల్లడించలేదు. రైతుల వ్యవహారశైలిపై మంత్రులు అసంతృప్తిని ప్రకటించారు.

చట్టాలు నిలుపుచేస్తామన్నా ఆలకించడం లేదు

చట్టాల్లో ఎటువంటి లోపాలు లేకపోయినా, చట్టాలను 18నెలలపాటు ప్రతిష్టంభన చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిందనీ, ఇంతకు మించిన ప్రతిపాదనలు తమ దగ్గర ఇంకేమీ లేవనీ మంత్రులు వ్యాఖ్యానించారు. రైతులు తమ నిర్ణయాన్ని చెబితే, మళ్ళీ మరోమారు చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు వివరించారు. సమావేశం 10 నిమిషాలకు మించి జరుగలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఉద్యమం కొనసాగించడానికి, రిపబ్లిక్ డే రోజున ‘పరేడ్’ (ట్రాక్టర్లతో కవాతు) నిర్వహించడానికే రైతులు సిద్ధపడుతున్నారు. శాంతియుతంగా నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ రైతుల వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా సుప్రీం కోర్టు ఒక కమిటీని ఏర్పాటుచేసింది.

సర్కార్ కు అనుకూలమైన సభ్యులతో కమిటీ

ఈ కమిటీలోని సభ్యులపై రైతు నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులనీ, చట్టాలను సమర్థిస్తూ గతంలో ఎన్నో వ్యాసాలు రాసినవారేననీ ఆరోపణలు చేశారు. అటువంటి సభ్యులతో కూడిన కమిటీ ముందు హాజరయ్యే ప్రశ్నేలేదని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ అంశంలో రైతుల తీరు పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదం మధ్య కమిటీలోని ఒక సభ్యుడు భూపేందర్ సింగ్ మాన్ తప్పుకున్నారు. ఈయన స్థానంలో మరొక సభ్యుడిని భర్తీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Also Read : సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం – రాహుల్ గాంధీ

సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం

ఈ కమిటీకి ఎటువంటి నిర్ణయాధికారం లేదనీ, వీరంతా వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం కలిగిన నిపుణులనీ, కేవలం ఇరు పక్షాల అభిప్రాయాలను వినడం వరకే వీరి పని… అనీ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తంమీద, రైతు సంఘాలు ఢిల్లీలో చేస్తున్న పోరుకు అంతమెప్పుడో తెలియరావడం లేదు. చట్టాలను రద్దు చేయడం వారి ప్రధాన ఎజెండా. చట్టాలను 18నెలలపాటు సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లుగా లిఖితపూర్వకంగా కావాలని మొన్న బుధవారం నాడు కేంద్రమంత్రులకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి.తాజా సమావేశంలో ఈ అంశం ఏమైందన్నది తెలియడం లేదు. ఇరు వర్గాల మధ్య గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. పరిష్కారం దిశగా అడుగులు బలంగా ఎందుకు పడడం లేదు?

ఎక్కడో ఏదో లోపం

ఎక్కడో, ఏదో లోపం ఉంది. కమీషన్ ఏజెంట్లు స్పాన్సర్ చేసి నడిపిస్తున్న నకిలీ రైతు ఉద్యమంగా కొందరు భావిస్తున్నారు. దీని వెనకాల ప్రయోజనాలు ఆశిస్తున్న కొన్ని వర్గాలు పరిష్కార చర్యలను ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నాయని కొందరు విమర్సిస్తున్నారు. తెగేదాకా లాగడం ఇరు వర్గాలకూ మంచిది కాదు.ఈ ఆందోళనలతో ఢిల్లీలోని సాధారణ ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త కరోనా వైరస్ భయం ఒక వైపు- సెకండ్ వేవ్ అనుమానలు మరోవైపు ఉండడంతో రాజధాని గడ గడా వణుకుతోంది. భౌతికదూరం పాటించడం అనే మాట ఎగిరిపోయింది.ఈ రైతు ఉద్యమకాలంలో కొందరు మృత్యువాత పడ్డారు.

గజగజ వణికించే చలిలో వృద్ధులు

ఉద్యమంలో పాల్గొన్నవారిలో చాలామంది వృద్ధులు కూడా ఉన్నారు. గడగడ వణికించే చలి, వృద్ధాప్య సమస్యలు, కరోనా కష్టాలు చుట్టుముట్టిన వాతావరణంలో ఇన్ని వేలమందితో ఇన్ని రోజుల పాటు ఆందోళనలు జరగడం దేశానికి ఏ మాత్రం క్షేమం కాదు. ఇప్పటి వరకూ ఢిల్లీకే పరిమితమైన ఈ ఉద్యమం మెల్లగా వివిధ రాష్ట్రాల్లోకీ వ్యాపిస్తోంది. ఇరువర్గాల పట్ల సామాన్య ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పరిణామం ఉభయులకూ మంచిది కాదు. త్వరలో ఉభయతారకంగా భరతవాక్యం పలకడమే భరతావనికి మంచిది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles