భారతదేశంలో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం దినదిన ప్రభంజనమై దేశమంతా వ్యాపిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రెవేటీకరణ చేస్తామన్న రోజు వాతావరణం కాస్త నిశ్శబ్దంగా ఉన్నా, గంటల వ్యవధిలోనే నిరసనల పర్వం ఆరంభమైంది. రైతు ఉద్యమం, విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ప్రచండంగా సాగే పరిణామాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రైతుల ఆందోళనలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఉద్యమ ప్రభావం వివిధ సామాజిక వర్గాలను చేరుతోంది. రైతు నేత రాకేశ్ తికాయత్ రాల్చిన కన్నీటి బొట్లు అగ్నికి ఆజ్యం పోశాయి. టికాయిత్ కు మద్దతుగా జాట్ లందరూ ఏకమవుతున్నారు. ఈ ఉద్యమానికి సిక్కులు మొదటి నుంచీ పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ లే రాజ్యమేలుతున్నారంటూ మిగిలిన సామాజిక వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఉత్తరభారతదేశంలో సామాజికంగా బలమైన వర్గాలు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారనీ,మార్పు వేగం పెరుగుతోందనీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం
బీజేపీకి కష్టాలు ఖాయం
ఇవన్నీ బిజెపికి రాబోయే రోజుల్లో నష్టం తెచ్చే పరిణామాలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వరం పెరుగుతోంది. ప్రత్యేకహోదా అంశం పక్కకు వెళ్ళిపోయింది. పోలవరంకు కేంద్రం నుంచి వస్తున్న సహకారం అంతంతమాత్రమే. బడ్జెట్ లో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. విశాఖపట్నం రైల్వే జోన్ అంశం అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుగా మారింది. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల చెల్లింపులు కూడా ఆశాజనకంగా లేవు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వారి చేతుల్లో పెడతామంటున్నారు.
రాజకీయపార్టీలను ప్రజలు ఉపేక్షించరు
రాష్ట్రంలోని వివిధ పార్టీల రాజకీయ స్వార్ధాలు, వ్యక్తిగత ప్రయోజనాల తీరుతెన్నులు ఎలా ఉన్నా, ఉక్కుపరిశ్రమ అంశంలో ఆంధ్రప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. తాడోపేడో తేల్చుకోడానికే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆందోళనల వేడి పెరిగింది. “విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు” అంటూ అప్పుడు ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రజలంతా ఏకమై ఉద్యమించారు. గుంటూరు ప్రాంతానికి చెందిన అమృతరావు విశాఖపట్నం వెళ్లి దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోని అన్ని రంగాలవారూ ఏకమయ్యారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి రగులుతోంది. కార్మిక సంఘాలకు సంఘీభావంగా విశాఖలోని వివిధ సంఘాలు మద్దతుగా ఉద్యమంలో దిగాయి.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి: ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ
ఉద్యమబాటలో విద్యార్థులు
విద్యార్థులు కూడా ఉద్యమబాట పట్టారు.ఈ సెగ స్థానిక నాయకులకు గట్టిగా తగులుతోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎంఎల్ ఏ గంటా శ్రీనివాస్ ఇప్పటికే రాజీనామా సమర్పించారు. పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామంటున్నారు. విశాఖ ఎంపి సత్యనారాయణ కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపిలు పార్లమెంట్ లో తమ గళం విప్పుతామంటున్నారు. విజయవాడలో వివిధ పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, నిరసన ధ్వని బలంగా వినిపించారు.
నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకొని, సంస్థ బలోపేతానికి ప్రత్యామ్నాయ కార్యాచరణ చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. సొంత గనులు ఏర్పాటుచేయడం, రుణాలను ఈక్విటీలుగా మార్చడం, ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా చేయడం వంటి చర్యలు చేపడితే ప్లాంట్ లాభాల బాటలోకి వస్తుందని ముఖ్యమంత్రి ఆ లేఖలో వివరించడం మంచి పరిణామం. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తన స్వరాన్ని వినిపించారు.
Also Read : విశాఖ ఉక్కు : ఉపాధి కోసమే కాదు….`ఆత్మాభిమానం`
సన్నాయి నొక్కుళ్ళవల్ల ఫలితం శూన్యం
సన్నాయి నొక్కుడు మాటలకు కేంద్రం దిగివస్తుందనుకోవడం అమాయకత్వమే. కేంద్రం అంటే భయంతోనే అధికార పార్టీ పెద్దలు, ప్రతిపక్ష పార్టీ పెద్దలు గట్టిగా మాట్లాడలేకపోతున్నారనే చెడ్డపేరు మూటకట్టుకున్నారు. ఈ చెడ్డపేరు నుంచి బయటపడే విధంగా వీరి కార్యాచరణ ఉండాలి. వారి ఆత్మగౌరవాన్ని, నాయకత్వ పటుత్వాన్ని, రాష్ట్ర భక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. అనేక విధానపరమైన అంశాల్లో మౌనంగా ఉన్న ప్రజలు, అన్నివేళలా అదే మౌనం పాటిస్తారని ఎవరైనా అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో పెద్దపోరాటం చేయాల్సిన సమయమే ఆసన్నమైంది. రాష్ట్ర బిజెపి నేతలు, జనసేన కూడా ఈ పోరాటంలో బలంగా నిలవాల్సిన బాధ్యత వుంది.
అధికారపార్టీపైన తోసివేస్తే కుదరదు
రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అధికార పార్టీపై తోసేసి పండగ చేసుకుందామంటే కుదరదు. ప్రజలు ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగానే గమనిస్తున్నారు. రైతు ఉద్యమం ఢిల్లీని గడగడ వణికిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, నేతలకు వెన్నులో చలి మొదలైందనే గ్రహించాలి. ఈ అంశంలో ఆర్ ఎస్ ఎస్ నేతలు కూడా ప్రభుత్వ వైఖరిని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత వరకూ ఉద్యమం ఆపే ప్రశ్నే లేదని రైతులు మరోమారు స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా ఢిల్లీని తాకే వాతావరణం కనిపిస్తోంది.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
దేశరాజధానిలో ఆందోళనలు
దేశ రాజధానిలో ఆందోళనలు చేపడతామని ఇప్పటికే కొందరు ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఏ నిర్ణయాన్నీ ఇంతవరకూ వెనక్కు తీసుకోలేదు. వ్యవసాయ చట్టాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాల్లో కేంద్రం పునరాలోచించకపోతే, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని పరిశీలకులు గట్టిగా నమ్ముతున్నారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం చూపించే సూచనలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొలువుకూటం రణకూటంగా మారింది. మరింత ముదరకుండా విజ్ఞతను పాటిస్తారని ఆకాంక్షిద్దాం.
Also Read : భద్రతా దళాల పహరాలో రైతుల రాస్తారోకో