“అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాతశత్రువే అలిగిననాడు… సాగరములన్నియు ఏకము కాకపోవు” అని శ్రీకృష్ణుడు రాయబార ఘట్టంలో చెబితే పట్టుదలకుపోయి రాజరాజు వినలేదు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం సంభవించి, కురు రాజ్యమే అంతరించింది. ఇది నాటి భారతకథ. సక్రమమైన రాయబారం, మంచి చెడ్డలు విచారించి నిర్ణయం తీసుకొనే సహనం, సుశీలం, సాదరత్వం ఉంటే, ప్రతికాలంలోనూ పాలన సజావుగా సాగుతుంది, ప్రజ సుభిక్షంగా ఉంటుంది. హస్తినాపురంలో ఇప్పుడు రైతులు గతంలో కంటే మరింత గట్టిగా ఉద్యమబాట పట్టారు. మంగళవారం నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. క్రమక్రమంగా కొలువుకూటం రణకూటంగా మారుతోంది. రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది.14 రాజకీయ పార్టీలు బాసటగా నిలిచాయి.రాజకీయ పక్షాలేకాక, మిగిలిన వర్గాలు కూడా ఉద్యమం ఉపందుకోడానికే ఊతమిచ్చే దిశగా ఏకమవుతున్నారు.అందరూ కలిసి పెద్ద యుద్ధానికి సిద్ధమవ్వక ముందే సర్దిచెప్పి, సద్దుమణిగేలా చేయడమే వివేకం. కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. ఎలాగైనా వారందరికీ వివరించి, చట్టాలను రద్దు చేయకుండా, కొనసాగించాలని కేంద్రం చూస్తోంది. ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని తఫాలు చర్చలు జరిగినా కథ మొదటికే వస్తోంది.
ఉద్యమం వెనుక కాంగ్రెస్ ఉన్నదనడం హాస్యాస్పదం
ఈ ఉద్యమం వెనకాల, సగం చచ్చిపోయి, సరియైన నాయకత్వం లేక సతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఉందంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదం. ఏదో సామెత చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్ కే అంత బలం వుంటే, దేశంలో ప్రతిపక్ష స్వరం ఇంత బలహీనంగా ఎందుకుంటుంది? అధికారంలో ఉన్న పార్టీలను ఇబ్బంది పెట్టాలనే ప్రతిపక్షాలు చూస్తాయి. అది రాజకీయం, అది అంతే. ఇంత బలంగా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ బలహీనమైన ప్రతిపక్ష పార్టీల గురించి కాదు, బలమైన రైతుల గురించి. 35 రైతు సంఘాలు కలిసి కట్టుగా సాగుతున్నాయి, పట్టుదలగానే ఉన్నాయి. ఈ తరుణంలో, పట్టుదలకు పోకుండా పట్టు-విడుపులు పాటించాల్సింది పాలకులే. తమ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వీటి వల్ల గతంలో ఎన్నడూ లేనంత మేలు రైతులకు జరుగుతుందని, దళారుల మోసాల నుండి మరింత రక్షణ కలుగుతుందనీ, అవగాహన లేకుండా అపార్ధం చేసుకుంటున్నారని పాలక పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ ఎవ్వరూ తగ్గడం లేదు. ఎవరి వాదన వారిదే.
Also Read : భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు
సాయినాథ్ సూచన బాగుంది
గ్రామీణ భారతంపై నిరంతరం అధ్యయనం చేస్తూ, తన వృత్తి జీవితమంతా గ్రామీణ, వ్యవసాయ పాత్రికేయానికే అంకిత చేసుకున్న సుప్రసిధ్ధ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఒక మాట అంటున్నారు. అదేంటంటే… ప్రస్తుతం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయకుండా- కొనసాగించకుండా, తాత్కాలికంగా నిలుపుదల (సస్పెండ్) చేస్తున్నామని ప్రభుత్వం ముందుగా ప్రకటించి, రైతు సంఘాలు, సంబంధిత వర్గాలతో బహిరంగంగా చర్చించి, రైతులకు ఎక్కువ మేలు జరిగే విధంగా, ఉభయతారకంగా ఒక నిర్ణయానికి వచ్చిన పిదప, కొత్త చట్టాల విషయంలో తత్కాల్ నిర్ణయం తీసుకోవడమే ఉచిత మార్గమని సాయినాథ్ సూచిస్తున్నారు. ఇది ఆలోచనాత్మకంగానే ఉంది. అదే సమయంలో, గిట్టుబాటు ధర, లాభసాటి వ్యవసాయం మొదలైన అంశాలపై ఎమ్మెస్ స్వామినాథన్ కమిషన్ ఆరు సంపుటిలలో ఐదు నివేదికలు సమర్పించింది. అవి పదిహేనేళ్ల నుండి తుప్పుపట్టి వున్నాయి. వాటిని ఆచరించకపోగా, కాగితాలు తిరగేసిన దాఖలాలు కూడా లేవు. అప్పుడు, కాంగ్రెస్ /యూ.పి.ఏ ప్రభుత్వాలే ఈ నివేదికలు అందుకున్నాయి.
Also Read : వ్యవసాయ చట్టాలు – రైతులు
స్వామినాథన్ నివేదికపై ఒక్క రోజు సైతం చర్చ జరగలేదు
కనీసం, ఏ ఒక్కరోజూ పార్లమెంట్ లో చర్చబెట్టిన దృశ్యాలు, ఉదంతాలు కనిపించలేదు. ఈరోజు బిజెపి అంటున్నట్లు ఈ ఉద్యమం వెనకాల నిజంగా కాంగ్రెస్ ఉంటే, ఆ పార్టీకి, దాని మిత్ర పక్షాలకు ఇంతకు మించిన ఆత్మ వంచన ఇంకొకటి ఉండదు.అన్నేళ్లపాటు పాలనలో ఉండి, రైతులకు చేసిన మంచి ఏ కోశానా లేకపోగా, ఇప్పుడు కపట ప్రేమ ఒలకపోస్తే, ఆ తీరు సిగ్గుచేటని బిజెపి సైతం ఘాటుగానే ప్రతి విమర్శలు చేస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు, దేశంలోని అన్ని పార్టీలకూ ఈ పాపంలో వాటా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోరకంగా మాట్లాడే నైజం అన్ని పార్టీల నాయకులకూ ఉంది. దాన్ని లోకం గమనిస్తూనే ఉంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు రైతులపట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించకపోతే ఆ పాపం ఊరికే పోదు.
కనీస మద్దతు ధర శాశ్వత పరిష్కారం కాదు
కనీస మద్దతు ధర కల్పించడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది కానీ, అదే శాశ్వత పరిష్కారం కాదు. రైతులు ఉత్పత్తి చేసే ప్రతి గింజా అమ్ముడుపోవడమే కాదు, లాభం రావాలి. సబ్సిడీలు ఉండి తీరాలి. రైతుకయ్యే ఖర్చును లెక్కకట్టడంలోనూ సమగ్రత, స్పష్టతలు ఇంకా రావాల్సివుంది. రైతు కూలీలు, రైతులు, రైతు కుటుంబ సభ్యులు వెచ్చించే సమయానికి, చిందించే ప్రతి చెమట బిందువుకూ ధర కట్టాలి. వీరందరి శ్రమదానానికి విలువ ఉండాలి. వ్యవసాయ క్షేత్రంలో నిలబడే ప్రతి ఒక్కరికీ ఆర్ధికంగా ఉపయోగపడేలా విధానాలు ఉండాలి. ఇదే వారి ఉపాధి మార్గం కాబట్టి ఆ విలువ తెలిసికొని అన్ని ఖర్చులు, కమీషన్లు పోగా నికర ఆదాయం లాభదాయకంగా ఉండేట్టు చేస్తే తప్ప, రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారాలకు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నిలుపుదలకు ఏ ఒక్కరూ తలపట్టుకొని కూర్చోనవసరం లేదు.
స్వామినాథన్ సిఫార్సులే శిరోధార్యం
ఎమ్మెస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలను అమలుజరిపితే, చాలా వరకూ సమస్యలు పరిష్కారమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా విధానాల రూపకల్పన సాగాలి.అందులో కొత్తదనం ఉండాలి. డిమాండ్ – సప్లై సూత్రాలు, ఆగ్రో ఎకానమీ పండితులు చెప్పే ఆచరణీయ మార్గాలు, రైతుల నుండి క్షేత్ర వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి రాష్ట్రంలోనూ, దేశంలోనూ స్టాండింగ్ కమిటీలు ఏర్పాటుచేసి, చర్చలు జరుపుతూ, పర్యవేక్షిస్తూ, పారదర్శకత పాటిస్తూ నూత్న విధానాలను అమలుచేయాలి. ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితిని రాకుండా చేయడమే ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయం లాభదాయకమనే విశ్వాసాన్ని కల్పించాలి. ఈ కరోనా కష్టకాలంలోనూ, దేశ ఆర్ధిక వ్యవస్థను పడిపోకుండా నిలబెట్టింది వ్యవసాయమే. దానికి మూలపురుషుడు రైతన్న. భారతదేశ మూలాలు తెలుసుకొని ముందుకు సాగితే, పాలకులు పదికాలాల పాటు అధికారంలో ఉంటారు.జై కిసాన్.