రైతులకు చలేందివయా!
అతని వొంటిని తాకి వేడెక్కింది.
కోవిడ్ కోరలు పీకే
వీరుడికి భయమేందివయా!
పొలాలు వదిలి
రోడ్డెక్కవలసి రావటమే
దేశమంత విషాదం.
వ్యాపారం
పాముల్లా పాకి వస్తుంటే
బడితె నందుకున్నోడికి
జంకెందుకయా!
విశ్లేషకులదే రోత
వంకరటింకరల గీత
సాదాసీదాగా సత్యం కనిపిస్తుంటే
కొత్తగా చూపిస్తూ మీడియా మోత.
ఢిల్లీ ఎప్పుడూ అంతే!
హృదయ స్థానంలో వున్నా
లబ్ డబ్ లు కరువైన
లబ్బరు బుడగ.
సంక్లిష్ట దేశంలో
ఇస్తిరీ చేయడమంత
పిచ్చిపని ఎక్కడైనా వుందా!
వృత్తిలోని ప్రైడ్ ను తుంగలోతొక్కి
బేహారులతో చర్చలంట
బేకారు మాటలు కాకపోతే.
వద్దంటూనే రాజకీయాలు
చద్దులు వాళ్లే తెచ్చుకున్నారు.
అన్నం తింటున్నావు కదా
గింజల మీద
బతుకు పద్యాలు కనపడవా!
ఢిల్లీ పిల్లిగా మారి
రొట్టె నెత్తుక పోతున్నది
దేశ ప్రజలారా
పారాహుషార్!
మీ కవితకి సహస్ర వందనాలు. జై కిసాన్.