దిల్లీ : రైతులకూ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగే అవకాశం కనిపించడం లేదు. శనివారంనాడు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తోటి కేంద్ర మంత్రులతో, హరియాణ ఉపముఖ్యమంత్రి, రైతు నాయకుడు దుష్యంతో చౌతాలాతో జరిపిన చర్చలు ఫలించలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ పై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లయితే చర్చలకు తాము తయారుగా ఉన్నామని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
రైతులు కోరినట్టు చేయవలసిందే
‘ఏది ఏమైనా రైతు నాయకులతో చర్చలు జరపవలసిందే’ అంటూ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సోంప్రకాష్ అన్నారు. రైతు నాయకులతో చర్చలు జరుపుతున్న ముగ్గురు కేంద్రమంత్రులలో సోంప్రకాష్ ఒకరు. ఒకటి, రెండు రోజులలో చర్చలు జరుగుతాయనీ, ఒప్పందం కుదురుతున్నదనే ఆశాభావాన్ని దుష్యంత్ చౌతాలా కేంద్ర వ్యవసాయమంత్రితో చర్చలు జరిపిన తర్వాత వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధమైన హామీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా అని ప్రశ్నించగా, ‘వారు (రైతులు) కోరినట్టు చేయవలసి ఉంటుంది’ అని చౌతాలా అన్నారు.
14న నిరాహారదీక్ష
పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు కన్వల్ ప్రీత్ సింగ్ పన్నూ దిల్లీ – హరియాణ సరిహద్దులో విలేఖరులతో మాట్లాడుతూ, రాజస్థాన్ నుంచీ ఇతర రాష్ట్రాలనుంచీ రైతుల పెద్ద సంఖ్యతో సరిహద్దుకు చేరుకుంటున్నారనీ, టాయిలెట్లు ఏర్పాటు చేసిన తర్వాత మహిళలు కూడా వచ్చి చేరతారనీ, సంఘర్షణ ఉధృతం చేస్తామనీ అన్నారు. డిసెంబర్ 14న నిరాహారదీక్ష చేపడతామని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేననీ, కానీ ఆ మూడు చట్టాలూ రైతుల ప్రయోజనాలకు కాకుండా వ్యాపారుల ప్రయోజనాలకోసం చేశారని, వాటిని రద్దు చేయడానికి కేంద్రం అంగీకరించిన పక్షంలోనే చర్చలకు తాము వెడతామని కన్వల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.
ఎంఎస్ పీకి కట్టబడి ఉన్నాం : చౌతాలా
‘ఉమ్మీద్ పర్ దునియా ఖాయం హై (ఆశపైనే ప్రపంచం నడుస్తోంది)’ అంటూ రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ నూ, రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ ను కూడా కలుసుకున్న దుష్యంత్ చౌతాలా వ్యాఖ్యానించారు. ‘కనీస మద్దతు ధర విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము. నేను ప్రభుత్వంలో ఉన్నంతకాలం ప్రతి రైతుకూ కనీసం మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్ పీ) చెల్లించి తీరుతాము. హరియాణలో సుస్థిరత కొనసాగుతుంది,’ అంటూ చౌతాలా అన్నారు. చౌతాలా బీజేపీతో కలసి హరియాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన నాయకత్వంలోని జేజేపీలో చీలిక వచ్చినట్టు, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్టూ వార్తలు వస్తున్నాయి.
రైతు ఐక్యత భగ్నానికి కేంద్రం ప్రయత్నం
చౌతాలాతో చర్చల తర్వాత తోమార్ 29 మంది హరియాణ రైతు నాయకులతో సమాలోచన జరిపారు. బీకేయూ (మన్) నాయకుడు గుణి ప్రకాశ్ రైతుల తరఫున కేంద్రమంత్రికి సమర్థన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలతో మూడు చట్టాలూ తమకు ఆమోదయోగ్యమేనంటూ ఆయన ప్రకటించారు. రైతుల మధ్య చీలిక తేవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అక్కడక్కడ ఫలిస్తున్నది. మొత్తం మీద రైతులు దృఢచిత్తంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 165 ప్లాజాల దగ్గర పికెటింగ్ చేశారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారు. దిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధనానికి సన్నాహాలు జరుగుతున్నాయి.