- ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు
- అడ్డుకున్న సాయుధ బలగాలు
- బారికేడ్లను నదిలో పారేసిన రైతులు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తీవ్ర వాయు కాలుష్యం, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రైతుల ఆందోళనకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయినప్పటికీ ఛండీగడ్, హరియాణా రైతులు ఢిల్లీ చేరుకునేందుకు సరిహద్దుల వద్దకు వేలాది మంది చేరుకున్నారు.
అంబాలా వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ సరిహద్దుల్లోని అంబాలా వద్ద “ఛలో ఢిల్లీ” ఆందోళనకు బయలుదేరిన రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా అంబాలా హైవే వద్ద రైతులను పోలీసులు నిలువరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గుమిగూడి ధర్నా నిర్వహించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగిందిగ్గా పోలీసులు నీటి ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించి రైతులను చెదరగొట్టారు. దీంతో ఆగ్రహించిన రైతులు బారిగేడ్లను తొలగించి నదిలో పడేశారు.
భారీగా బందోబస్తు
ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్, భారతీయ కిసాన్ యూనియన్ లు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆందోళనకు మద్దతుగా హరియాణా, పంజాబ్ ల నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా నుంచి ఢిల్లీ వచ్చే మార్గాల్లో సాయుధ బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల కదలికలను పసిగట్టేందుకు పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
హరియాణా అప్రమత్తం
రైతుల ఆందోళన నేపథ్యంలో హరియాణ అప్రమత్తమైంది. సరిహద్దులలో పోలీసులను మోహరించింది.బారికేడ్లను ఏర్పాటు చేసింది. వచ్చిన రైతులను వెనక్కి పంపించడానికి పోలీసులు వాటర్ కాన్లను సిద్ధం చేసుకున్నారు. వీటితో పాటు హర్యానా నుంచి పంజాబ్ కు వెళ్లే బస్సు సర్వీసులను ఖట్టర్ ప్రభుత్వం రద్దు చేసింది.
కేజ్రీవాల్ విమర్శలు
రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు.