Thursday, November 21, 2024

వ్యవసాయ చట్టాలు – రైతులు

ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఐఏఎస్

గత వారం రోజుల నుంచి ఢిల్లీ పట్టణాన్ని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల‌ రైతులు ముట్టడించారు. ఈ మధ్య కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమోదించిన చట్టాలను  ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ ముట్టడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను కొంతవరకు సవరించడానికి ముందుకు వచ్చిన రైతులు రైతు నాయకులు మాత్రం ఈ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకునేంతవరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని భీష్మించుకుని కూర్చొని ఉన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఈ చట్టాల మీద అ రైతుల నుంచి పెద్దగా స్పందన లేదు. కేవలం పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చట్టం అమలు వలన కనీస మద్దతు ధరతో ఈ రోజు కేంద్రప్రభుత్వం సేకరిస్తున్న వరి, గోధుమల సేకరణకు విఘాతం కలగవచ్చని వారి అనుమానం.

ఈ చట్టాలను గురించి మాట్లాడేటప్పుడు మూడు ప్రధానమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది…

ఈ చట్టాలను చేసేముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించిందా?

ఈ చట్టాలు చేసే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయా?

ఈ చట్టాలు అమలు చేయటం ద్వారా రైతులకు లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా?

ఈ చట్టాలు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించలేదు అని అనటం సరికాదు. ఈ చట్టాలను రూపొందించాలని అనే అంశం గత దశాబ్దంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతూనే ఉంది. ఒక నమూనా వ్యవసాయ సంస్కరణలు చట్టాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక దశాబ్దం కింద పంపించడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రధాన చట్టాలైనా మార్కెట్ యార్డ్ ల చట్టం, ఒప్పంద వ్యవసాయ చట్టంలోని ప్రధాన అంశాలన్నీ ఈ నమూనా వ్యవసాయ సంస్కరణలలో భాగమే. దీనికి అనుగుణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ సవరణలు చేయడం జరిగింది. మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర స్థాయిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా ఈ చట్టాలు తీసుకొని వచ్చింది.

ఇక రెండవ అంశం ఈ చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా అనేది. రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. కానీ వ్యాపారం వాణిజ్యం వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఈ అంశాలు కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి, ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించుకుని ఈ  చట్టాలు చేయడం జరిగింది.

Also Read : దిల్లీ సరిహద్దులో మోహరించిన రైతుల ఆందోళన ఉధృతం

ఈ మూడు చట్టాలలో ఎటువంటి వివాదాం లేని చట్టం నిత్యావసర వస్తువులను చట్టానికి చేసిన సవరణ. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చట్టం. నిత్యావసర వస్తువుల కొరత ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాపారస్తులు పెద్దపెట్టున నిత్యవసర వస్తువులను దాచి పెట్టడానికి వీలు లేకుండా ఈ వస్తువులు ఎంత పరిమాణాల్లో ఉంచుకోవచ్చనే దానిపై కొన్ని ఆంక్షలను పెట్టడం జరిగింది. ఈరోజు నిత్యావసర వస్తువుల విషయంలో అటువంటి కొరతలు లేవు. అంతేగాక వ్యవసాయ వస్తువులను ప్రాసెసింగ్ చేసే సంస్థలు పెద్ద స్థాయిలోనే నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆంక్షలను ఎత్తివేస్తూ, కేవలం విపరీతంగా వ్యవసాయ వస్తువుల ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది. ఈ చట్ట సవరణ వల్ల రైతులకు జరిగే నష్టం ఏమీ లేదు. ఈ మిగిలిన చట్టాలతో పాటు దీనిని కలపకుండా ఉంటే అసలు ఎటువంటి అభ్యంతరాలు  వచ్చి ఉండేవి కావు. ఈనాడు రైతుల తరఫున డిమాండ్ లో కూడా ఇది ప్రధానమైన అంశం కాదు.

ఇక రెండవది ఒప్పంద వ్యవసాయం చట్టం. పెద్ద పెద్ద సంస్థలు కార్పొరేట్లు వ్యవసాయ రంగంలో ప్రవేశిస్తే రైతులకు నష్టం జరుగుతుందని అపోహ బాగా ప్రచారంలో ఉంది. కానీ ఈనాడు వ్యవసాయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం అయితే ఎంతో ఉంది. ముఖ్యంగా పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలను, గిడ్డంగుల నిర్మాణాల్లో, వ్యవసాయ వస్తువులను నిలువ చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి విలువ పెంచడానికి ఈ పెట్టుబడులు ఎంతైనా అవసరం. ఆ పెట్టుబడులు రావటానికి ఒక న్యాయపరమైన విధి విధానాలు ఎంతైనా అవసరం. అవి లేని నాడు ఈ పెట్టుబడులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏ రకంగా చూసినా ఒప్పంద వ్యవసాయ చట్టం రైతుకు మేలే చేస్తుంది కాని కష్టం కాదు. పెద్ద వ్యాపార సంస్థలను నియంత్రించే విధానాన్ని గురించి ఆలోచించుకోవాలి గానీ, అసలే వద్దు అనుకుంటే ప్రపంచ మార్కెట్లో పోటీ పరంగా వ్యవసాయ ఉత్పత్తులలో మనం పూర్తిగా నష్టపోతాం. కానీ ఈ ఒప్పంద వ్యవసాయ చట్టాన్ని అమలు జరపటానికి రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, మద్దతు చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిన చివరికి అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. అందుకని ఈ చట్టాన్ని రాష్ట్రాలతో సంప్రదించి వారి స్థాయి లోనే చేసేటట్టుగా ఒప్పించగలిగితే ఫలితాలు మెరుగుగా ఉండే అవకాశం ఉంది.

Also Read : అన్నదాత అస్త్ర సన్యాసం చేస్తే?

ఇక అన్నిటి కన్నా చాలా వివాదాస్పదమైనది ఈనాడు పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమానికి కారణభూతమైనది వ్యవసాయ మార్కెట్ యార్డ్ ల చట్టం. వ్యవసాయ మార్కెట్ యార్డుల చట్టం క్రింద వ్యవసాయ ఉత్పత్తులను కేవలం మార్కెట్ యార్డ్ లోనే కొనాలి. బయట కొంటె మార్కెట్ యార్డ్ చెక్ పోస్టులలో ఫీజులు చెల్లించాల్సిన విధానం అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంతో ఈ విధానాన్ని సవరించారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ లోనే కాకుండా బయట కూడా ఎవరైనా గాని మార్కెట్ ఫీస్ చెల్లించకుండానే కొనవచ్చు.  దీని ద్వారా జాతీయస్థాయిలో అడ్డంకులు లేని ఒక మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులు ఏర్పడుతుందని ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. చాలా రాష్ట్రాల్లో మార్కెట్ యార్డ్ లు అంత బలంగా లేవు కాబట్టి ఈ చట్ట సవరణకు వ్యతిరేకత రాలేదు. పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో మాత్రం మార్కెట్ యార్డు చాలా బలంగా ఉన్నాయి. ఉండటమే కాదు కేంద్రప్రభుత్వం తన ప్రజాపంపిణీ వ్యవస్థకు కావాల్సిన గోధుమలు బియ్యం ఈ మార్కెట్ యార్డ్ లలో కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. ఇక్కడ మార్కెట్ యార్డ్ లలోకి వచ్చే గోధుమ బియ్యంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి సేకరిస్తూ ఉన్నది. నిజానికి ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 7 మిలియన్ టన్నుల గోధుమలు, 15 మిలియన్ టన్నుల బియ్యం అవసరానికి మించి ప్రభుత్వం సేకరించటం వలన మురిగి పోతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కనీస మద్దతు ధర తాము పండించిన గోధుమలు బియ్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించందేమో అన్న భయం పంజాబ్ హర్యానా ప్రాంతపు రైతుల్లో ఉన్నది. ఆ భయం ఈనాడు ఈ ఉద్యమానికి కారణం. వాస్తవానికి రైతులలో ఉన్న ఆ భయానికి ఈనాటి వ్యవసాయ సంస్కరణల చట్టానికి సంబంధం లేదు. ధాన్యం సేకరణకు రాష్ట్రాల వారీగా కోటాను విధిస్తే ఈ చట్ట సవరణలు లేకున్నా రైతుల  ముందుకు ఆ సమస్య వస్తుంది. మార్కెట్ యార్డ్ ల చట్ట సవరణ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు విస్తృత పరిధి ఏర్పాటు చేయటం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది కానీ నష్టం జరగదు.

Also Read : ఉద్రిక్తంగా మారిన రైతుల “ఛలో ఢిల్లీ” ఆందోళన

పంజాబ్, హర్యానా రైతులలో ఉన్న పై అనుమానానికి నివృత్తి అవసరం. ఏ ప్రభుత్వం అయినా అవసరం లేకుండా పెద్ద ఎత్తున ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి సేకరించలేదు. పెద్ద ఎత్తున వరి గోధుమ పండించడం ద్వారా ఈ రాష్ట్రాలలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. ఈ ప్రాంత రైతులు పప్పు దినుసులు నూనె గింజలు పెద్ద స్థాయిలో పండించే విధంగా పంటల పెంపకంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో కేవలం ఆహారధాన్యాల మాత్రమే ఇచ్చే ప్రస్తుత విధానాన్ని మార్చి వాటితో పాటు పప్పు దినుసులు వంట నూనెలు సరఫరా చేసే విధానాన్ని పెద్ద స్థాయిలో ప్రవేశపెట్టి వాటిని సేకరించే విధానాన్ని కేంద్రప్రభుత్వం మొదలుపెడితే పంటల విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి.

దీర్ఘకాలంలో కేవలం బియ్యం, గోధుమలే పండిస్తాం, మేము పండించిన అంత అవసరం ఉన్నా లేకపోయినా కొనాలి అంటే సాధ్యం కాకపోవచ్చు. పంజాబ్ హర్యానా రైతులు కూడా మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తమ క్రాపింగ్ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరిత విప్లవం మొదటిదశలో అందిపుచ్చుకొని ముందు నిలిచిన వ్యవసాయదారులు ఈ ప్రాంతం వారు. ఈనాడు అధిక విలువ కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను పండించే దిశగా మార్పు చెందకపోతే, కేంద్ర ప్రభుత్వ సేకరణ మీద ఆధారపడిన ఈ విధానం నిరంతరంగా కొనసాగే అవకాశం తక్కువ.

IYR Krishna Rao
IYR Krishna Rao
రచయిత ఐఏఎస్ విశ్రాంత అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. సుప్రసిద్ధ పుస్తక, వ్యాస రచయిత. బీజేపీ నాయకులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles